Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బురం… గాలిలోకి ఎగిరితే చాలు… భూమి చిన్నదైపోతుంది…

November 22, 2020 by M S R

వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగ జాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆ కాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టు దాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు అన్న సంపాతితో సరదాగా పందెం వేసింది. సూర్యుడి దాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- అని. సంపాతి సై అంది. అంతే ఒకరికంటే ఒకరు వేగంగా పైపైకి వెళ్లి సూర్య మండలం దాకా ఎగిరిపోయారు.

జటాయువు చిన్నవాడు కాబట్టి కొంచెం చురుకుగా ఉన్నాడు. దాదాపు సూర్యుడికి దగ్గరవుతున్నాడు. ఈలోపు సంపాతికి జరగబోయే ప్రమాదం కళ్ల ముందు కనిపించింది. వెంటనే వేగం పెంచి తమ్ముడు జటాయువును తన రెక్కల కింద దాచుకుని- పైకి వెళ్లే వేగం తగ్గించాడు. అప్పటికే సంపాతి రెక్కలు మాడి మసి అయిపోయాయి. స్పృహ దప్పినా తమ్ముడిని రక్షించగలిగాడు. లేకపోతే జటాయువు బూడిద అయిపోయేవాడు.

రెక్కలు లేక ఎగరలేక సంపాతి అంతెత్తు నుండి కింద తమిళనాడు గడ్డ మీద మహేంద్రగిరి పర్వతసానువుల్లో పడిపోయాడు. జటాయువు గోదావరి తీరంలో దండకారణ్యంలో పడ్డాడు. ఆ తరువాత అన్నదమ్ములు ఒకరినొకరు కలవలేదు. కలుసుకునే అవకాశం రాలేదు. రెక్కల్లేని సంపాతిని ఒక రుషి చేరదీసి వేళకింత ఆహారం పెట్టేవాడు.

స్వామీ! పక్షికి రెక్కలే ప్రాణం. ఇంతకంటే చావు నయం- నాకెప్పటికి విముక్తి? అని అడిగితే… బాధపడకు- సీతాన్వేషణలో హనుమ ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీ అనితరసాధ్యమయిన చూపుతో నువ్వు రామకార్యానికి మాటసాయం చేయి. దాంతో కాలిపోయిన రెక్కలు మళ్లీ వస్తాయి- అని అభయమిచ్చాడు. అలాగే హనుమ బృందం వస్తుంది. సీతమ్మ జాడ చెప్పగానే పోయిన రెక్కలు వస్తాయి. అయితే తన తమ్ముడు జటాయువు రావణుడితో పోరాడి మరణించాడన్న వార్త హనుమ, జాంబవంతులద్వారానే సంపాతికి తెలుస్తుంది.

రావణుడి కత్తికి రెక్కలు తెగిన జటాయువు రాముడికి సీతాపహరణ వార్త చెప్పడం కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకుని- రాముడి ఒడిలోనే కన్నుమూశాడు. రాముడే స్వయంగా జటాయువుకు అంత్యక్రియలు చేశాడు. కొన ఊపిరితో ఉన్న జటాయువును రాముడు లే! పక్షి! అంటే అదే ప్రస్తుతం అనంతపురం జిల్లా లేపాక్షి అయ్యిందని శతాబ్దాలుగా ఒక కథనం.

రాముడు తెలుగులో లే పక్షి ! అన్నాడా? అని ఒక వితండవాదం లేవదీశారు. లేపాక్షి స్వప్న దర్శనం పేరిట బాడాల రామయ్య రాసిన ఒక పద్యకావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాస్తూ ఈ వితండవాదానికి చక్కటి వివరణ ఇచ్చారు. రామదాసు, త్యాగయ్యలు తెలుగులో మాట్లాడితే సమాధానమిచ్చిన రాముడు- రక్తపుమడుగులో పడి ఉన్న జటాయువును లే పక్షి! అని అనకుండా ఎందుకుంటాడు? అని. జటాయువును రాముడు కలిసిన చోటు ఇప్పటికీ లేపాక్షి పక్కన రెండుకిలోమీటర్ల దూరంలో దర్శనీయ స్థలం. పూజనీయ స్థలం. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా లేపాక్షి నంది పక్కన కొండమీద పెద్ద జటాయువు ప్రతిమను కూడా ఏర్పాటు చేయించారు.

భూమికి పద్నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి దాకా వెళ్లగలిగిన సంపాతి- జటాయువులు ఈ యుగంలో, ఈరోజుల్లో లేవని మనం బాధపడాల్సిన పనిలేదు. తాజాగా అమూర్ డేగల జంట 361 రోజుల్లో 29వేల కిలోమీటర్లు ప్రయాణించింది. దేశాలు, ఖండాలు, మహా సముద్రాలు దాటి- చైనా నుండి దక్షిణాఫ్రికా దాకా వెళ్లి; మళ్లీ అదే గగనదారిలో మన మణిపూర్ కు వెనక్కు వచ్చాయి. వాటికి అమర్చిన శాటిలైట్ రేడియో ట్రాన్స్మిషన్ మొత్తం ట్రాకింగ్ ను రికార్డు చేసింది. ఒక్కోసారి నాలుగయిదు వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలవు ఈ డేగలు. వీటి వేగం, దూరతీర ప్రయాణం ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్…

త్రేతాయుగంలో రామకార్యానికి సంపాతి- జటాయువు నిరీక్షించి ఆ పని పూర్తి చేశాయి. కలియుగంలో ఈ ఆడ మగ డేగలు ఏ స్వామి కార్యానికి ముప్పయ్ వేల కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణించాయో ఎవరికెరుక?

అమూర్ పక్షులారా! మీముందు భూగోళం చిన్నబోయింది. కొండలు కుచించుకుపోయాయి. మహాసముద్రాలు పిల్లకాలువలయ్యాయి. దూరం మీ రెక్కలకు వంగి సలాము చేస్తోంది!

  • పమిడికాల్వ మధుసూదన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!
  • అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!
  • పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…
  • పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!
  • ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?
  • ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?
  • ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…
  • చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…
  • #కాశీలో ఓరోజు… ఆటగదరా శివా…! ‘‘నేనేం తెలుసుకున్నాను’’…
  • బెడిసిన మోడీ ప్లాన్స్… శశికళను తొక్కేసి, తనూ మునిగాడు… లక్కీ స్టాలిన్…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now