అసలు జూనియర్ ఎన్టీయార్ వంటి సూపర్ స్టార్‌డం ఉన్న హీరోయే ప్రధాన ఆకర్షణ… తనకు ఇతరత్రా స్టార్ అట్రాక్షన్ తోడు నిలవాల్సిన అవసరమే లేదు… తనే ఒంటి చేత్తో సినిమాను మోయగలడు, లాగగలడు… కానీ దేవర సినిమాలో ఎందరో నటీనటులు, ఎన్నో పాత్రలు…
అవన్నీ ఈ సినిమాకు పాన్ ఇండియా లుక్కు తీసుకొస్తాయనీ, మార్కెటింగ్ వ్యూహాల్లో ఇదీ ఒకటని అనుకున్నాడేమో దర్శకుడు కొరటాల… కానీ ఎవరికీ సరైన ప్రాధాన్యం లేదు… ఎవరికీ సరైన స్క్రీన్ స్పేస్ లేదు… అసలు హీరోయే డబుల్ యాక్షన్… ఆ రెండు పాత్రలే చాలా స్పేస్ మింగేస్తాయి… ఇక వేరే వాళ్లకు స్కోప్ ఎక్కడుంటుంది..?
ఆహా, ఓహో, అంతటి అతిలోక సుందరి శ్రీదేవి బిడ్డను తొలిసారిగా తెలుగులో నటింపజేస్తున్నాం అని జాన్విని తీసుకొచ్చారు… ఒక పాటలో కాస్త మెరిసింది… అందాల్ని ఆరబోయడానికి ప్రయత్నించింది… అంతేతప్ప ఆ పాత్రకు ప్రయారిటీ లేదు… 15, 20 నిమిషాలకు మించి ఆమె కనిపించదు, అదీ ఇంటర్వెల్ తరువాత… మరి ఫాయిదా..?
Ads
అంతేనా..? బహుభాషాచిత్రం లుక్కు కోసం, లెక్క కోసం… మలయాళం నుంచి షినో టామ్ చాకో, తమిళం నుంచి కళయారసన్, హిందీ నుంచి సైఫ్ అలీ ఖాన్, నడుమ నేనూ ఉన్నానోచ్ అనడానికి తెలుగు శ్రీకాంత్… అదనంగా మురళీశర్మ, అభిమన్యుసింగ్ సరేసరి… నడుమ గెటప్ శ్రీను పాత్ర దేనికో దర్శకుడికే తెలియాలి… కాస్త సైఫ్ అలీఖాన్ భైరా పాత్ర తప్ప మిగతా పాత్రలకు అసలు ఏం ప్రాధాన్యం ఉంది..? ఎందుకు వీళ్లంతా..?
వీళ్లు సరిపోనట్టు… పాత నటి తాళ్లూరి రామేశ్వరి, జరీనా వాహెబ్‌లు కూడా… అయ్యా, కొరటాల సాబ్, ఎందుకు వీళ్లతో నింపేసినట్టు..? వాళ్లను సముచితంగా కథానుసారం వాడుకున్నదెక్కడ మరి..? హేమిటో… సైఫ్ ఉన్నాడు కదాని హిందీ ప్రేక్షకులు ఇది మా సినిమాయే అని భ్రమిస్తారా..? ఓ కళయారసన్ కనిపించగానే తమిళ ప్రేక్షకులు చప్పట్లతో కనకవర్షం కురిపిస్తారా..? దేవర అని మాత్రమే కాదు, పాన్ ఇండియా అంటూ వస్తున్న ప్రతి సినిమాలోనూ ఇదే తంతు.,.
నిజంగా ఒక జూనియర్ ఎన్టీయార్ వంటి హీరోకు ఈ అదనపు ఆకర్షణలు అవసరమా..? ఆర్ఆర్ఆర్ తరువాత తనే పాన్ ఇండియా హీరో అయ్యాడు… ఇంకా అదనపు మేకప్పులు దేనికి..? కాంతారలో ఎవరున్నారని అంత సూపర్ హిట్… హనుమాన్‌లో ఏ స్టార్స్ ఉన్నారని ఇరగదీసింది… ఒక కార్తికేయలో ఏ భాషా నటీనటులున్నారని హిందీలో రెచ్చిపోయి ఆడింది..? కావల్సింది సినిమాలో సరుకు… ప్రజెంటేషన్‌లో దమ్ము… అంతెందుకు..? పుష్ప రాకముందు బన్నీ హిందీలో ఎవరికి తెలుసు..? ఆ సినిమా రికార్డులు తెలిసినవే కదా…
రాబోయే మంచు కన్నప్పలో కూడా అల్లాటప్పా నటులు కాదు, ఇతర భాషల స్టార్ హీరోల్ని తీసుకొస్తున్నారు… వీళ్లకు తగిన పాత్రల సృష్టి ఓ పెద్ద ప్రయాస… ఇందరి బరువుతో ఆ కథ వంగిపోతుందా..? అసలు కథ ఎక్కడికో పోయి ఓ కొత్త కన్నప్ప కథను ఆవిష్కరిస్తారా..? వేచిచూడాలి..!! (అతడు సినిమాలో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ ఒకటుంది… అన్ని బళ్లెందుకురా బుజ్జీ అని… అది గుర్తొస్తోంది…)
Share this Article