(By రమణ కొంటికర్ల…) marriages are made in heaven.. ఎవరెవరికి పెళ్లితో బంధాన్ని ముడి వేయాలో పైనున్న ఆ భగవంతుడే రాసి పెడతాడు.. స్వర్గంలోనే అవి నిర్ణయించబడతాయనేది స్థూలంగా ఈ నానుడి సారాంశం. స్వర్గంలో నిర్ణయించబడే పెళ్లిళ్లను.. ఆ స్వర్గాన్నే తలదన్నేలాంటి ప్రాంతాల్లో చేసుకోవడం సంపన్నుల్లో నడుస్తున్న ట్రెండ్.
పెళ్లంటే పందిళ్లు.. సందెళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్లు అని త్రిశూలం అనే సినిమా కోసం ఆత్రేయ రాసిన పాట విన్నప్పుడు పెళ్లంటే ఇంతేనా అనిపించే మనకు.. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అంటూ సిరివెన్నెల చెబితే అబ్బో ఇంత ఉంటుందా పెళ్లంటే అనీ అనుకోమూ..?
ఆత్రేయ చెప్పిన సంప్రదాయ పెళ్లిళ్లను ఎలాగూ మనం చూస్తూనే ఉంటాంగానీ.. ఆకాశమే దిగివచ్చి మబ్బులతో వేసే పందిళ్లను, ఊరంతా చెప్పుకునే పెళ్లిళ్లను సామాన్యులు చూడటం అరుదే. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టుగా.. ఆ పెళ్లిళ్ల తంతుపై భిన్నాభిప్రాయాలెలా ఉన్నా.. అలాంటి పెళ్లిళ్లు జరిగినప్పుడు మాత్రం అవి హాట్ టాపికే.
Ads
అతిథుల కోసం చార్టర్డ్ విమానాలు, బహుమతిగా హెలికాప్టర్లు, కోట్ల విలువైన మంగళసూత్రాలు.. ఇవన్నీ ఇప్పుడు అత్యంత ఖరీదైన వివాహాల్లో టాప్ ఆఫ్ బాప్ గా చెప్పుకోవాల్సినవి. కోవిడ్ కాలంలో ప్రపంచమంతా ఆర్థికమాంద్యంలో చిక్కుకున్నప్పుడూ.. కరోనా సోకి పోయిందానికంటే ఆ పెళ్లిళ్లు చూసి కన్నుకుట్టి పోవాల్నేమో అన్నచందంగా కొన్ని వివాహాల తంతు చర్చకొచ్చింది.
సగటు సామాన్య, మధ్యతరగతి వారికి పెళ్లంటే ఓ పండుగే. కానీ, దానికో పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి తగ్గ బడ్జెట్ ఉంటుంది. కానీ, సంపన్నుల ఇళ్లల్లో పెళ్లిళ్లంటే.. తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు ఓ అవకాశం. అందుకే, ధనవంతుల ఇళ్ల పెళ్లిళ్లు ఇప్పుడు ఈవెంట్స్ రూపాన్ని సంతరించుకుని ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేస్తే.. అంతకన్నా ఎలా బాగా చేయగలమని మరో శ్రీమంతుడు ఆలోచించాల్సిన రోజులివి.
2004లో జరిగిన ఉక్కు ఇండస్ట్రీ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం.. ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి అని పాడుకునే విధంగా బ్యాంకరైన అమిత్ భాటియాతో ప్యారిస్ లో ఏకంగా ఆరు రోజులపాటు జరిగింది. సంగీత్ తో ప్రారంభమై విందు వరకూ 240 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ నుంచి మొదలుకుంటే ఆస్ట్రేలియాకు చెందిన ఎవర్ గ్రీన్ పాప్ స్టార్ దివా కైలీ మినోగ్ వరకూ.. టుయిలరీస్ గార్డెన్ వేదికగా సంపన్నుల పెళ్లి వేడుకకు ఓ సింబల్ లా నిల్చింది.
ఒకనాటి కాంగ్రెస్ నాయకుడు, గత 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అమ్రోహ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెల్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ కన్వర్ సింగ్ తన్వర్ కుమారుడు లలిత్ వివాహం 2011లో జరిగిన తీరు రాజకీయవర్గాల్లో ఓ పెద్ద చర్చకే దారితీసింది. హర్యానాలోని జౌనాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. కొందరికి ఇచ్చిన బహుమతులు వాటిని తీసుకున్న సంపన్నుల కుటుంబాలనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.
బాలీవుడ్ ప్రముఖులతో పాటు.. మొత్తం సుమారు 15 వేల మంది హాజరైన ఆ పెళ్లిలో.. వచ్చినవారందిరీ ఇచ్చిన బహుమతుల విలువ సుమారు 21 కోట్ల రూపాయలు. రెడ్ ఫోర్ట్ దగ్గర గణతంత్ర వేడుకల్లోలాగా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారుల ప్రదర్శనలతో పెళ్లి వేడుకకు కొత్త నిర్వచనమిచ్చేలా వివాహాన్ని జరిపించారు. వచ్చిన అతిథులందరికీ 30 గ్రాముల వెండి బిస్కెట్, సఫారీ సూట్ సెట్, శాలువాతో పాటు.. 2 వేల 100 రూపాయల రిటర్న్ గిఫ్ట్ బహుమతి కూడా ఇవ్వడం ఈ పెళ్లి ప్రత్యేకత. నగదుతో కూడిన రిటర్న్ బహుమతిని అందించారు.
