Amarnath Vasireddy……… మీరు .. మీ నాన్న గారు .. మీ తాత గారు .. ముత్తాత గారు . ఇక్కడి దాకా ఓకే . కానీ . ఇంకా ముందున్న పూర్వీకులు గురించి మీకు తెలుసా ? పోనీ మీకు ఎంత మంది పూర్వీకులు వున్నారో తెలుసా ? భూమిపై మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలు అయ్యింది . వందేళ్లకు మూడు తరాలు. అంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది పూర్వీకులు వున్నారు .. ముత్తాతకు నాన్న .. ముత్తాతకు తాత .. ముత్తాతకు ముత్తాత .. ఇలా వెనక్కు వెళితే మొత్తం కోటి ఇరవై లక్షల తరాల చరిత్ర మీది .. నాది .. మనందరిది .
మనిషి అయిదు వేల సంవత్సరాల క్రితం దాక అడవిలోనే నివసించాడు . అంటే మీ పూర్వీకుల్లో ఒక కోటి పందొమ్మిది లక్షల ఎనబై అయిదు వేల మంది బతికింది అడవుల్లోనే. చివరి పదిహేను వేల తరాల వారు మాత్రమే గుడిసెలు వేసుకొని స్థిరనివాసం ఏర్పరచుకొని గ్రామాల్లో బతికారు . అడవిలో జీవనం అంటే చెట్లు చేమలు .. జంతువులతో సావాసం .. ఆ మాటకు వస్తే గుడిసెల్లో గ్రామీణ జీవనం కూడా ప్రకృతిలో జీవించడమే కదా? . చెట్టు- పుట్ట, పురుగు- పక్షి ఇలాంటి వాటికి దూరంగా బతికింది, బతుకుతోంది .. మీరు లేదా మహా అంటే మీ నాన్నమాత్రమే . ఒక కోటి ఇరవై లక్షల తరాల్లో.. చివరి ఒకటి లేదా రెండు తరాల దారి వేరు . అంతకు ముందు తరాలు అంటే 99.99 శాతం మానవ చరిత్ర ఒక ఎత్తు.
జంతువుల మధ్య, చెట్ల మధ్య బతుకుతున్నప్పుడు సూక్ష్మ జీవులు మనిషి శరీరాన్ని తాకేవి . ఆ సూక్ష్మ జీవుల్లో మనిషి దేహానికి మంచి చేసేవి ఉంటాయి . కీడు చేసేవి ఉంటాయి . ఏది మంచి చేసేవి ? ఏది చెడు చేసేవి అని ఎలా తెలుస్తుంది . ఇప్పుడైతే ఎలెక్ట్రాన్ మైక్రోస్కోప్ లు వచ్చాయి . బాక్టీరియా, వైరస్ ల గురించి తెలుసు . మరి మొదటి ఒక కోటి పందొమ్మిది ల్లక్షలా తొంబై తొమ్మిది వేల తొంబై ఎనిమిది తరాల సంగతి ? వారికి ఇవి మంచి బాక్టీరియా ! ఇవి దేహానికి కీడు చేసేవి . అని ఎవరు చెప్పారు ?
Ads
ఎవరో చెప్పనక్కర లేదు . ప్రకృతి ఆ ఏర్పాటు చేసింది . ప్రతి మనిషి దేహంలో రక్షణ వ్యవస్థ అంటే ఇమ్మ్యూనిటి సిస్టం ఉంటుంది . కాలగమనంలో మ్యుటేషన్ , డైరెక్షనల్ నాటురల్ సెలక్షన్ అనే పద్దతుల పరస్పర చర్యల ద్వారా బలమైన ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఏర్పడింది . బలమైన ఇమ్మ్యూనిటి ఉన్న వారే బతికారు . మనం అందరం అలా బతికిన వారి వారసులం . అంటే మనలోని ఇమ్మ్యూనిటి వ్యవస్థ చుట్టుపక్కల సూక్ష జీవులతో సావాసం చేసేందుకు వీలుగా ఏర్పడింది . సూక్ష్మ జీవుల్లో మనకు మంచి చేసేవి వున్నాయి . మన దేహంలో ముప్పై ట్రిలియన్ ల కణాలు ఉంటే అందుకు పది రెట్లు మొత్తం మూడు వందల ట్రిలియన్ల బాక్టీరియాలు వున్నాయి . ఇవి మన దేహానికి అవసరం . అవి లేకుండా మనం బతకలేము . ఒక వంతు నువ్వు .. పది పాళ్ళు సూక్ష్మ జీవులు .. ఇదీ నీ దేహం .
