.
Subramanyam Dogiparthi ….. 1981వ సంవత్సరం చిరంజీవికి కలిసొచ్చిన సంవత్సరం . ఆనాటి టాప్ హీరోలు NTR , ANR లతో సమానంగా రెండు సిల్వర్ జూబిలీ సినిమాలు వచ్చాయి ఈ సంవత్సరంలో . ఆ రెండింటిలో ఒకటి ఈ చట్టానికి కళ్ళు లేవు సినిమా .
ఇందులో చిరంజీవి చిలిపిగా , హుషారుగా , ఎనర్జిటిక్ గా నటించారు . చిరంజీవికి 36వ సినిమా . హీరోగా 16వ సినిమా . ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రేక్షకులకు బాగా నచ్చింది చిరంజీవి , లక్ష్మిల అక్కాతమ్ముళ్ళ అనుబంధం , ఒకరి మీద ఒకరు సవాలు , లక్ష్మి ఉడుకుమోతుతనం ముచ్చటగా ఉంటాయి . వీరిద్దరి నటనే ఈ సినిమా బలం .
Ads
కధ రొటీన్ పగ , కక్ష సాధించటమే . కానీ , సినిమాగా బ్రహ్మాండంగా ప్రెజెంట్ చేసారు . తమిళంలో సక్సెస్ అయిన సట్టమ్ ఒరు ఇరుట్టారై ఆధారంగా తెలుగులో పునర్నిర్మితం అయింది . రెండు భాషల్లోనూ యస్ ఎ చంద్రశేఖరే దర్శకత్వం వహించారు . ఆయన భార్య శోభ కధను సమకూర్చారు . వీరిద్దరి కుమారుడే ప్రస్తుత తమిళ సూపర్ హీరో విజయ్ .
ఈ సినిమా ఐకానిక్ సాంగ్ చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ సూపర్ డూపర్ హిట్ సాంగ్ . చక్రవర్తి శిష్యులు కృష్ణ-చక్రల సంగీత దర్శకత్వంలో బాలసుబ్రమణ్యం చాలా బాగా పాడారు . మిగిలిన పాటలు ఇది దేవరహస్యం , కలిసిపో కళ్ళలో , ఎవ్వరికీ చెప్పొద్దు థియేటర్లో బాగానే ఉంటాయి . పాటలను అన్నీ మైలవరపు గోపియే వ్రాసారు . మాటలు కూడా ఆయనవే .
తమ్ముడిని పట్టుకోవడానికి లక్ష్మి టేప్ రికార్డర్ రహస్యంగా పెట్టి డ్రామా ఆడితే చిరంజీవి అనుకోకుండా కనిపెట్టి, దాన్ని తిప్పికొట్టే సీన్ సినిమాలో హైలైట్… అనుకున్నదొకటి అనే పాట వచ్చి, లక్ష్మి ఎడ్డిమొహం వేయగానే థియేటర్లలో చప్పట్లు, ఈలలు…
హీరోయిన్ మాధవి సినిమాలో డాన్సర్ కావటం వలన జయమాలిని , జ్యోతిలక్ష్మి అవసరం పడలేదు . రెండు క్లబ్ డాన్సులూ ఆమే చేసింది . పండరీబాయి , రమణమూర్తి , నారాయణరావు , కన్నడ ప్రభాకర్ , సిలోన్ మనోహర్ , హేమసుందర్ , పి జె శర్మ , ప్రభాకరరెడ్డి , రావి కొండలరావు , సారధి , మాడా ప్రభృతులు నటించారు .
పది కేంద్రాల్లో వంద రోజులు , మూడు కేంద్రాల్లో 175 రోజులు ఆడింది . హిందీ , కన్నడం , మళయాళం , సింహళం భాషల్లో కూడా రీమేక్ చేయబడింది . అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాత . సినిమా యూట్యూబులో ఉంది .
ఈ సినిమా చూడని చిరంజీవి అభిమానులు ఉండరు . ఎవరయినా ఒకరూ అరా ఉంటే చూసేయండి . అలాగే లక్ష్మి అభిమానులు కూడా . ఈ సినిమా వీరిద్దరిదే . An entertaining , action , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article