రెండు రోజులుగా నెట్‌లో– స్వాతంత్య్ర దినోత్సవం రానున్న సందర్భాన– ఏదో చదువుతుంటే సురయ్యా త్యాబ్జీ ప్రస్తావన కనిపించింది. ఆమె హైదరాబాదీ కావడంతో ఆసక్తి కలిగింది.
గత సంవత్సరం నేను ‘మేడమ్ కామా’గా పిలువబడే భికాజి కామా గురించి చదివాను. ఆమె అప్పటికి కలకత్తా ఫ్లాగ్‌గా పిలువబడిన తొలిస్థాయి జాతీయ పతాకాన్ని జర్మనీలో మొదటిసారి ఎగురవేసింది. అది రికార్డ్ అయి ఉంది. పింగళి వెంకయ్య గారు ప్రతిపాదించగా రూపుదిద్దుకుంటూ వచ్చిన మూడు రంగుల జాతీయ జెండా మీద ‘చరఖా’ ఉండాలని లాలా హన్స్‌రాజ్ (విద్యావేత్త, ఆర్యసమాజ్) సూచించారని అంటారు. ‘ధర్మచక్రం’ ఉండాలని ఆయన సూచించాడని వికీలో ఉంది గాని 1938లో మరణించిన లాలా హన్స్‌రాజ్ 1947 తొలి ఆరునెలల్లో అంతిమ రూపు తీసుకున్న జాతీయ పతాకంపై ధర్మచక్రాన్ని సూచించే అవకాశం లేదు.
మరి జాతీయ పతాకంపై ధర్మచక్రం ఎవరు సూచించారు? జాతీయ చిహ్నం అయిన అశోకుని స్థూపాన్ని ఎవరు సూచించారు? «
Ads
అశోకుని స్థూపాన్ని కాగితం మీద దించే పని నందలాల్ బోస్ (చిత్రకారుడు) ఆధ్వర్యంలో దీనానాథ్ భార్గవ (శాంతినికేతన్ విద్యార్థి) పూర్తి చేశాడన్న విషయం కూడా రికార్డ్ అయినప్పుడు జాతీయపతాకంపై ధర్మచక్రం ఎవరు సూచించారనేది ఎక్కడ నిర్థారణ అయి ఉంది?
ఈ సందర్భంలోనే సురయ్యా త్యాబ్జీ పేరు వినిపిస్తూ ఉంది.
కథనం ఏమింటే– నేషనల్ కాంగ్రెస్ జెండాగా ఉన్న ‘చరఖాతో ఉన్న త్రివర్ణ పతాకాన్నే’ జాతీయ పతాకంగా అంగీకరిస్తే బాగుంటుందనే ఆలోచనను కొందరు పెద్దలు చేశారు. అయితే పార్టీ జెండాను జాతీయ జెండాగా నిర్థారిస్తే ఇతర పార్టీల నుంచి అభ్యంతరాలు వస్తాయని నెహ్రూ భావించాడు. మరోవైపు బ్రిటిష్ వారు స్వాతంత్య్రాన్ని ప్రకటించే తేదీ దగ్గర పడుతోంది.
ఆ సమయంలో జాతీయ చిహ్నం, జాతీయ పతాకం ఎంపిక, తుది రూపును అప్పటి ఇండియన్ సివిల్ సర్వెంట్ (ఐసిఎస్)గా ఉన్న బద్రుద్దీన్ ఫయాజ్ త్యాబ్జీకి అప్పజెప్పాడు. బద్రుద్దీన్ ఫయాజ్ త్యాబ్జీ తాత సీనియర్ త్యాబ్జీ నేషనల్ కాంగ్రెస్‌లో తొలితరం సంపన్న నాయకుడు. వారి కుటుంబానికి గాంధీ, నెహ్రూలతో సాన్నిహిత్యం ఉంది. బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోని ఫ్లాగ్ కమిటీలో ఉన్న బద్రుద్దీన్‌కు నెహ్రూ ఈ బాధ్యత అప్పజెప్పాడు.
జాతీయ చిహ్నాన్ని బద్రుద్దీన్ త్యాబ్జీ సూచించాడని కథనం. ‘ఒక చక్రవర్తిగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, అన్ని వర్గాల మన్ననలు పొందిన అశోకుని ధర్మస్థూపమే జాతీయ చిహ్నంగా బావుంటుందని’ బద్రుద్దీన్ భావించాడు. బద్రుద్దీన్ భార్య సురయ్యా మంచి చిత్రకారిణి. ఎంబ్రాయిడరీ డిజైనర్. ఆమె ఆ ధర్మస్థూపంలోని ధర్మచక్రాన్ని జాతీయ జెండా మీద చరఖా బదులుగా ప్రతిష్టిస్తే బాగుంటుందని సూచించింది.
అంతే కాదు రంగుల శాతాన్ని నిర్థారించింది. కన్నాట్ ప్లేస్‌లో తొలి పతాకాన్ని దగ్గరుండి డిజైన్ చేసి నెహ్రూకు బహూకరించింది. జూలై 22, 1947న నెహ్రూ కాన్స్‌టిట్యూషన్ అసెంబ్లీలో దీనిని ప్రవేశపెట్టి ఆమోదం పొందడమే కాదు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ తన కారుకు గుచ్చి స్వాతంత్య్ర ప్రకటన చేయడానికి బయలుదేరాడు.
ఇంగ్లిష్ చరిత్రకారుడు ట్రేవర్ రాయ్‌లే తన ‘ది లాస్ట్‌డేస్ ఆఫ్ ది రాజ్’లో సురయ్య జాతీయపతాకానికి తుది రూపం ఇచ్చిన ఈ ఉదంతం అంతా రాశాడు.
ఈ సంగతి చర్చనీయాంశం అయినప్పుడు ఇండియా టుడే పత్రిక పరిశోధనలో దిగి పార్లమెంటరీ ఆర్క్వైస్‌లో నుంచి ‘ఫ్లాగ్ ప్రెజెంటేషన్ కమిటీ’ సభ్యుల లిస్ట్‌లో సురయ్యా త్యాబ్జీ పేరు ఉందని తేల్చింది. అక్కడ డిజైనర్ క్రెడిట్ ప్రస్తావన లేదు.
సురయ్యా త్యాబ్జీ భాగస్వామ్యాన్ని తెలుగువారు, ముఖ్యంగా తెలంగాణ వారు నిర్థారించుకుని సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే తొలిరూపు పింగళి వెంకయ్య గారిది అయితే తుదిరూపు సురయ్యది అవుతుంది. ఇద్దరూ తెలుగువారు. రెండు ముఖ్య తెలుగు నగరాల వారు.
మనవారు చాలా ఘనులోయి అని చెప్పుకునే సందర్భాలను ఎందుకు వదులుకోవాలి?…. Mohammed Khadeerbabu వాల్ నుంచి సేకరణ… ఫొటో: భర్త బద్రుద్దీన్‌తో సురయ్యా త్యాబ్జీ
Share this Article