.
ఎవడో ఏదో చెబుతాడు, నమ్మేద్దామా..? వెధవ కమర్షియల్ సర్వేలను బుర్రల్లోకి ఎక్కించుకుందామా..? అసలే సోషల్ మీడియా… అనే అవలక్షణాలు… అసలు పాలిష్ చెయ్యని వరి అన్నంలో ఆర్సెనిక్ తో అనారోగ్యమా?
మార్కెట్ ఎకానమీ మహా చెడ్డది. సైన్స్ వంటి మొహమాటాలు లేని వాటితో కూడా తికమక పెట్టే అధ్యయనాలు ఇప్పించగలదు. ఇంకా దాన్ని ఏదో ఉపద్రవంలా చేప్పే ‘శుష్క మేధావులకు’ వేదికలు కల్పించగలదు కూడా. జనాన్ని నిరంతరం అభద్రతతో, అసంతృప్తితో కొట్టుమిట్టాడేలా చెయ్యడం దానికి సరదా…
Ads
పొట్టుతో వుండే వరి (అన్ పాలిష్డ్ / బ్రౌన్) అన్నం మూలంగా అది తినే వారిలో ఆర్సెనిక్ ఎక్కువగా చేరుతుంది, అది కాన్సర్ కి దారితీయవచ్చును అని ఈమధ్య ఒకవార్తావిశేషం చక్కర్లు కొడుతున్నది. ఇంకేమీ, వాయిస్ వున్న ఉద్ధారకులు అంతా తమకు తోచిన లాజిక్కులతో ఈ అధ్యయనాన్ని విశ్లేషిస్తారు, తమకున్న కల్ట్ లో మేధావులు అని మరోసారి గౌరవం పొందుతారు.
అధ్యయనాలు చెప్పే అంశాలను అర్థం చేసుకునే తీరును గురించి తెలుసుకుంటే, ఆయా విషయాలను గురించి ఎంత మేరకు ఆందోళన చెందాలో నిర్ణయించుకోవచ్చును… ఉదాహరణకు, అధిక కొలెస్ట్రాలు గుండెపోటు ప్రమాదాన్ని చూసే అధ్యయనములో సాధారణ స్థాయిలో కొలెస్టెరాల్ ఉన్న వారిలో పదివేల మందికి గాను సంవత్సరానికి ఐదుగురిలో గుండెపోటు వచ్చింది అనుకుందాం.
కొలెస్టెరాల్ అధికంగా ఉన్న 10,000 మందిలో ఏడుగురుకి గుండెపోటు వచ్చింది అనుకొందాం. ఇప్పుడు అధిక కొలెస్టెరాల్ వున్న వారిలో గుండెపోటు ప్రమాదం నలభై శాతం మేరకు పెరిగింది అంటారు. అదే సందర్భంలో, కొలెస్టెరాల్ అధికంగా వున్న 9993 కి గుండెపోటు రాలేదు అనే విషయం మనం గమనించాలి. దీన్నే సాపేక్ష ప్రమాదం (రెలెటివ్ రిస్క్) అంటారు. కానీ నిజ ప్రమాదం (అబ్సొల్యూట్ రిస్క్ ) మాత్రం 0.02%. దీన్ని చూసి ఎంత ఆందోళన చెందాలో అంత మాత్రమే భయపడాలి.
పొట్టు తీయని (ముడి) బియ్యం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రీయంగా నిరూపితమైంది. బియ్యపు పైపొరలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పీచు (ఫైబర్) జీర్ణ వ్యవస్థను చక్కగా పనిచేసేలా చేస్తుంది. ఇది ప్రేగుల్లో ఉండే సహాయకారి బాక్టీరియా (ఇంటెస్టైనల్ ఫ్లోరా) వృద్ధికి తోడ్పడుతుంది, మలబద్ధకం రాకుండా నివారిస్తుంది. ముడి బియ్యంలో పైరిడాక్సిన్, రైబోఫ్లావిన్, థయామిన్ వంటి బి విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి ఇతర ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి.