అలాగే 2011లో జరిగిన న్యూజిలాండ్ కు చెందిన వ్యాపార దిగ్గజం ఎస్. రవీంద్ర కొడుకు వివాహమూ వార్తల్లో ప్రత్యేకంగా నిల్చింది. దక్షిణ భారతావనిలోనే అత్యంత ఖరీదైన పెళ్లిలా హైదరాబాద్ వేదికగా.. బెంగాలీ, రాజస్థానీ, పంజాబీ సంప్రదాయల కలబోతగా.. అరేబియన్ నైట్స్ ను తలపించే సెట్స్, జోథా అక్బర్ నమూనాలతో జరిగింది ఈ మ్యారేజ్ ఈవెంట్. వరుడి పెళ్లి బట్టలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. మంగళసూత్రాల ఖర్చు ఇక కోట్లలోనే జరిగిందట.
2016లో జరిగిన గాలి జనార్ధన రెడ్డి కూతురు పెళ్లి రాజరిక కాలాన్నే కళ్లుముందుంచింది.500 కోట్లకుపైగా ఖర్చుతో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు మాజీ మంత్రిగారు. ఈ విలాసవంతమైన వేడుకలో రెండు పెద్ద ఏనుగులు రెండువైపులా అతిథులకు ఆహ్వానం పలుకితే.. భారీ ఎయిర్ కండిషన్డ్ టెంట్స్ ఏర్పాటు.. 30 ఎకరాల్లో బాలీవుడ్ తరహా సెట్‌లతో అలరించింది ఈ ఈవెంట్.వధువు వేసుకున్న వెడ్డింగ్ లెహంగాకే 17 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే.. రెడ్డిగారి పెళ్లి తంతా మాటలా..?
ఇక స్పోర్ట్స్ స్టార్స్ విషయానికొస్తే.. ఎందరికో అభిమాన క్రీడాహీరో.. 2017లో జరిగినవ విరాట్ కోహ్లీ వివాహమూ చెప్పుకోవాల్సిన తంతు. ఇటలీలోని అతి పెద్ద మూడో సరస్సైన లేక్ కోమోలో.. బాలీవుడ్ నటి అనుష్కశర్మ బౌన్సర్ కు క్లీన్ బౌల్డైన విరాట్.. ఆమెను పెళ్లి చేసుకుని మళ్లీ ఫామ్ లోకొచ్చాడు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైల్లో రిసెప్షన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాకుండా చేశారు.
ఇంతమందివి చెప్పుకున్నాక.. 2018లో ఆనంద్ పిరమల్ తో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ కూతురు ఇషా వెడ్డింగ్ గురించి చెప్పుకోకపోతే ఎలా..? అమెరికన్ సింగర్ బెయోన్స్ కచేరీ.. వందకు పైగా చార్టర్డ్ విమానాల్లో అతిథులను తీసుకురావడం.. అతిథుల జాబితాలో హిల్లరీ క్లింటన్, సచిన్ టెండూల్కర్, ప్రియాంకచోప్రా, నిక్ జోనాస్, లక్ష్మీ మిట్టల్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటివారుడటం.. నిజంగానే ఆకాశాన్నే కిందికి దింపినట్టు చేశాడు.
అలా చెప్పుకోవాల్సిన దాంట్లో 105 కోట్ల రూపాయల ఖర్చు చేసిన బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, గాయకుడు నిక్ జోనాస్ పెళ్లి కూడా ప్రస్తావించదగ్గది. 2018లో ఉదయ్ పూర్ ప్యాలెస్ వంటి అత్యంత విలాసవంతమైన చోట వీరి వెడ్డింగ్ వేడుక జరిగింది. ఇక ఇదే సంవత్సరంలో జరిగిన దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ పెళ్లి.. సేమ్ విరాట్ కోహ్లీ, అనుష్క వెడ్డింగ్ వేడుక జరిగిన లేక్ కోమో వేదికలోనే జరగడం విశేషం కాగా.. సుమారు 77 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రాండ్ గా చేశారు.
అంతేకాదు.. తమ అతిథులకు దీపికా పదుకొణె మరియు రణ్‌వీర్ సింగ్ వెడ్డింగ్ (2018) – ఇటలీలోని లేక్ కోమోలో బాలీవుడ్ నటులు దీపికా పదుకొనే మరియు రణ్‌వీర్ సింగ్ వివాహానికి దాదాపు రూ. 77 కోట్లు ఖర్చయిందని అంచనా. ఈ జంట తమ అతిథులకు ప్రఖ్యాత విల్లా డెల్ బాల్బియానెల్లోలో ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ స్టే చేయాలంటే.. ఒక్కో సూట్ కు రోజుకు 33 వేల రూపాయల ఖర్చవుతుంది.
సో ఇలాంటి పెళ్లిళ్లు బోలెడన్ని ఇప్పుడు జనంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంతెందుకు మన తెలంగాణా మంత్రి పొంగులేటి ఇంట్లో పెళ్లి జరిగిన తీరు కూడా అందరినీ ఔరా అనిపించింది. సో ఆకాశమంత పందిరేసే కాస్ట్లీ పెళ్లిళ్ల కథలు.. ఎప్పుడూ వార్తల్లో హెడ్ లైన్సే మరి!
Share this Article