ఇండియాటుడే నిర్వహించిన state of states సదస్సు… మోడరేటర్ తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న వేశాడు… కొన్నేళ్లుగా మీ ర్యాంకింగ్ పడిపోయింది, మీ జీడీపీ తగ్గిపోయింది, మీ తలసరి ఆదాయం దెబ్బతిన్నది, ఎందుకిలా..? గుజరాత్ అభివృద్ధి చూడండి, దూసుకుపోతోంది… ఇదీ ప్రశ్న… క్షణంలో వందోవంతు కూడా తడబడలేదు తమిళనాడు ఆర్థికమంత్రి… పేరు పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్…
‘‘జీడీపీ లెక్కలు, తలసరి ఆదాయం లెక్కలు మాత్రమే అభివృద్ధి సూచికలు కాదు… తమిళనాడులో 15 వయస్సులోపు బాలికల్లో ఒక్కరూ బడి బయట లేరు… కానీ గుజరాత్‌లో అలాంటివాళ్ల సంఖ్య 15 నుంచి 20 శాతం… తమిళనాడులో ప్రతి వెయ్యిమందికి నలుగురు డాక్టర్లున్నారు… కానీ గుజరాత్‌లో ఒక్కరు మాత్రమే… ఏది అభివృద్ధి..? దాన్ని ఏ కోణంలో చూడాలి..? జీడీపీ లెక్కలేమీ అంతిమం కాదు, అవి మాత్రమే అభివృద్ధి సూచికలు కావు… ఎస్, ఆ లెక్కల్లో కూడా నంబర్ వన్ ర్యాంకుకు వెళ్తాం…
మానవవనరుల విషయానికొస్తే మా రాష్ట్రంలో ఉన్నత విద్యలోకి 52 శాతం విద్యార్థులు ఎంటరవుతున్నారు… జాతీయ సగటుకన్నా డబుల్… అమెరికాకన్నా బెటర్… ఫస్ట్ జనరేషన్, అంటే ఈతరంలోనే చదువుకుంటున్నవారికి ఏం చదవాలో చెప్పేవాళ్లు లేరు… డిగ్రీలు తీసుకుంటున్నాం, కానీ వాటి క్వాలిటీ ఎంత..? నైపుణ్యాల కొరత తీవ్రంగా ఉంది… అవసరాలకూ, మన చదువులకూ నడుమ భారీ గ్యాప్… ఎంచుకున్న రంగం, కోర్సులో నాణ్యమైన నైపుణ్యాన్ని మేం అందించాలి… ఆవైపే అడుగులు వేస్తున్నాం… అందుకే ప్రతి స్కూల్‌లో కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్లను నియమిస్తాం…
Ads
మేం కేవలం తమిళనాడు అవసరాలకు పరిమితమై ఆలోచించడం లేదు… ప్రపంచానికి అవసరమైన నాణ్యమైన మానవవనరులకు తమిళనాడు ఓ ఉత్పత్తి కేంద్రం కావాలి… తమిళ గత చరిత్ర కూడా అదే……’’ ఇదే కాదు, కేంద్రం-రాష్ట్రాల సంబంధాలు, అధికారాల వికేంద్రీకరణ వంటి చాలా అంశాలపై ఎక్స్‌టెంపర్‌గా, సూటిగా భలే మాట్లాడాడు… ముచ్చటేసింది… తన ఆలోచన ధోరణిని పట్టి ఇచ్చిన ఉదాహరణ ఇది… ఒక ఆర్థికమంత్రి ఎలా ఉండాలో స్టాలిన్ చూపిస్తున్నాడు… ఈ మంత్రి ఎంపిక అదే… అయిదుగురు అంతర్జాతీయ ఆర్థిక సలహాదార్లను పెట్టుకున్నారు… ఫలితం వదిలేయండి, ఓ మంచి ఎఫర్ట్ కనిపిస్తోంది… ఇలాంటివాళ్లు కదా ఆర్థికమంత్రులుగా పనిచేయాల్సింది…
చదువుకున్నవాళ్లే కాదు, తమ సమాజం చరిత్ర, ఆత్మ, అవసరం గుర్తించగలిగినవాళ్లు కావాలి… ఆర్థిక పరిభాషలో కాదు, సొసైటీ అభివృద్ధి జనం కోణంలో చూడగలగాలి… త్యాగరాజన్ అలాంటివాడే… ఓరకమైన విరక్తి కలిగేది కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను చూస్తుంటే..! పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులూ అంతే… జస్ట్, బ్యూరోక్రాట్లు ఏది చెబితే అదే… అన్నట్టు ఈ తమిళ త్యాగరాజన్‌ది బలమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబమే…