దంపుడు బియ్యంగా చేప్పే పొట్టుతో వుండే వరి అన్నం తిన్నాక, దానిలో వుండే కార్బోహైడ్రేట్స్ ని శరీరం నెమ్మదిగా శోషించుకొంటుంది. దాని మూలంగా రక్తంలో చక్కెర చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దాన్ని శరీరం నెమ్మదిగా ప్రాసెస్ చేయగలదు. (లో జీఐ)…
అలా కాకుండా, తెల్ల బియ్యం అని పిలిచే పోలిష్డ్ రైస్ తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా (స్పైక్) పెరుగుతుంది. డయాబెటీస్ వున్న వారికి ఇలా పెరగడం వల్ల దీర్ఘ కాలంలో అనేక కాంప్లికిషన్స్ కి దారితీయవచ్చు. అయితే, చక్కెర వ్యాధి లేని వారిలో ఈ పెరుగుదల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలిచే ప్రి డయాబెటీస్ కి దారితీస్తుంది.
పొట్టు తీయని (ముడి ) బియ్యంలో ఉండే ఫైబర్ ఎక్కువ నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది, తద్వారా తక్కువ పరిమాణంలో కూడా ఎక్కువ అన్నంలా అవుతుంది. పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అదే మొత్తంలో అన్నం పొందాలంటే ఎక్కువ బియ్యం వండాల్సి వస్తుంది.
అనగా, పొట్టు తీయని బియ్యం ద్వారా మనం కొంత తక్కువ కేలరీలు తీసుకుంటాము. కాబట్టి, తెల్ల బియ్యం కంటే పొట్టు తీయని బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎక్కువ ఫైబర్, విటమిన్లు ఇంకా ఖనిజాలు ఉంటాయి.
ఇక అధిక ఆర్సెనిక్ గురించి చూద్దాం. ప్రపంచంలో ఒక్కో నేలలో ఒక్కో స్థాయిలో ఆర్సెనిక్ ఉంటుంది. అది అక్కడ పండే పంటల్లో చేరుతుంది. వరిలో కూడా ఆర్సెనిక్ చేరుతుంది. ఇది కేవలం పొట్టు (బ్రాన్) కే పరిమితం కాదు, లోపల ఉన్న తెల్ల గింజలోనూ చేరుతుంది. ః
అయితే పొట్టులో ఎక్కువ శాతంలో ఉంటుంది. పొట్టుని తొలగించడం వల్ల కొంత మేరకు ఆర్సెనిక్ ని తగ్గించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 10% నుండి 40% వరకు ఉండవచ్చు. తెల్ల బియ్యంలో ఆర్సెనిక్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో చేరే ఆర్సెనిక్ స్థాయి ముడి బియ్యం తిన్నప్పుడు చేరే స్థాయికి దగ్గరగా ఉండవచ్చు.
అయితే, ఇది ఆయా బియ్యం రకాల్లోని ఆర్సెనిక్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. కనుక ఆర్సెనిక్ నుండి ఉందో లేదో తెలియని ముప్పు తప్పించుకోవడానికి ముడి బియ్యం – అన్ పాలిష్డ్ రైస్ తినే వాళ్ళు తెల్ల బియ్యానికి మారడం వివేకవంతమైన పని కాదు.
ఎందుకంటే ముడి బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రపంచంలో నిత్యం అనేక పరిశోధనల ఫలితాలు ప్రకటిస్తారు. ప్రతిదాన్నీ పట్టుకొని పోతూ, సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతూ, అసహనంతో, అభద్రతతో బతక రాదు. శాస్త్రీయ సమాచారాన్ని వివేకంతో అర్థం చేసుకోవడం ముఖ్యం….. డాక్టర్ యనమదల మురళీ కృష్ణ, ఎండీ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ
Share this Article