నేను చాలా కాలంగా కథలు రాస్తున్నాను. కానీ, కథా స్వరూపం గురించి, కథ యొక్క ప్రయోజనాన్ని కార్పొరేట్ ప్రపంచం ఏ విధంగా వాడుకుంటుందన్న విషయం ఈ మధ్యే, ఒక ‘టాక్’ లో పాల్గొనడం వలన మరింత నిర్దిష్టంగా తెలిసింది. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే నా జిఙ్ఞాస కారణంగానే డబ్బులు కట్టి, ఈ ‘టాక్’లో పాల్గొన్నాను.
కథలు రెండు రకాలనీ, ఒకటి స్వీయ అనుభవాల సారాంశమనీ, రెండవది మనం సమాజాన్ని పరిశీలించడం ద్వారా కలిగిన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో చెప్పడమే కథ అని చెప్పాడు. అంత వరకు ఓకే. అవి నాకు తెలిసినవే.
తరువాత మానవ జీవ పరిణామ క్రమంలో అత్యంత ముఖ్య ఘట్టం, కథలు చెప్పే సంఘటనే అనడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అందుకు ఉదాహరణగా స్పీకర్ “First Man” అనే డాక్యుమెంటరీ చూపెడుతూ, ఆ ఫిల్మ్ లో చివరి భాగంలో ఒక స్త్రీ నిలబడి మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళంతా ఉత్సుకతతో వింటున్న ఫోటో చూపించి అదే మొట్టమొదటి స్టోరీ టెల్లింగ్ సెషన్ అన్నాడు. అదే ఇప్పుడున్న హోమో సెపీయన్ (Homosapien), అంటే, ఇప్పుడున్న అసలైన తెలివైన మనుష్యజాతి ఆవిర్భావానికి నాంది అన్నాడు.
Ads
తర్వాత, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్క ఎంటర్ప్యూనర్ కూడా స్టోరీ టెల్లర్ అయితే సమాజం అతన్ని ప్రత్యేక వ్యక్తిగా గుర్తిస్తుందని, వ్యక్తులతో బాంధవ్యాలను పెంపొందిస్తుందనీ, మనం అమ్మాలనుకున్న ఆలోచనలను కానీ, వస్తువులను కానీ అమ్మడం సులభమవుతుందని చెప్పుకొచ్చారు.
ఆ వెబ్ సెషన్ అయిపోయాక భోజనం చేసి పడుకున్నాను. ఎందుకో మధ్యరాత్రి చటుక్కున మెలుకువ వచ్చింది. వెబ్ క్లాసులో విన్న విషయాలను అన్వయించుకుంటూ
ఈ మధ్య నా జీవితంలో నా అనుభవంలోకి వచ్చిన ఒక సంఘటనను కథగా మలిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచించి, రాయడం మొదలు పెట్టాను!
+++
నేను రిటైరయ్యాక సాహిత్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. కానీ, ఏదో ఒక దుర్ముహుర్తాన, తెలుగులో రోజురోజుకీ సాహిత్యం చదివేవాళ్ళ సంఖ్య తగ్గిపోతూ, టీవీలూ, సినిమాలు చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న, ఒక పాపిష్ఠి ఆలోచన రావడంతో రిటైర్ మెంటుతో వచ్చిన డబ్బులతో ఒక సినిమా తీయడం ప్రారంభించాను. ఆ సినిమా ఎన్నటికీ పూర్తి కాదూ, ఎన్ని డబ్బులు తెచ్చినా సరిపోవూ. ఒక బడ్జెటు అనుకుని, అంత మొత్తంలోనే పూర్తి చేస్తానని చెప్పిన డైరెక్టరు సగం వరకు రాగానే చేతులెత్తేసాడు, ముఖం చాటేసాడు. అప్పటికే సినిమా దర్శకత్వంలో కొన్ని మెళుకువలు నేర్చుకున్న నేను చచ్చీ చెడీ, మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి, ఎలాగో అలా సినిమా పూర్తి చేసాను. కానీ, రిలీజుకు కూడా నోచుకోలేదు. ఇప్పటికీ నా కప్ బోర్డులో, ఆ సినిమా హార్డ్ డిస్కు, నన్ను వెక్కిరిస్తూ కనపడుతూ ఉంటుంది.
