మనకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురించి ఎంతో కొంత తెలుసు కదా… తల్లి శ్యామల గోపాలన్ తమిళురాలు… తన రూట్స్ మరిచిపోలేదు… తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందినవాడు… భర్త డగ్ ఎమ్‌హాఫ్ అమెరికన్… ఇప్పుడు మరో ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తున్నయ్… 1) ప్రీతి పటేల్… 2) రిషి సునక్… ఈ ఇద్దరూ బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో కనిపిస్తున్నారు… వీరిలో ప్రీతిపటేల్ ప్రస్తుతం హోం సెక్రెటరీ… రిషి సునక్ ఆర్థిక విభాగం చాన్సిలర్… మనకు తెలిసిన పోస్టులతో పోలిస్తే అవి అంత త్వరగా అర్థం కావు, కానీ ఇద్దరూ ఆ దేశానికి సంబంధించిన కీలక అధికార బాధ్యతల్లో ఉన్నారు…
ప్రీతిపటేల్… మూలాలు గుజరాత్… గుజరాతీలు, పంజాబీలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారు… ఓ ధాబా, ఓ షాపు… అలాగే పాటిల్ తాత కూడా ఉగాండా వెళ్లాడు… కానీ అక్కడి రాజకీయ నిర్ణయాలతో బాధితులు, తరువాత ప్రితి బ్రిటన్‌లోనే పుట్టింది… అలెక్స్ సాయర్ అనే బ్రిటిషర్‌ను పెళ్లి చేసుకుంది… ఇప్పుడు బ్రిటన్ ప్రధాని పదవి ఖాళీ అయ్యే సూచనలున్నయ్… అందులోకి ప్రీతి పటేల్ వస్తుందా లేదా కాలం చెబుతుంది…
మరోపేరు రుషి సునక్… తండ్రి యశ్‌వీర్ కెన్యాలో పుట్టాడు… తల్లి ఉష టాంజానియాలో పుట్టింది… రూట్స్ పంజాబ్… సునక్ పెళ్లి చేసుకున్నది అక్షత మూర్తిని… ఆమె ఎవరో కాదు, ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి బిడ్డ… హౌజ్ ఆఫ్ కామన్స్‌లో భగవద్గీత మీద ప్రమాణం చేసి పదవీస్వీకారం చేశాడు… ఇప్పుడు బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రిషిదే…
Ads
అంతకుముందు మనం నాసాతో అనుబంధం ఉన్న సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా, బండ్ల శిరీష, రాజా జాన్ వుర్పుటూర్ చారి… తదితరుల గురించి కూడా చెప్పుకున్నాం… నానాజాతి సమితి… రూట్స్ ఇండియన్స్… ఎవరెవరినో పెళ్లి చేసుకుంటున్నారు… మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటే… బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నవాళ్లు కూడా అంతే… వాళ్లు విశ్వమానవులు… మనమేమో ఇంకా కులాలు, గోత్రాలు, మతాలు, జాతకాల గీతల్లోనే గిరగిరా తిరుగుతున్నాం… చాలామంది ఈరోజుకూ ‘‘మనిషి గీసుకున్న ఈ సంకుచిత గీతల్ని’’ దాటలేకపోతున్నారు… కానీ వీళ్లకు దేశాలు, ఖండాలనే తేడాయేమీ లేదు… ప్రజల మధ్య గీయబడిన అన్ని గీతలూ చెరిపేసినవాళ్లు… టాప్ రేంజ్ ప్రొఫెషనల్ సైన్స్, ఇంజనీరింగ్ స్టడీస్, పాలిటిక్స్.., అదే రేంజ్ జాబ్స్… సూటబుల్, అడాప్టబుల్ లైఫ్ పార్టనర్లను వెతుక్కుంటున్నారు… వాళ్ల లక్ష్యాలు, వాళ్ల ప్రయాణాల ముందు పెళ్లిళ్లు నిజానికి చిన్న విషయం…
కొన్నేళ్లుగా బోలెడు విమర్శలు వింటున్నాం కదా మనం… అమెరికా వెళ్లినా, అంటార్కిటికా వెళ్లినా, చివరకు అరుణగ్రహం వెళ్లినా, కొందరికి కులగజ్జి పోదు… పోవడం లేదు… ప్రతిచోటా అర్జెంటుగా కులసంఘాలు పెట్టేసి, తలతిక్క కీచులాటలకు, కులరాజకీయాలకు దిగుతున్నారు… మళ్లీ ఇండియాకు వచ్చి, అన్నిరకాలుగానూ తమకు ‘మ్యాచయ్యే మ్యాచు’లను వెతుక్కుని మరీ, వెంటేసుకుని పోతున్నారు… మనవాళ్ల ఆలోచన పరిధి ఇంకా బోలెడు లోకల్ పరిమితుల్లోనే ఉండిపోతోంది… అందరూ అలాంటోళ్లు అని కాదు… కానీ అధికులు అలాగే…!! మరి ఇందాక మనం చెప్పుకున్న వీళ్లంతా..?! ఐడియన్ ఐకన్స్… అసలు ఇలాంటివాళ్లు కదా… కొత్తతరానికి ప్రతీకలు, సూచికలు..!! వాళ్ల ప్రపంచం సువిశాలం… అది ఖగోళమంత విస్తారం..!! అది చెప్పుకోవడమే ఈ కథన ఉద్దేశం…!!
Share this Article