Sai Vamshi………. చిన్నప్పుడు ఏమీ తోచక టీవీ ఛానెల్స్ తిప్పుతూ ఉంటే ఉర్దూ ఛానెల్ కనిపించేది. ఎవరో గాయకుడు స్టేజీ మీద కూర్చుని పాడుతూ ఉండేవారు. భావావేశంతో ఆయన పాడుతూ ఉంటే, కింద జనం వహ్వా అంటూ ఆనందించేవారు. సినిమా పాటల్లా కాకుండా అత్యంత సున్నితంగా ఉన్న ఆ పాటేంటో అర్థమయ్యేది కాదు. భాష కూడా తెలియదు. ఉర్దూ అంటే ముస్లింల భాష అన్న అపోహ కారణాన కాసేపటికి ఆ ఛానెల్ మార్చేసేవాణ్ని. నాకు మల్లే అనేక మందిలో నెలకొన్న ఆ అపోహ నేటికీ కొనసాగుతోంది. ఆ కారణంగా కోల్పోయిన విలువైన విషయాల్లో ‘ఉర్దూ గజల్’ ఒకటని చాలా ఏళ్ళ తర్వాత తెలిసింది.
* *
మెహిదీ హసన్ మహా గాయకుడు. ఆయన పాడిన ‘రఫ్తా రఫ్తా వొ మేరీ’ గజల్ వినండి. అచ్చమైన తెలుగు పాటొకటి గుర్తొస్తుంది. ఏంటా పాట? ‘చుట్టూ చెంగాబి చీర.. కట్టావే చిలకమ్మా’. జగ్జీత్‌సింగ్ గారు పాడిన ‘తుమ్ నహీ ఘమ్ నహీ’ విన్నారా? వినగానే గుర్తొచ్చే తెలుగు పాట ‘మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ‘పాడుతా తీయగా’లో చెప్పారు కాబట్టి ఈ సంగతులు తెలిశాయి. ఆయా ఉర్దూ గజల్స్ బాణీని స్ఫూర్తిగా తీసుకుని చేసిన తెలుగు పాటలు మనకు తెలిశాయి. తెలియనివి ఇంకా ఎన్నో! వందల పాటలు, వేల మాటలు. చాలా గీతాలపై ఆ గజల్స్ ప్రభావం ఉంది.
Ads
* * *
గజల్ (Ghazal) పుట్టుక అరబిక్ దేశాల్లో ఉంది. ప్రేమ, బాధ, విరహం, ఎడబాటు, ఒంటరితనం లాంటి భావాలను కవితాత్మకంగా వినిపించే ప్రక్రియ గజల్. 12వ శతాబ్దంలో దక్షిణాసియా దేశాలకు విస్తరించింది. ఇస్లాం పరిపాలన, సూఫీ తత్వం విస్తరించిన చోట్ల గజల్ తన ఉనికిని చాటుకుంది. 13వ శతాబ్దంలో పార్సీ కవి హజ్రత్ అమీర్ ఖుస్రో గజల్‌కు మన దేశంలో ప్రాణప్రతిష్ట చేశారు.
మనదేశంలో గజల్ గాయకులకు కొదవలేదు. కుందన్‌లాల్ సైగల్‌ను ఎవరైనా మర్చిపోతారా? బడే గులాం అలీ ఖాన్ గారి గంభీరమైన గొంతు విన్నారా? ‘మాలికా-ఎ-గజల్’ బిరుదు పొంది ‘గజల్ రారాణి’ అనిపించుకున్న బేగమ్ అక్తర్ గొంతు వినకుండా ఉంటారా? ‘గజల్ రారాజు’ తలత్ మహమూద్‌ని తల్చుకోకపోతే ఎలా? మెహిదీ హసన్ గారు పాడిన ‘మొహబ్బత్ కర్నేవాలే’ను ఎన్నిసార్లు వింటే తనివి తీరుతుంది?
ఉస్తాద్ గులాం అలీ గారి ‘చుప్‌కే చుప్‌కే రాత్ దిన్’ వింటూ ఉంటే లోకం గుర్తుంటుందా? జగ్జీత్‌సింగ్ గారి ఒక్కో పాట ఒక్కో ముత్యం. ఎన్నని ఏరగలం? భర్త, కుమారుడి మరణం తర్వాత పాట పాడకుండా మిగిలిపోయిన చిత్రాసింగ్ గారి గొంతులో ఆనాటి మాధుర్యాన్ని ఎవరు మర్చిపోతారు?
ఇంకా ఎందరో మహానుభావులు.. మహమ్మద్ రఫీ, ఆశాభోంస్లే, లతా మంగేష్కర్, ముఖేష్, మన్నాడే లాంటి సినీ నేపథ్య గాయకులూ సందర్భానుసారం అనేక గజల్స్ పాడారు.
* *
ఎంత గొప్ప రచన. ఎంత మన్నికైన సృజన. అరబిక్ నుంచి ఉర్దూలోకి వచ్చి, ఆపైన తెలుగులోనూ గజల్ తన ఉనికి చాటింది. వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది.. పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది.. 1965లో వచ్చిన తొలి తెలుగు గజల్‌లోని మక్‌తా ఇది. 14 ఏప్రిల్ 1965 ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ఉగాది గజల్” అన్న శీర్షికతో అచ్చయింది. దీన్ని రాసిన దాశరథి కృష్ణమాచార్యులు తొలి తెలుగు గజల్ రచయిత అయ్యారు. ‘గజల్’ అనే శబ్దానికి అర్థం ‘ఇంతులతో మంతనాలు’ అన్నారు దాశరథి.
తొలి తెలుగు గజల్ గాయకుడు పి.బి.శ్రీనివాస్ గారు కాగా, తొలి తెలుగు గజల్ గాయనిగా శొంఠి పద్మజ పేరు పొందారు. సినారె, రోచిష్మాన్ వంటి వారు అనేక తెలుగు గజళ్లు రాశారు. కొలకలూరి స్వరూపరాణి (రత్నజ) 2008లో ‘దుఃఖార్తి’ అనే గజల్ రాసి తొలి తెలుగు గజల్ కవయిత్రిగా మారారు. గజల్ శ్రీనివాస్, గజల్ వినోద్, కొత్తకాపు స్వరూపరెడ్డి తదితరులు అనేకమంది నేటికీ తెలుగు గజల్‌ను తమగొంతుతో విశ్వవ్యాప్తం చేస్తున్నారు. 2001లోనే పత్తిపాక మోహన్ గారు తెలుగులో తొలిసారి గజల్ ప్రక్రియపై పీహెచ్‌డీ చేశారు.
* * *
ఇంత చరిత్ర ఉంది. మనం తెలుసుకుందాం! మరింత తెలుసుకుందాం! గజల్స్ వింటూ ఆనందిస్తూ తెలుసుకుందాం! మెహిదీ హసన్ గారి ‘రంజిష్ హీ సహీ’ గజల్ విన్నారా? వినండి. అద్భుతం..
Share this Article