అందుకే, మళ్ళీ రచనల వైపు దృష్టి సారించాను. మనమెంత మేధావులమైనా, సినిమా రంగంలోని చదువురాని మూర్ఖుల ముందు మనం వెధవాయిలమే. కానీ, రచనా రంగంలో నాకొక ప్రత్యేక స్థానం ఉంది. నా రచనలను అభిమానించే కొంత మంది అభిమానులున్నారు.
అయితే నా సినిమా ప్రయత్నం పూర్తిగా వృధా కాలేదు, ఒక ‘సీఆర్’ (అంటే కోటి రూపాయలు) పోయినా. సినిమా రంగం మీద పూర్తి అవగాహన ఏర్పడింది. నాకున్న సహజసిద్ధమైన పరిశోధనా దృష్టి కారణంగా సినిమా రంగపు అణువణువునూ ఔపోసన పట్టాను.
తెలుగు సాహిత్యంలో అన్ని రంగాల ప్రజా జీవనం మీద కథలు, నవలలు వచ్చాయి కానీ సినిమా రంగం మీద ఎప్పుడో భరధ్వాజ గారు రాసిన ‘#పాకుడురాళ్ళు‘; యన్. ఆర్ నంది గారు రాసిన ‘#సినీ_జనారణ్యం‘ వంటి ఆథెంటిక్ నవలలు తప్ప మరో మంచి నవల రాలేదు. వాళ్ళు రాసిన కాలానికీ ఇప్పటికీ సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. అంతే కాకుండా వాళ్ళు కూడా సినిమా నిర్మాణంలో పాలుపంచుకోలేదు. వాళ్ళు సినిమారంగాన్ని తమ దృష్టి కోణంలో పరిశీలించి, నవలలు రాసారు.
ఈ కారణాలతో, నేను నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా సంపాదించిన అనుభవాలతో తెలుగు సినిమా రంగం మీద నేను ఒక మహా సీరియల్ ను రాయాలని సంకల్పించాను.
ఒక యువ సినీ దర్శకుడు ఆస్కార్ అవార్డు సంపాదించాలనే ధ్యేయంగా చేసిన సినిమా నిర్మాణ ప్రయాణంగా ఒక కాల్పనిక కథను తయారుచేసుకుని హీరో హీరోయిన్ పాత్రల ద్వారా కథ చెప్పాలని నిర్ణయించుకున్నాను.
నవల నేననుకున్న రీతిలో పూర్తయింది. ఒక ప్రముఖ వారపత్రికలో సీరియల్ గా ప్రారంభమయింది.
నాకున్న కాల్పనిక రచనా చాతుర్యంతో ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని, రచన రూపంలో పాఠకుల ముందు ఉంచే సరికి మొదటి వారం కథతోనే వాళ్ళు థ్రిల్లయిపోయారు. సినిమారంగంలో ఫెయిలయిన నేను సినిమా రంగం నేపథ్యంలో రాసిన నవలతో విజయం సాధించాననిపించింది.
మొదటి వారం నుండే పాఠకులను ఉర్రూతలూగించింది. నిర్భయంగా తెలుగు సినిమా రంగంలోని కుళ్ళునంతా బయటపెట్టడంతో పాటూ, ‘అన్నమో రామచంద్రా!’ అని అలమటించే కార్మికులూ, జూనియర్ ఆర్టిస్టులూ, వృద్ధ కళాకారులూ, సినిమా మోజులో పడి శలభాల్లా మాడిపోతున్న యువతుల సంఘటనలన్నీ, సజీవ పాత్రలను సృష్టించి హృద్యంగా వివరించాను.