1936లో మద్రాస్ ప్రెసిడెన్సీకి పీటీ రాజన్ అనే ముఖ్యమంత్రి ఉండేవాడు… జస్టిస్ పార్టీకి చివరి అధ్యక్షుడు ఆయన… అదుగో, ఆయన కొడుకు పీటీఆర్ పళనివేల్ రాజన్… ఆయన తమిళనాడు స్పీకర్‌గా, మంత్రిగా కూడా చేశాడు… ఆయన కొడుకు పేరు పీటీఆర్ త్యాగరాజన్… ఇప్పుడు మనం చెప్పుకునే కథానాయకుడు ఈయనే… అబ్బే, ఇక్కడా కుటుంబ వారసత్వమేనా అని తేలికగా తీసిపడేయకండి… త్యాగరాజన్ Lawrence School, Lovedale లో స్కూలింగ్… తరువాత తిరుచిరాపల్లి (తిరుచ్చి) రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఇప్పుడు ఎన్ఐటీ)లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు… తరువాత అమెరికా… State University Of New York, Buffalo లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు… అక్కడే పీహెచ్‌డీ కూడా… MIT Sloan School Of Management లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశాడు… ప్రధాన సబ్జెక్టు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్…
అమెరికన్ యువతి మార్గరెట్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆమె కూడా ఇంజనీరే… ఆయన పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు ఆమె పీజీ చేస్తోంది యూనివర్శిటీలో… అక్కడే ప్రేమ… తను Lehman Brothers Holdings లో… తరువాత Standard Chartered Bank లో మంచి పొజిషన్లలో పనిచేశాడు… 2006-07లో తండ్రి మరణించాడు… వాళ్లది మధురై సెంట్రల్ నియోజకవర్గం… తమిళనాడు తరహా రాజకీయాల్లోకి రావడంకన్నా మంచి టాప్ కంపెనీల్లో కొనసాగడమే మేలనీ, ప్రస్తుత రాజకీయాలు మరీ మురికి కంపు కొడుతున్నాయనీ స్నేహితులు చెప్పారు… కానీ తను అన్నీ విడిచిపెట్టి వచ్చేశాడు…
వచ్చే ముందు భార్యను అడిగాడు, ఆమె కూడా తన వెంట సంతోషంగా వచ్చేసింది… ఆమెకు చీరకట్టు, భాష సహా దక్షిణ తమిళనాడు కల్చర్ మొత్తం నేర్పించింది ఆయన తల్లి… మదురై సెంటిమెంట్ కదా, ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు… అచ్చంగా ఓ భారతీయ గృహిణి అయిపోయింది… త్యాగరాజన్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేది… 2016లో కూడా తను ఎమ్మెల్యే అయ్యాడు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… త్యాగరాజన్ వంటి విద్యాధికులు, సొసైటీని వాస్తవ అవసరాల కోణంలో చూడగలిగేవాళ్లు రాజకీయాల్లోకి రావాలి… సంపాదన ఎట్సెట్రా విషయాలు వదిలేయండి… స్థూలంగా రాజకీయాల తీరు, పాలసీ వ్యవహారాలు మారుతాయి…! నొటోరియస్ ఐఏఎస్ అధికారుల సొంత పైత్యాలు కూడా తగ్గుతాయి… కనీసం అలా ఆశిద్దాం…!!
Share this Article