.
Mohammed Rafee …. హలో స్టార్స్, సింగిల్ ఎజెండాతో రాలేరా? – ఢిల్లీలో స్టాల్ ఎందుకు? ఏముందని? …. మెగాస్టార్ చిరంజీవి పక్క రాష్ట్రం కూడా అవార్డులు ఇవ్వాలన్నారు! నిజమే, కళాకారులకు సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రోత్సాహాన్ని ఇస్తాయి! ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తాయి! ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా ఇచ్చేవి ఇస్తారు, కాసేపు అవార్డుల గురించి పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళ్దాం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు పిలుపు ఇచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయ్యింది! “మాకు అక్కడ 100 ఎకరాలు ఇవ్వండి, ఇక్కడ 200 ఎకరాలు ఇవ్వండి” అంటూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కలసి కోరుకోవడం మినహా, అసలు తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఐక్యంగా ముందడుగు వేసింది వుందా?
Ads
“మా” అయినా బాధ్యత తీసుకోవాలిగా? అసలు “మా” సంస్థ వుందా? మూసేసారా? ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా దిల్ రాజును నియమించారు! ఆయనకు తోచింది ఆయన చేస్తున్నారు! గదర్ అవార్డులు ఇస్తున్నారు! వెబ్ సైట్ ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న షూటింగ్ లొకేషన్లు, ప్రైవేట్ లొకేషన్ల వివరాలు పెట్టే ప్రయత్నం చేశారు.
సింగిల్ విండో అనుమతుల విధానాన్ని ప్రవేశ పెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు! కానీ, సినీ పెద్దలు ఐక్యంగా ఆయన్ని కలసి అభివృద్ధిపరంగా ఆలోచనలు పంచుకుని ముందడుగు వేసే ప్రయత్నం ఏమైనా చేసారా అంటే అదీ లేదు! పైగా ఇండస్ట్రీ అంతా ఇక్కడే వుంది!
ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వున్నారు! హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వున్నారు. నటి రోజా యాక్టీవ్ గానే వున్నారు! కానీ, అక్కడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి ఒక్క ముందడుగు లేదు! అసలు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి తమ ఆలోచనలను పంచుకోవాలనే ధ్యాస లేదు! ఎవరికి వాళ్ళు వెళ్లి వారి సినిమా విడుదల సమయంలో రేట్లు పెంచుకోవడం మినహా ఇంకే ఊసు లేదు!
పైగా పక్క రాష్ట్రం నంది అవార్డులు ఇవ్వాలని ఇక్కడ నుంచి మైక్ లో చెబుతారు! అయినా గౌరవించి “అదే పనిలో ఉన్నాం, త్వరలో ఇస్తాం” అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు! గతంలో విశాఖపట్నంలో చిత్ర పరిశ్రమ కోసం స్థలాలు పొంది స్టూడియోలు నిర్మించిన వాళ్ళకు కూడా అభివృద్ధి దిశగా ఒక్క ఆలోచన లేదు! ఒరియా, తమిళ్ సినిమా షూటింగులు మాత్రమే అక్కడ జరుగుతున్నాయి కానీ, తెలుగు సినిమా షూటింగ్ అక్కడ మచ్చుకు కూడా కనిపించదు.
బాలీవుడ్ నటులు నిర్మాతలు కాస్త ఉత్సాహం చూపిస్తున్నారని, అంతకు ముందు అజయ్ దేవగన్, నిన్న సంజయ్ దత్ కలిసారని, తమిళ్ నాడు నుంచి సూర్య, అర్జున్ వచ్చారని, వారి కోరిక మేరకు అమరావతి, మదనపల్లి హార్స్ లీ హిల్స్ లలో స్టూడియోల కోసం స్థలాలు కేటాయించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బాలీవుడ్ కు ముంబయి రాజధాని అయితే, భవిష్యత్ లో రెండవ రాజధాని అమరావతి అవుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు!
ఆయన చూపు ఎప్పుడూ రెండు దశాబ్దాల ముందు ఉంటుంది, అది వేరే విషయం! కానీ అసలు అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ ను కూడా నియమించలేదంటే, తెలుగు సినీ ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం ఎంత అసహనంగా వుందో చెప్పకనే అర్ధం అవుతుంది! అసలు FDC అక్కడ ఏం చేస్తున్నట్లు?
నిన్న ఢిల్లీలో ప్రారంభమైన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది! అసలు ఏం అభివృద్ధి చేస్తుందని, ఏం చెప్పాలని అంత ఖర్చు పెట్టి స్టాల్ ఏర్పాటు చేసారో చంద్రబాబుకే తెలియాలి. అభివృద్ధి దిశగా అడుగులు పడినప్పుడే దాన్ని ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది! సారధి లేని ఆ సంస్థ ఏం ప్రచారం చేసుకోవడానికి స్టాల్ పెట్టినట్లు? గతంలోనూ పెట్టింది, పెట్టిన మూడు రాష్ట్రాల స్టాల్స్ లో బహుమతి వచ్చిందని సంబరపడిపోయారు! ఆ బహుమతి వల్ల ప్రభుత్వానికి వచ్చేదేముంది?
(ఫోటో : నిన్న ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లైఫ్ టైమ్ అచీవ్-మెంట్ అవార్డుతో నందమూరి బాలకృష్ణను సత్కరించిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా)
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సంతోషించదగిన వార్త ఏమిటంటే, 2026వ సంవత్సరానికి నందమూరి బాలకృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సన్మానించారు! ఇది బాలయ్య సినీ ప్రస్థానంలో ఇంకో మైలు రాయి కావచ్చు. అయితే, ఈ సన్మానం కోసమే FDC స్టాల్ ను అక్కడ ఏర్పాటు చేసి స్పాన్సర్ చేసారా అనే గుసగుసలు వినిపించాయి!
ఇప్పటికైనా మించింది లేదు! ఇండస్ట్రీ ఒక్క తాటిపైకి రావాలి! రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలి. చిత్ర పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవాలి! ఏమాటకు ఆమాటే… మా దాసరి నారాయణరావు గుర్తుకొస్తున్నారు! ఆయన లేని లోటు ఇప్పుడింకా స్పష్టంగా కనిపిస్తోంది! ఈమధ్య “పెదరాయుడు” మోహన్ బాబు కూడా గురువుగారు దాసరి ప్లేస్ ఎవరు తీసుకున్నా సంతోషమే అని ప్రకటించారు!
అందుకే “మా” సంస్థను ప్రక్షాళన చేయండి. యాక్టీవ్ చేయండి. నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటులు కలసి ఐక్యంగా కొందరు పెద్దలను ఎంపిక చేసుకుని అభివృద్ధి కమిటీ రూపొందించుకుని చిత్ర పరిశ్రమ అభివృద్ధి, తద్వారా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి! లేదంటే అవార్డులు అడుక్కోవడానికే పరిమితం అయిపోతారు! – డా. మహ్మద్ రఫీ
Share this Article