సినిమా రంగపు పెద్దలు తేలు కుట్టిన దొంగల్లాగా గప్ చుప్ అయ్యారు. బాహాటంగా విమర్శించే ధైర్యం లేక బెదిరింపులకు దిగారు. దాడులు చేయడానికి ప్రయత్నించారు. పత్రికా యాజమాన్యాన్ని, సంపాదకుణ్ణి ప్రలోభాలకు గురి చేసారు. కానీ, వారి పప్పులేమీ ఉడకలేదు.
సీరియల్ ముప్ఫై వారాల పాటు అప్రతిహతంగా సాగింది. ఇంకా పొడిగించమని పాఠకులు అడిగినా, నేను అంగీకరించ లేదు.
తర్వాత ఆ సీరియలును పుస్తక రూపంలో ప్రచురించాను. సేల్స్ మరీ ఆశాజనకంగా లేవు. పెట్టిన పెట్టుబడి రావడమే గగనమయింది. మన తెలుగులో ఒక రోగం ఉంది. ప్రతీ ఒక్కరూ రచయిత ఫ్రీగా ఇస్తే తీసుకుందామనుకునే వాళ్ళే. పుస్తకాలు రచయిత ఇంట్లో చెట్టుకు కాచిన పళ్ళ లాగా ఫీలవుతారు. ఈ రోజుల్లో ఒక నవల ముద్రించాలంటే ఎంత ఖర్చవుతుందో, ఎంత కష్టమవుతుందో తెలిసి కూడా, సహ రచయితలు కూడా, పుస్తకాలు ఉచితంగా కావాలని కోరుకుంటారు.
పోనీ ఎంతో అభిమానంతో, వారికి రచయిత స్వంత దస్తూరితో అభినందనలు తెలుపుతూ రాసి ఇచ్చిన పుస్తకాలను, కొంత మంది ఒకటి రెండు ఆదివారాల తర్వాత సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో అమ్ముకుంటారు. లేదా పుస్తకంలో మొదటి పేజీ కూడా చదవకుండానే తమ అమూల్య అభిప్రాయాలను దివ్యంగా వెలిబుచ్చుతుంటారు.
ఇటువంటి తరుణంలో నాకు మైసూరు నుండి మూర్తిగారనే పెద్ద మనిషి ఫోన్ చేసారు. ఆయన వయసులో చాలా పెద్ద. గొంతు వణుకుతుంది. కన్నడం, తెలుగు కలిపి మాట్లాడుతుంటే ముందు నాకు సరిగ్గా అర్థం కాలేదు. కాసేపు మాట్లాడిన తర్వాత కొంచెం కొంచెం అర్థం కాసాగింది.
ఆయన “నేను పంపిన డబ్బులు ముట్టాయా?” అని అడిగారు.
నేను లేదన్నాను. దానికి ఆయన,
“మీ నవల కోసం కొరియర్ సర్వీసులో మూడొందలు పంపాను. ముట్టలేదా?” అని అడిగారు కంగారుగా. నేను ఆశ్చర్యపోయి,
“అదేంటి? కొరియర్ కవరులో డబ్బులు పెట్టి పంపారా?” అని ప్రశ్నించాను. ఆయన వణుకుతూ,
“అవును. నాకు మీ నవల వెంటనే పంపండి. సీరియల్ గా చదివాను. మాకు ఇక్కడ తెలుగు పత్రికలు సరిగ్గా దొరకవు. అందుకని కొన్ని వారాలు చదవలేకపోయాను. ప్లీజ్! నవల వెంటనే పంపండి!” అన్నాడు.
నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే, నవల పబ్లిష్ అయిందని పత్రికల్లో రివ్యూలు రాగానే ఇలాగే చాలా మంది, డబ్బులు బ్యాంకు ఖాతాలో కట్టామనీ పుస్తకాలు పంపమనీ, విపీపీ ద్వారా పంపమని, మీకెందుకు పుస్తకాలు ముట్టగానే డబ్బులు పంపిస్తామనీ, మాకొక లైబ్రరీ ఉంది, పేద పిల్లల కోసం పుస్తకాలు పంపమనీ రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడి పుస్తకాలు
కొట్టేస్తుంటారు.
మొదట్లో వాళ్ళ తీయటి మాటలకు పడిపోయి, కొరియర్ ఛార్జీలు పెట్టుకుని పంపిన నేను తర్వాత మోసపోయానని తెలుసుకుని కొంచెం కఠినంగా ఉండడం ప్రారంభించాను.
అందుకే మూర్తి గారి మాటలను పట్టించుకోలేదు. కానీ, ఈయన అలాంటి వాడు కాదేమేనని మనసులో ఎక్కడో కలుక్కుమంటూనే ఉంది.
వారం రోజుల తర్వాత మూర్తిగారు మళ్ళీ ఫోన్ చేసి,
“నేనండీ మూర్తిని! నేను కర్ణాటక రాజ్య సిల్కు బోర్డులో మేనేజరుగా చేసి రిటైరయ్యాను. నేను పంపిన కవరు ముట్టిందా?” అని అడిగారు. నేను లేదని చెప్పడంతో, నిరాశగా,
“వస్తుంది. వస్తుంది! రాగానే నవల పంపండి!” అన్నారు.
అలా రెండు మూడు రోజులకొకసారి ఫోన్ చేసేవాడు. ఇదంతా గమనించిన మా అబ్బాయి,
“డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. నవల పంపించు నాన్నా!” అన్నాడు. నేను కూడా అదే ఆలోచనలో ఉండడంతో, ఈ సారి మూర్తిగారు ఫోన్ చేసి,
“కవరు ముట్టిందా?” అని అడిగినప్పుడు,
“ఫర్వాలేదు సార్! కవరు వస్తుంది గానీ మీ అడ్రస్ చెప్పండి. నవల పంపిస్తాను!” అన్నాను. ఆయన కంగారుగా,
“వద్దు, వద్దు! కవరులో డబ్బులతో పాటూ నా అడ్రస్ ఉంది. అక్కడికి పంపించండి!” అని అన్నాడే గానీ, నేనెంత బతిమిలాడినా అడ్రస్ చెప్పలేదు.
రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసాడు. అడ్రస్ అడిగితే చెప్పలేదు. మా అబ్బాయి నన్నే దోషిగా చూడడం ప్రారంభించాడు.
అందుకే, నేను ఆ రోజు మధ్యాహ్నం మూర్తి గారి నెంబరుకు ఫోన్ చేసాను. నేననుకున్నట్టుగానే, మూర్తిగారి నిద్రపోతున్నారని ఆయన భార్య చెప్పింది. నేను ఫలానా అని పరిచయం చేసుకుని,
“మేడం! కొంచెం మీ అడ్రస్ చెప్పండి! నవల పంపిస్తాను!” అన్నాను. ఆమె తటపటాయించింది. నేను బ్రతిమిలాడేసరికి అడ్రస్ చెప్పింది. నేను వెంటనే కొరియరులో పుస్తకం పంపించాను.
మళ్ళీ మూర్తిగారి దగ్గర నుండి ఫోన్ రాలేదు.
