ఎవడి ఇష్టం వాడిదే… మరీ మీడియాకు కరోనాను మించిన స్వేచ్ఛ… అరాచకం… వాడెవడో ఒకడు మొదలుపెడతాడు… ఇంకేం..? మరీ ప్రత్యేకించి తెలుగు మీడియా చెవుల్లో ఎడ్డిపూలు పెట్టుకుని చకచకా రాసేసి, అచ్చేసి, ఆ పూలను పాఠకులకు బదిలీ చేస్తుంది… అవును మరి, అంతిమంగా ప్రజలు అంటే అందరికీ లోకువే కదా… ఇప్పుడు ప్రపంచమంతా ఒమిక్రాన్ పేరు… వ్యాప్తి మహావేగం… కానీ దానికి మరీ ప్రాణాలు తీసేంత సీన్ లేదని దక్షిణాఫ్రికా వైద్యులు తేల్చేశారు… నిజంగానే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది… కానీ మామూలు తలనొప్పి, జలుబు, జ్వరం, విటమిన్ మాత్రలతో ఒమిక్రాన్ కథ ముగిసిపోతోందని మన టిమ్స్, మన ఎయిమ్స్ వైద్యులు కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారు… అసలు 90 శాతం మందికి తమకు ఒమిక్రాన్ సోకినట్టు కూడా తెలియడం లేదనీ, లక్షణాలు లేవనీ చెబుతున్నారు…
ఏదో పేరు పెట్టాలి, భయాన్ని క్రియేట్ చేయాలి, వేక్సిన్లు అమ్మాలి, మందులు అమ్మాలి, ఉత్పాతాన్ని సొమ్ముచేసుకోవాలి… ఇదే కదా డ్రగ్, మెడికల్ మాఫియా తహతహ… వాటికి మీడియా వత్తాసు… ఆమధ్య డెల్టా వైరస్, ఒమిక్రాన్ కలిసి విరుచుకుపడుతున్నయ్ అని ప్రచారం స్టార్ట్ చేశారు… దానికి వాళ్లే పేరు కూడా పెట్టేశారు… డెమోక్రాన్ అట… కానీ ఈ భయవిక్రయం వర్కవుట్ కాలేదు… ఎవడుపడితే వాడు పేర్లు పెట్టడానికి వీల్లేదు, అసలు డెమోక్రాన్ అనేదే పెద్ద బోగస్ ప్రచారం… అది మనం గత కథనాల్లో వివరంగానే చెప్పుకున్నాం… ఇప్పుడు కొత్తగా ఫ్లోరోనా అట…
Ads
చాలా సింపుల్ ఫ్లూ వైరస్, కరోనా వైరస్ కలిసిపోయాయట… వినాశమేనట… అంతేకాదు, ఈ కలయిక న్యూమోనియా, ఏఆర్డీఎస్, ఆర్గన్ ఫెయిల్యూర్, స్ట్రోక్, మెదడువాపు వంటి సకల వ్యాధుల్నీ కలిగిస్తాయట… ఎందుకోమరి కేన్సర్, ఎయిడ్స్, పక్షపాతం గట్రా వస్తాయని చెప్పలేదు… బతికించారు… అటు ఇన్‌ఫ్లుయెంజా, ఇటు కరోనా వైరస్ వేక్సిన్లను ఒకేసారి గుచ్చేస్తే బెటరని WHO కూడా చెప్పేస్తున్నదట… ఇది కూడా డెమోక్రాన్ ప్రచారంలాగే వర్కవుట్ అవుతుందో లేదో… ఎందుకైనా మంచిది, ఇంకేమైనా కొత్తవి అర్జెంటుగా కనిపెట్టి వదలండి మాఫియా బ్రదర్స్… మన పని అదే కదా…
పోనీ, ఎయిడ్స్ వైరస్ కూడా కలిస్తే ఎయిరోడ్… డెంగీ వైరస్ కలిస్తే డెంగరోనా… ఎబోలాతో సంకరం చేసి ఎబోవిడ్… జికా వైరస్ కలిస్తే జికోవిడ్… మంకీపాక్స్ కలిస్తే మంకరోనా… నిఫా వైరస్‌తో కలిసిన హైబ్రీడ్ అయితే నిఫోనా…. మీ ఇష్టంర భయ్… పేర్లు పెట్టేయండి, ప్రచారాలు చేసేయండి… వేక్సిన్లు గుచ్చేయండి… నాలుగో విడతతో వేక్సినేషన్ దాకా ఎందుకు సరిపుచ్చాలి..? అయిదు, ఆరు, ఏడు… పోనీ, ఏటా రెండుసార్లు… వోకేనా..? లేకపోతే ఏమిటండీ ఇది..? ఎవరో ఒక రోగికి ఫ్లూ వచ్చింది, తనకే కోవిడ్ సోకింది… ఇంకేముంది..? డబుల్ ఇన్‌ఫెక్షన్, ఇది మరో వేరియంట్, ఇక ఈ లోకం కథ సమాప్తం అన్నట్టుగా ఈ ఏడుపులు ఏమిటి..? ఈ భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం ఏమిటి..?
సేమ్, నిన్న ఎవరో ఒమిక్రాన్‌తో మరణించారని గగ్గోలు… తన మరణకారణాలు వేరు అని వైద్యులు చెప్పినా సరే, ఎవరూ వినిపించుకోరు… ముందుగా జనాన్ని భయపెట్టేయడమే కర్తవ్యంగా సాగుతుంటయ్ మన మీడియా సంస్థలు… గొప్ప దేశసేవ, ప్రజాసేవ… పోనీలెండి, మన ప్రభుత్వాలే అలా తయారయ్యాయి… మిగతావాళ్లను ఏం నిందించినా ఏం ఫలం..? అసలు రోగం అధికార వ్యవస్థల్లో దాగి ఉంది కదా…!! మంచినీళ్ల సీసా ధరకు వేక్సిన్ ఇస్తానన్న టీకాసురులు ఇంత భారీ ధరలకు ఎందుకు అమ్ముతున్నారు..? ఒక్కరైనా ఆలోచించారా..? నెవ్వర్, అలా ఆలోచిస్తే వాటిని ప్రభుత్వాలు అనరు కదా…!!
Share this Article