అపర్ణ… అపర్ణ యాదవ్… అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బలమైన పార్టీ సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ చిన్న కోడలు… అఖిలేష్ యాదవ్ మరదలు… మళ్లీ ముఖ్యమంత్రి పీఠం కావాలని నానా ప్రయత్నాలూ చేస్తున్న ఆ కుటుంబం నుంచి ఓ మహిళ బీజేపీలోకి వెళ్లనుందనే వార్త ఖచ్చితంగా ఇంట్రస్టింగు… ఒకవైపు బీజేపీలో టికెట్లు దొరకని వాళ్లను ఎస్పీ అక్కున చేర్చుకుంటుంటే… ఏకంగా ఎస్పీ బాస్ ఫ్యామిలీ మెంబరే బీజేపీలోకి పోవడం విశేషమే… వెళ్తే…!!
అసలు ఈమె నేపథ్యమేంటి..? కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతూ ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడం ఏంటి..? ఏం జరుగుతోంది..? భర్త ప్రతీక్ యాదవ్ అంగీకరించాడా..? అసలు ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఏంటి..? ఇవన్నీ సందేహాలే కదా… అపర్ణ, లక్నోలో పుట్టింది… తండ్రి టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యూరో చీఫ్ అరవింద్ సింగ్ బిస్త్… ఈమెకు శాస్త్రీయ సంగీతం తెలుసు… తుమ్రి డాన్స్ తెలుసు… స్కూల్ రోజుల్లోనే సంగీతం నేర్చుకుంది… ప్రతీక్ చదివే స్కూల్‌లో కూడా అప్పుడప్పుడూ కచేరీలు ఇచ్చేది… అలా ఆ ఇద్దరి నడుమ స్నేహం మొదలైంది…
Ads
అప్పట్లో తండ్రి వార్తలు పంపించడానికి నెట్ వాడేవాడు… అలా ప్రతీక్, అపర్ణల నడుమ మెయిళ్లు కూడా నడిచేవి… నో ఫోన్ మెసేజెస్, నో లెటర్స్, నో మేఘసందేశాలు… ఓన్లీ మెయిల్ సందేశాలు… అలా ఎనిమిదేళ్లు… ఆమె లండన్ వెళ్లింది, మాంచెస్టర్ యూనివర్శిటీలో రాజనీతి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది… తరువాత అక్కడే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేసింది… ఇండియాకు వచ్చింది, ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది… ప్రతీక్‌ను రాజకీయాల్లోకి రానివ్వలేదు ములాయం… పైకి మాత్రం ప్రతీక్‌కు ఇష్టం లేదని చెప్పేవాళ్లు… కారణం ఉంది దానికి కూడా… రియల్ ఎస్టేట్ వ్యాపారం, తన జిమ్, తన బాడీ బిల్డింగ్… ఇదే లోకం ప్రతీక్‌కు…
ప్రతీక్ తల్లి ములాయంసింగ్ రెండో భార్య సాధన గుప్త… యాదవ్ కాదు… అందుకే కులోద్ధారకుడు, వంశోద్దారకుడు, పార్టీ ఉద్దారకుడు అన్నీ అఖిలేషే తనకు… అందుకే ప్రతీక్ ‘‘సెకండ్ గ్రేడ్ సన్’’ అయిపోయాడు… నిష్ఠురంగా ఉన్నా అదే నిజం… పైగా అపర్ణను ప్రేమించాడు… ఆమె కులం బిస్త్… (రాజ్‌పుత్)… నేపాల్, ఉత్తరాఖండ్, హిమాాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కనిపించే కులం… (యోగి ఆదిత్యనాథ్ కులం అదే…) ఆ జంట వద్దన్నా వినేట్టు లేరు… దాంతో పదేళ్ల క్రితం వైభవంగా పెళ్లి చేశాడు ములాయం… కానీ రాజకీయాల్లోకి మాత్రం ప్రతీక్‌ను రానివ్వలేదు… అపర్ణకు మండిపోయేది… నిజానికి ప్రతీక్ తల్లి సాధన గుప్తకు మొదటి సంబంధం ద్వారా పుట్టిన సంతానం… ఐనా ములాయం కుటుంబసభ్యుడిగా ఓన్ చేసుకున్నాడు కానీ, అఖిలేషుడే అసలు వారసుడు అన్నమాట… అఖిలేష్ భార్య డింపుల్ కూడా రావత్, అంటే ఆమె కూడా రాజ్ పుత్…)
తను హర్ష ఫౌండేషన్ అని ఓ సామాజిక సేవ సంస్థ స్టార్ట్ చేసింది… బీ అవేర్ అనే సంస్థ ద్వారా మహిళల విద్య, హక్కులు, ఆత్మాభిమానం కోసం వర్క్ చేసేది… తన సోషల్ మీడియాలో తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించేది… పార్టీ సిద్ధాంతాలు గట్రా పట్టించుకునేది కాదు… స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు ఓసారి మోడీతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… సోషల్ మీడియాలో పెట్టే తన వ్యక్తిగత పోస్టులకూ, పార్టీలో తన అధికారిక పోస్టులకూ లంకె పెట్టొద్దని కోరేది…
గోరఖ్‌పూర్ ఆశ్రమాధినేత మరణించినప్పుడు, యోగీ ఆదిత్యనాథ్ దాని ఉత్తరాధికారి అయినప్పుడూ వెళ్లి కలిసింది… సో, ఎన్నో ఏళ్లుగా ఆమె బీజేపీ గుడ్ లుక్స్‌లోనే ఉంది… గత ఎన్నికల్లో అఖిలేష్ ఆమెకు టికెట్టు ఇవ్వలేదు, జాబితా నుంచి తీసేశాడు… కానీ అవసరమైతే ఇండిపెండెంటుగా నిలబడతాను అని రెడీ అయ్యేసరికి, గత్యంతరం లేక టికెట్టు ఇచ్చారు, ఇచ్చినట్టే ఇచ్చి వెన్నుపోట్లు… ఫలితంగా ఆమె ఓడిపోయింది… ఆమెకు మొత్తం తెలుసు… తనను ‘‘నిజమైన కోడలిగా’’ ఆ కుటుంబం ఎందుకు పరిగణించదో, తన భర్తను కూడా ఆ కుటుంబం ఎందుకు దూరంగా ఉంచుతుందో తెలుసు… కులం ప్రభావం తెలుసు… విద్యాధికురాలు, జర్నలిస్టు బిడ్డ… ఇవన్నీ సరే, ఆమెను సరైన రీతిలో వాడుకునే తెలివి, సోయి బీజేపీలో ఉందానేది పెద్ద డౌట్..!!
Share this Article