+++
నెల రోజుల తర్వాత మిసెస్ మూర్తి గారి దగ్గర నుండి ఒక కవరు వచ్చింది. అందులో రెండు ఉత్తరాలతో పాటూ మూడు వందల రూపాయలున్నాయి. మొదటి ఉత్తరం మూర్తి గారు నాకు రాసింది. అందులో,
“రచయిత గారికి, మీ సీరియల్ బాగా నచ్చింది. నేను కూడా కొన్ని సినిమాల్లో నటించాను కాబట్టి నేను మీ నవలతో ఐడెంటిఫై అయ్యాను. ఈ ఉత్తరంతో పాటు మూడు వందలు పంపుతున్నాను. వెంటనే నవల పంపించండి. కొరియర్ ఛార్జెసుకు నా దగ్గర డబ్బులు లేవు. ప్లీజ్!” అని రాసి సంతకం చేసారు. సంతకం కింద మూడు నెలల క్రిందటి తేదీ ఉంది.
దాంతో, కొంతమంది స్వార్థపరులు చేష్టల వల్ల నిజమైన అభిమానిని అనుమానించానని నా మనసు బాధతో మూలిగింది. గుండె కింది కండ కదిలింది.
రెండో ఉత్తరంలో మూర్తిగారి భార్య,
“బాబూ! నేను మూర్తిగారి భార్యను. మూర్తిగారు మీ సీరియల్ చదవాలని తహతహలాడుతుండే వారు. ప్రతీ వారం మైసూరంతా తిరిగి వీక్లీ కోసం ప్రయత్నించేవారు. దొరికితే చిన్న పిల్లవాడిలా సంతోషించేవాడు. లేకపోతే చిన్నబుచ్చుకునే వాడు. నవల పబ్లిష్ కాగానే తెప్పించుకుంటానని ఉత్తరం రాసారు. కానీ, అప్పటికే ఆయనకు డిమెన్షియా వ్యాధి ముదిరిపోయింది. ఏ విషయమూ సరిగ్గా గుర్తుండేది కాదు. మతి మరుపు ఎక్కువైంది. ఎందుకో, మీరు తన గురించే నవల రాసారనే ఆలోచన ఆయన మనసులో ఫిక్సయింది. అందుకే నవల పంపమని మీకు ఉత్తరం రాసారు కానీ దాన్ని ఎక్కడో పెట్టి మరిచిపోయారు. కానీ, ఆ ఉత్తరాన్ని మీకే పంపానని ఆయన గట్టిగా నమ్మే మీకు ఫోన్ చేస్తుండేవారు. మీరు పెద్ద మనసు చేసుకుని నవల పంపారు. మూర్తిగారు ఆ నవలను రెండు మూడు సార్లు చదివారు. ఆ పుస్తకం చేతిలో పట్టుకునే, నిద్రలోనే ఇరవై రోజుల క్రితం పరమపదించారు. తరవాత ఆయన ఇన్సూరెన్స్ కాగితాలు వెతుకుతుంటే, వాటితో పాటూ మీకు రాసిన ఉత్తరం కూడా దొరికింది. అంటే ఆయన మీకు ఉత్తరమూ, డబ్బులూ పంపించనే లేదు కానీ…..” అక్కడ కొన్ని అక్షరాలు మసకబారాయి. బహుశా అవి మిసెస్ మూర్తిగారి కన్నీటి బొట్ల తాలూకు చిహ్నాలేమో.
“డబ్బులు పంపకున్నా పుస్తకం పంపిన మీ ఔదార్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే, మూర్తిగారు ఆ నవలను ఎంతో ఉత్సాహంగా చదివారు. తన కథే అని సంబరపడ్డారు. చివరి రోజుల్లో తృప్తిగా మరణించారు. ఉంటాను. బాబూ! చల్లగా ఉండండి!” అని నన్ను దీవించింది.
ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి నా గుండె గొంతుకలో అడ్డం పడి, ఏడుపు ముంచుకొచ్చింది.
ఉత్తరం పట్టుకుని ఏడుస్తున్న నన్ను చూసి మా ఇంట్లోవాళ్ళు విస్తుపోయారు….. రచన: డాక్టర్ ప్రభాకర్ జైనీ (ఆంధ్రజ్యోతి ఆదివారం) 11.8.2019
Share this Article