అలాగని అన్ని సూక్ష్మ జీవులూ మంచి చేసేవి కావు . కీడు చేసే సూక్ష్మ జీవులను గుర్తించి మన రక్షణ వ్యవస్థ చంపేస్తుంది . అది ఆ విధంగా రూపొందింది . ఆ విధంగా దానికి పుట్టినప్పటి నుంచి .. కాదు కాదు పుట్టక ముందు నుంచి ట్రైనింగ్ ఉండేది . బిడ్డ ఎలా పుడుతుంది ? తల్లి గర్భం నుంచి జననద్వారం ద్వారా బయటకు వస్తుంది . కదా ? తల్లి గర్భం నుంచి శిశువు జనన ద్వారం ద్వారా బయటకు వస్తుంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది . ఆ సమయంలో ఆ జనన ద్వారంలో అంటే తల్లి యోనిలో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు బిడ్డపై దాడి చేస్తాయి . అదిగో అలా భూమిపై పడకముందే మనిషి సూక్ష్మ జీవులతో పోరాటం మొదలు పెట్టేస్తాడు . అందుకు తగ్గట్టుగా ఇమ్మ్యూనిటి వ్యవస్థ రూపొందింది .
ఇప్పుడేమో తల్లి కడుపు కోసి బిడ్డను బయటకు తీస్తున్నారాయె . దీనివల్ల బిడ్డ తన తొలి బాటింగ్ ప్రాక్టీస్ ను మిస్ అవుతోంది . తల్లి యోని ద్వారంలో వుండే సూక్ష్మ జీవులతో పోరాటం ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు తొలి మెట్టు . ఇది ఎంతో కీలకం . సిజేరియన్ బిడ్డలకు ఈ అవకాశం ఉండదు . వారి ఇమ్మ్యూనిటి వ్యవస్థ పుట్టుకతో అంగ వైకల్యంతో పుట్టినట్టు లెక్క . పుట్టిన బిడ్డకు తల్లి చనుపాలు ఇస్తుంది . ఈ పాలల్లో బిడ్డ ఇమ్మ్యూనిటి వ్యవస్థను బలోపేతం చేసేవి ఉంటాయి . మంచి సూక్ష్మ జీవులు , చెడు చేసే సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి . ఇందువల్ల బిడ్డ ఇమ్మ్యూనిటి వ్యవస్థకు రెండో బాటింగ్ ప్రాక్టీస్ .. రోజూ బాటింగ్ ప్రాక్టీస్ . ఇప్పుడేమో డబ్బా పాలు . అందులో సూక్ష్మ జీవులు వుండవు . అంటే ఇమ్మ్యూనిటి వ్యవస్థకు ప్రాక్టీస్ లేదు .
ఊరంతా ఒక దారి .. ఉలిపి కట్టెది ఒక దారి అని సామెత . నీ పూర్వీకులందరిది ఒక దారి .. నీది మాత్రమే ఒక దారి . నువ్వు చేస్తున్న పనులు నీకు గొప్ప .. కానీ నీ శరీరంలోని ఇమ్మ్యూనిటి వ్యవస్థకు అవి అలవాటు లేనివి . దానికి నీ దేహం రెడీ గాలేదు . ఇది వాస్తవం . ఇదే అసలు సైన్స్ . పుట్టింది మట్టిలో .. బోళ్లా పడింది .. దోగాడింది.. లేచి నిలబడింది .. నడిచింది .. ఆడింది … మట్టిలో .. పెరిగింది మట్టిలో . బతుకే మట్టిలో . మట్టి మనిషివి నీవు . ఇలా చేస్తున్నపుడు ప్రతి నిమిషం… ప్రతి రోజు .. సూక్ష్మ జీవులు నీ శరీరంలోకి వెళ్ళేవి . అందులో మంచి చేసేవాటిని నీ శరీరం ఆహ్వానించేది . రండి .. రండి దయచేయండి అంటూ ఆహ్వానించేది . పీట వేసేది . ఆతిథ్యం ఇచ్చేది . మన జీవ ప్రక్రియల్లో ఈ సూక్ష్మ జీవులు కీలక విధుల్ని నిర్వహిస్తాయి . అవి లేకుంటే మనం లేము . అదే సమయంలో దేహానికి కీడు చేసే సూక్ష్మ జీవుల్ని గుర్తించి వెంటనే చంపేసేది మన ఇమ్మ్యూనిటి వ్యవస్థ .
ఒకప్పుడు పచ్చి మాంసం తినే వారు . అందులో సూక్ష్మ జీవులు ఉండవా ? ఉంటాయి . దాని సంగతి ఇమ్మ్యూనిటి చూసుకొంటుంది . అటుపై వండిన వంటకాలు . అందులో పాచినవి ఉంటాయి . సద్ది అన్నం .. పులిసిన పెరుగు . ఇలా రోజూ .. బతికేది సూక్ష్మ జీవులతో .. తినేది సూక్ష్మ జీవులను .. అదీ నీ చరిత్ర . అవునన్నా కాదన్నా ఇది నిజం . దీనికి అనుగుణంగా నీ దేహం రూపొందింది . ఆధునిక జీవి . తల్లి కడుపు కోసి బయటకు తీశారు .. స్టెరిలైజ్డ్ ఆపరేషన్ థియేటర్ . ఎక్కడా సూక్ష్మ జీవులు వుండవు . అటుపై బాగా డెట్టాల్ తో శుభ్రం చేసిన రూమ్ .. డబ్బా పాలు .. అటుపై నెష్టం.. రూమ్ లో సూక్ష్మ జీవులు వుండవు . సరే .. బయటకు బిడ్డను పంపేవా ? గదిలో పెంపకం .. సోఫా .. టీవీ .. ఫ్రిజ్ నుంచి తీసిన ఆహారం .. స్టెరిలైజ్ చేసిన పాలు .. మట్టిలో ఆటలు లేవు .. ఇసుక గూళ్ళు కట్టడాలు లేవు . ఇదే ఆధునికత .
