.
‘‘60 లక్షల సభ్యత్వాలు ఉండీ ఎందుకు ఓడిపోయాం..?’’ ఇదీ కేసీయార్ వాస్తవంలోకి, వర్తమానంలోకి వచ్చి తన కేడర్‌కు వేసిన ప్రశ్న… అంటే తనకు తానే వేసుకుంటున్న ప్రశ్న… నిజాయితీగా సభ్యత్వాలపై, క్రియాశీలతపై, సంఖ్యపై, ప్రభావంపై ఓసారి నిజాయితీగా, నిఖార్సుగా ఆత్మమథనం చేసుకోవాల్సిన ప్రశ్న… ఉజ్జాయింపుగా ఓ లెక్క వేద్దాం… ఈ లెక్క ఆయన కోసమే… దాని కోసమే…
తెలంగాణ జనాభా గణన (SEEEPC-2024 & తాజా అంచనాల ప్రకారం)… రాష్ట్ర జనాభా 3.55 కోట్లు… అందులో 15 ఏళ్లలోపు స్కూల్ పిల్లల్ని తీసేయండి… జనాభాలో 24 శాతం, అంటే 85.3 లక్షలు… మిగిలింది 2.70 కోట్లు…
Ads
70 ఏళ్లు పైబడిన వారు సుమారు 4 శాతం అంటే 14.2 లక్షలు… ఇక మిగిలింది, అంటే నిజ జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించగలిగినవారు 2.56 కోట్లు… పార్టీల సభ్యత్వాలుండని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8 లక్షలు… ఇక మిగిలింది 2.48 కోట్లు…
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్కటే కాదు కదా… కేసీయార్ స్వయంగా కాంగ్రెస్‌ను ఖతం చేద్దామని ఎంత ప్రయత్నించి, ఎంత తొక్కినా, లీడర్లను ప్రలోభపెట్టి లాగేసుకున్నా… కేడర్ ఉంటుంది కదా… కమిటెడ్ కేడర్ ఉన్న లెఫ్ట్ పార్టీలున్నాయి కదా… ప్లస్ ఎనిమిది లోకసభ స్థానాలు గెలిచిన బీజేపీ ఉంది కదా… ఆ పార్టీలు చెప్పుకుంటున్న లెక్కలను బట్టి… ఇతర పార్టీల సభ్యత్వాలు 75 లక్షలు (కాంగ్రెస్ 30 లక్షలు, బీజేపీ 40 లక్షలు, లెఫ్ట్ 5 లక్షలు సుమారుగా…) ఇక మిగిలింది 1.73 కోట్లు… ఇతర పార్టీల సభ్యత్వాలున్న కుటుంబ సభ్యులను కూడా కలిపితే మరో 75 లక్షలు కనీసంగా… అంటే మిగిలేది కోటికి లోపు…
అందులో తటస్థులు, రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్లు 40 లక్షలు తీసేసినా ఇక మిగిలేది 60 లక్షలు… సరే, ఆ 60 లక్షల మందీ బీఆర్ఎస్ సభ్యులే అనుకుందాం… మరి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చిన వోట్లు 87 లక్షలు, అంటే ప్రతి సభ్యుడు తను గాకుండా మరో సగం వోటును కూడా వేయించనట్టే కదా… ఇప్పుడు ఆలోచించండి, ఈ సభ్యత్వాల లెక్క ఎంత క్రియాశీలకమో, ఎంత అసంబద్ధపు అంకెలో… అదుగో ఆ సభ్యత్వాల సంఖ్య తాలూకు భ్రమల్లో ఉండటం కూడా ఓటమికి ఓ కారణం… కేసీయార్ మాటల్లో అర్థమయ్యేది కూడా అదే…
సాధారణంగా ఏం జరుగుతుంది..? ఒకే వ్యక్తికి రెండు పార్టీల సభ్యత్వాలు ఉండటం… కుటుంబ సభ్యులందరినీ పార్టీ సభ్యులుగా పరిగణించడం… బీమా కోసమో, మొహమాటం కోసమో, అవసరమైతే సాయం చేస్తారనే ఆశ కోసమో రెండేసి పార్టీల్లోనూ సభ్యులుగా ఉంటారు చాలామంది…
సో, పార్టీలు చెప్పుకునే సభ్యత్వాల లెక్కలకూ, సాధించే వోట్లకు పొంతన ఉండదు… కారణం, పార్టీ సభ్యుడైనా సరే వేర్వేరు కారణాలతో వేరే పార్టీకి వోటేయడం, ప్రభుత్వ వ్యతిరేకత, డబ్బు, ప్రలోభాలు, స్థానిక నాయకత్వం ఇలా బోలెడు కారణాలు…
60 లక్షల సభ్యులున్న బీఆర్ఎస్‌కు ప్రతి సభ్యుడు మరో వోటు వేయించినా 1.2 కోట్ల వోట్లు రావాలి కదా.., కానీ గత ఎన్నికల్లో వచ్చినవి 87 లక్షలు… అంటే అర్థమవుతోంది కదా… సభ్యత్వాలు వేరు, క్రియాశీల సభ్యత్వాలు వేరు, నిబద్ధ సభ్యత్వాలు వేరు, నిజమైన కార్యకర్తలు వేరు… సభ్యత్వాల సంఖ్య ఎప్పుడూ బలుపు కాదు, కేవలం వాపు మాత్రమే…
రాజకీయ పార్టీలు సభ్యత్వ డ్రైవ్ చేపట్టినప్పుడు కింది స్థాయి నాయకులు తమ టార్గెట్ రీచ్ అవ్వడానికి … ఒకే వ్యక్తిని పదేపదే నమోదు చేయడం, సమ్మతి లేకుండానే పాత డేటా ఆధారంగా పేర్లు చేర్చడం, ఓటర్ లిస్టులో ఉన్న పేర్లను నేరుగా సభ్యత్వ బుక్కుల్లో రాసేయడం వంటివి జరుగుతుంటాయి… అందుకే ఇవి కేవలం “కాగితపు సభ్యత్వాలు” గానే మిగిలిపోతాయి…
60 లక్షల మంది సభ్యులు ఉన్న పార్టీకి 87 లక్షల ఓట్లు రావడం అనేది ఆ పార్టీ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సభ్యులను ఓటర్లుగా మార్చడంలో విఫలమైందని సూచిస్తుంది… అందుకే ఎలాగూ పార్టీ కమిటీలన్నీ రద్దు చేశాడు కదా కేసీయార్… ఇప్పుడు సభ్యత్వ సేకరణ నిఖార్సుగా చేయిస్తే… అప్పుడు తేలుతుంది అసలైన సభ్యత్వాల సంఖ్య…!!
నిజం… రాశి కాదు, వాసి ముఖ్యం… వర్తమానంలోకి, వాస్తవంలోకి దిగి వస్తే కేసీయార్‌కు ఇప్పుడు అర్థమవుతున్న కఠోర నిజం..!!
Share this Article