.
శనివారం బెంగుళూరులో ‘భారత సమాజానికి కుటుంబమే పునాది’ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న కొన్ని విలువైన అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు మరో ఆసక్తికరమైన, విస్మయకరమైన వివరాలు కొన్ని వెల్లడించారు…
కోర్టుకు విడాకుల కోసం రాకముందే… దంపతుల నడుమ అభిప్రాయభేదాల్ని తగ్గించే ప్రయత్నాలు బయట జరగాలని, ఆ మధ్యవర్తిత్వాలు విఫలమైతేేనే కోర్టు దాకా రావాలనేది ఆమె అభిప్రాయం… నేరుగా న్యాయ విచారణ దాకా వస్తే దంపతుల మధ్య మరింత దూరం పెరుగుతుంది… అందుకే ఫ్యామిలీ కోర్టుల్లో శిక్షణ పొందిన నిపుణులు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉంటే బెటర్ అనేది తన సూచన…
Ads
ఈ చర్చ సందర్భంగా ఆమె వెల్లడించిన ఓ విషయం ఏమిటంటే..? ‘‘గత పదేళ్లలో జరిగిన వివాహాల్లో సుమారు 40 శాతం విడాకులకు దారితీసినట్టు ఓ సర్వేలో తేలింది’’…
40 శాతం అనే అంకె చదవగానే విస్మయమే కాదు, ఏమైనా పొరపాటున చెప్పబడిందా లేక రిపోర్టింగులో తప్పు అంకె ప్రచురించారా అనే సందేహమూ తలెత్తింది… కానీ ఓ సుప్రీంకోర్టు జడ్జి అల్లాటప్పాగా ఏమీ చెప్పరు కదా… కానీ ప్రతి రెండు పెళ్లిళ్లలో దాదాపు ఒకటి నిజంగా విఫలమవుతోందా..?
నిజమైతే ఇది భారత కుటుంబ వ్యవస్థ, వైవాహిక వ్యవస్థకు ఓ ఆందోళనకర పరిస్థితే… ఆ సర్వే వివరాల కోసం వెతికితే కేరళకు సంబంధించిన ఒక్క వార్త కనిపించింది… అది ఏం చెబుతున్నదంటే..?
‘‘కేరళలో విడాకుల సంఖ్య గత ఏడేళ్లలో 40% పెరిగింది, ఇది 2016లో 19,233 ఉండగా 2022లో 26,976కు చేరుకుంది... ఈ పెరుగుదల ప్రధానంగా నగర ప్రాంతాలలో కనిపిస్తోంది.., అయితే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది…’’
ఇదీ వార్త… అంటే విడాకుల కేసుల్లో 40 శాతం పెరుగుదల… అంతేతప్ప జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం విచ్ఛిన్నమైనట్టు కాదు… కాకపోతే జస్టిస్ నాగరత్న ఉదహరించిన సర్వే వేరేది అయి ఉండొచ్చు…
ఎస్, నిజంగానే విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి… చిన్న చిన్న కారణాలకూ కోర్టుకు వచ్చేస్తున్నారు… మునుపటి కాలం కాదు… ప్రపంచంలో అత్యంత తక్కువ విడాకుల శాతం ఇండియాలోనే అని పలు గణాంకాలు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చాయి… బహుశా ఆ అంకెలు వాస్తవ స్థితిని చెప్పకుండా ఉండొచ్చు బహుశా…
అక్రమ సంబంధాలు, కట్నం, క్రౌర్యం, గృహహింస, లైంగిక దౌర్బల్యం, సంతాన హీనత, తిట్లు, చదువు, కమ్యూనికేషన్ గ్యాప్, అర్థం చేసుకోవడం, సర్దుకునే రాజీ తత్వం లేకపోవడం వంటి అనేక అంశాలు విడాకులకు దారితీస్తున్నాయి…
మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కూడా ఇట్టే వివాహబంధాల్ని తెంచుకోవడానికి సరిపడా ధైర్యం ఇస్తున్నది… ఐతే బయటికి చెప్పుకునే కారణాలు ఏమున్నా అసలైన బలమైన కారణాలు వేరే ఉండవచ్చు, పరువు పోతుందనే భావనతో వెల్లడించడం లేదేమో…
కానీ ఇక్కడే మరొకటి ప్రస్తావనార్హం… కొంతకాలంగా భార్యల అక్రమ సంబంధాలు, భర్తలకు వేధింపులు దారుణమైన వాతావరణాన్ని పెంచుతున్నాయి… భర్తల ఆత్మహత్యల వార్తలు పెరిగాయి… తమ అక్రమ బంధాలకు అడ్డువస్తున్నారనే భావనతో భర్తలను ప్రియుళ్ల సాయంతో… చివరకు పిల్లలను కూడా హతమారుస్తున్నారు… భారత సమాజంలో నిజంగానే కుటుంబం తీవ్ర ఒడిదొడుకుల్లో పడుతోంది..!!
Share this Article