ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన శివానీ త్యాగికి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు. కష్టపడి చదివి నొయిడాలోని యాక్సిస్ బ్యాంకులో రిలేషన్‌షిన్ మేనేజర్ ఉద్యోగం తెచ్చుకుంది. తన ఆశయం నెరవేరిందని, ఇక జీవితంలో ఎన్నో సాధించవచ్చని కలలు కన్నది.
కానీ ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఘజియాబాద్ మనిషి నొయిడా లాంటి పట్టణంలో మెలిగేందుకు పనికిరాదంటూ తోటి ఉద్యోగుల నుంచి ఆమెకు వెక్కిరింపులు మొదలయ్యాయి. ఆమె ఏ డ్రెస్ వేసుకొచ్చినా ఏదో ఒక కామెంట్. ఆమె తిండి మీదా, ఆమె కూర్చునే విధానం మీదా, ఆమె మాట్లాడే పద్ధతి మీదా.. చివరకు ఆమె నడక మీద కూడా ఎన్నో కామెంట్లు. ఒక మహిళా కొలీగ్ అయితే మాటిమాటికీ శివానిని వెక్కిరిస్తూ, రోజుకో రకమైన పేరు పెట్టి ఆనందించేది. ఫ్యాషన్ తెలియదని, మ్యానర్స్ రాదని, ఇంట్లో తిండి తినడం కూడా నేర్పించలేదా అని హేళనలు. మొత్తం ఐదుగురు కలిసి రోజూ శివానికి తమ మాటలతోనే నరకం చూపించేవారు.
ఆరు నెలలు ఆ బాధలన్నీ భరించింది శివాని. ఏరోజూ ఈ విషయాలు తన ఇంట్లో చెప్పలేదు. చెప్తే బాధపడతారు, లేదా ఉద్యోగం వదిలేయమంటారు. రెండూ ఆమెకు ఇష్టం లేదు. అందుకే మనసులో బాధపడుతూ, రోజూ ఆఫీసుకు వెళ్తూ ఉండేది. దీని గురించి పైవాళ్లకు మెయిల్స్ పెట్టింది. ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పింది. వాళ్లు ఏదో ఒక సాకు చెప్పేవారు. ఓదార్పు మాటలు చెప్పి ఆమెను ఊరడించేవారు.
Ads
ఒకరోజు ఆ మహిళా కొలీగ్ శివానిపై భౌతికంగా దాడి చేసింది. తనను రెచ్చగొట్టింది. ఎవరైనా ఎన్నాళ్లని ఓర్చుకుంటారు? శివాని ఎదురుతిరిగి ఆమెను చెంపదెబ్బ కొట్టింది. అంతే! శివాని కావాలనే తనను కొట్టిందని అంటూ ఆ కొలీగ్ పైవారికి ఫిర్యాదు చేసింది. శివాని ఎన్ని చెప్పినా వారు వినలేదు. ఆమెకు టర్మినేషన్ లెటర్ ఇచ్చారు.
ఇన్నాళ్ల బాధను ఎలాగో అనుభవించింది. వాళ్ల వేధింపులు పంటిబిగువున తట్టుకుంది. కానీ ఈ విషయాన్ని తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. తన తప్పు లేకపోయినా తనపై నింద మోపడం ఆమెకు కష్టంగా తోచింది. బాధ.. బాధ.. ఏం చేయాలి? ఏం చేయాలి?
పోయిన శుక్రవారం తన ఇంటికొచ్చింది. ముభావంగా ఉన్న తనను చూసి ఏదో జరిగిందని ఇంట్లో వాళ్లు భావించారు. ఏమైందని అడిగినా తనేమీ చెప్పలేదు. తన రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు తన బాధంతా లెటర్ రూపంలో రాసింది. తనను ఏడిపించిన ఆ ఐదుగురి పేర్లు పేర్కొంది. తనలాగా మరెవరూ ఇబ్బంది పడకూడదని చెప్పింది. తన బాధను ఒక్కరైనా అర్థం చేసుకొని ఉంటే తాను బతికేదాన్నని వివరించింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
27 ఏళ్లకే శివాని జీవితం ముగిసింది. ఇంట్లో వారికి శోకం మిగిలింది. కొందరికి ఇతరులను కామెంట్ చేయడం సరదా. ఎదుటివారి తిండి మీదా, ఒంటి మీదా, బట్టల మీదా, నడక మీదా, రంగు మీదా.. అన్నింటిమీదా కామెంట్ చేసి సరదా పొందుతుంటారు. ఆ సరదా కొందరికి నరకం. భరించలేని నరకం. అర్థం చేసుకోండి…… – విశీ
Share this Article