మీ ఇంట్లో ఒక కుక్క వుంది . దానికి ఇంట్లో మనుషులు ఎవరో తెలుసు . అలాగే మీ బంధువులు వస్తే కూడా గుర్తుపడతాయి . మొరగవు . కదా ? అదే కొత్తవారు ముఖ్యంగా అనుమానాస్పదంగా ఉన్న వారు వస్తే .. మీద పడి రక్కేస్తాయి . అవునా ? కాదా ? కుక్కకే అంత ట్రైనింగ్ ఇచ్చారు . మరి మీ ఇమ్మ్యూనిటి కి ట్రైనింగ్ ఎలా ? నీకు నచ్చినా నచ్చక పోయినా నీ చరిత్ర అంతా సూక్ష్మ జీవులతో సావాసమాయె . గడ్డి మంచిది .. బంక మట్టి మంచిది .. తోటలో పుప్పొడి రేణువులు మంచివి . పాలు మంచివి .. వేరుశనిగ మంచిది అని దానికి తెలియాలి . తెలియకుండా పెంచితే ? మీ కుక్క మీ బంధువులపై పడి రక్కేసినట్టే మీ ఇమ్మ్యూనిటి ఏది మంచిదో ఏదో చెడు అని అర్థం చేసుకోకుండా పెరిగితే పాలు .. గడ్డి ఇలా హానికరకం కాని వాటిని కూడా హానికారకం అని అనుకోనిరీతిలో రియాక్ట్ అవుతుంది . అదే ఎలర్జీ . ఫుడ్ ఎలర్జీ .. స్కిన్ ఎలర్జీ . గాడిద గుడ్డు ఎలర్జీ . తప్పెవరిది ? చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలా వద్దా ?
మీ కుక్కను మీరు గదిలో కట్టేసి పెంచారు . దానికేమో బయటకు పోవాలని వుంది . మీరు బయటకు వదలరు . దానికి పిచ్చి ఎక్కి మీ పైనే పడి రక్కేసింది . అదిగో అదే ఆటో ఇమ్యూన్ వ్యాధి . మీకు రక్షణ గా ఉండాల్సిన వ్యవస్థ … హాని కారక జీవులపై దాడి చేసి చంపాల్సిన వ్యవస్థ .. మీ శరీర అంగాలపై .. గుండె .. ఊపిరితిత్తులు , కిడ్నీ ఇలా ఒక్కోదానిపై దాడి చేసి హాని కలిగించడమే ఆటో ఇమ్యూన్ వ్యాధి . చికిత్స లేదు . ఇది నాగరికత సాధించిన ఘనత .
వాక్సిన్లు అవసరమే .. స్మాల్ పాక్స్ .. పోలియో లాంటి ప్రాణాంతక వ్యాధులనుంచి మానవాళిని రక్షించాయి . అదే విధంగా యాంటిబయోటిక్స్ కూడా . అదే సమయంలో వీటిని అతిగా వినియోగిస్తే ? వాక్సిన్ అంటే ఇమ్మ్యూనిటి వ్యవస్థను డూప్ చేయడం . యాంటిబయోటిక్స్ ఎక్కువగా వాడితే శరీరంలోని మంచి చేసే బాక్టీరియాలు కూడా చనిపోతాయి . వాక్సిన్ అతి వినియోగం అంటే ఇమ్మ్యూనిటితో చెలగాటమే . పిల్లల్ని పెంచి పెద్ద చేసే విధానం … లాలి పాటలు .. జోల పాటలు ..చందమామ రావే .. జ్యో అచ్యుతానంద .. బెడ్ టైం స్టోరీస్ .. అనగనగా ఒక రాజు .. ఏడుగురు కొడుకులు .. గడ్డి మోపు .. అమ్మ నాన్న .. అనురాగం . ఆప్యాయత, వన భోజనాలు , మూన్ లైట్ డిన్నర్లు ఇవన్నీ గతం . వీడియో గేమ్స్ .. సెల్ ఫోన్ .. జంక్ ఫుడ్ .. లివ్ ఇన్ రిలేషన్షిప్.. విడాకులు .. అమ్మ నాన్న కీచులాటలు, గన్ కల్చర్ .. స్ట్రెస్ .. ఇవి వర్తమానం . ఇవి ఇమ్మ్యూనిటిని ఎలా ప్రభావితం చేస్తాయో మరో పోస్ట్ లో వివరిస్తాను . అదేవిధంగా ఏమి చెయ్యాలో కూడా ఆ పోస్ట్ లో చేబుతాను . తిరిగి అడవుల్లోకి వెళ్ళ లేము . పచ్చి మాంసం తినమని కాదు . చేయాల్సినవి .. చేయకూడనివి కూడా చెప్పుకుందాం…
Share this Article