Rajan Ptsk……….. నా భావాలకు నిర్దిష్టమైన రూపం ఏర్పడనప్పుడూ, ఏర్పడీ అక్షర రూపం కలగక నేను సంఘర్షణ పడుతున్నప్పుడూ.. నా మూడ్ నన్ను నన్నుగా ఉంచనప్పుడూ.. భావావేశం కోసం, రిలాక్సేషన్ కోసం నేను వేటూరిగారి పాటలు వింటుంటాను.
— శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు
———-
Ads
మేం నవలలో వ్రాసే ఏభై పేజీల మేటర్ని పేజీ మించని పాటలో తక్కువ మాటలలో వ్రాయడం వేటూరి కళ, వేటూరి స్టైల్, వేటూరి మేధస్సు, వేటూరి సమర్థత.
— శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు
———-
తమిళపాటకు కణ్ణదాసన్ ఎలాగో.. తెలుగు పాటకు వేటూరి అలాగ
— శ్రీ ఎమ్మెస్ విశ్వనాథన్ గారు, శ్రీ భారతీరాజా గారు
———-
నేను దక్షిణభారతదేశంలో ఇద్దరు సినీ మహాకవులను చూశాను. ఒకరు కణ్ణదాసన్, రెండవవారు వేటూరి సుందరరామమూర్తి.
— శ్రీ రాజన్ గారు(రాజన్ – నాగేంద్ర)
———-
పదునైననది వారి శైలి – భావమధురసాల గ్రోలి
రసికవరుల మనసు తేలి – రంజిల్లును తూగి, తూలి
ప్రతిమాటా చవుల ఊట – ప్రతి తలపూ విరుల తోట
తీయని వేటూరి పాట – హాయినొసగు సుధల తేట
లయబద్ధము వారి నడక – భయరహితులు వారు కనుక
నయసురచన శంకగొనక – పయనించును వారి వెనుక
— శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు
———-
నా పాటకు ఏదైనా గౌరవం లభించిందంటే అది సుందరయ్య పాళీకే దక్కుతుంది. నాకు వేటూరిలో ఒక శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య, త్యాగరాజు, జయదేవుడు కనిపిస్తారు.
— శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు
———-
పదేపది నిమిషాల్లో.. పదేపదే పాడుకుంటూ, పది కాలాల పాటూ పదిలంగా నిలిచిపోయే పాటను ఆయన వ్రాయగలరు. గిరజాల జుట్టు లేకపోయినా ఆయనే మన భావకవి, ఎర్రచొక్కా వేసుకోకపోయినా ఆయనే మన విప్లవ కవి, సుగంధాలు పూసుకోకపోయినా ఆయనే మన సరస శృంగార కవి. సినీకవనాన గౌరీశంకర శిఖరంలా ఎదిగిపోయిన అక్షరమహర్షి మన వేటూరి.
— “ఈ ఉషాకిరణాలు తిమిరసంహరణాలు” అంటూ తన సంస్థకు వేటూరితో మకుట గీతాన్ని వ్రాయించుకున్నశ్రీ రామోజీరావు గారు
———-
అందరినీ అలరించడానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న శాఖ పేరు టూరిజమ్.
అందరినీ అలరించడానికి సినిమాల్లోఉన్న శాఖ పేరు వేటూరిజమ్.
— శ్రీ జంధ్యాల గారు
———-
నేను సినిమాల్లో ఇన్ని పాటలు ఇన్ని వైవిధ్యమైన భావాలతో పాడానంటే.. అక్కడ నా గొంతు నటించింది తప్పితే, నేనేనాడూ ఏ అనుభూతికీ లోనుకాలేదు. కానీ నా జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రం పాడుతూ ఒకవిధమైన అనుభూతికి లోనయ్యాను. అదే.. ప్రతిఘటన సినిమాలోని “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో” పాట. ఎవరు రాయగలరు అటువంటి పాట.. ఒక్క వేటూరి తప్ప!
— శ్రీమతి ఎస్.జానకి గారు
———-
ప్రాచీన మహాగేయకారుల స్థాయిని అందుకోగల శక్తి వేటూరిలో తొణికిసలాడుతోంది. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో “తెలుగు వెలుగులు” శీర్షికలో కొందరు పెద్దలను గురించి వేటూరి వ్రాశారు. అప్పుడు ఆయన ప్రతిభను చూశాను. కథలో సన్నివేశాలను కల్పించడంలోనూ, కవితలో భాషను భావుకతతో పరుగులెత్తించడంలోనూ వేటూరి చాతుర్యం నాకు గొప్పగా తోచేది.
— శ్రీ తిరుమల రామచంద్ర గారు
———-
సినీలాకాశంలో ఇంద్రధనుష్పాణి వేటూరి
— శ్రీ ఎమ్వీయల్ గారు
———-
ఇప్పుడు ఉన్న రచయితలలో ఏదైనా క్లాసికల్ టచ్ ఉన్న పాటేదైనా వ్రాయాలంటే నాకు తెలిసినంత వరకూ, మిగతావాళ్ళుంటే ఉండవచ్చు. ఎవరైనా వేటూరిగారి తరువాతే.
— శ్రీ డి.వి. నరసరాజు గారు**
———-
చలనచిత్ర శతపత్రపద్మంలో సహస్రశీర్ష బ్రహ్మ వేటూరి. ఆయన కలం పేరు కచ్ఛపి. ఆయన సాక్షాత్తూ పుంభావ సరస్వతి.
— శ్రీ తనికెళ్ళ భరణి గారు**
———-
అతనన్నా అతని పాటన్నా నాకెంతో ఇష్టం. గానం కోరుకునే గీతం వేటూరి. గాయకుడు కోరుకునే కవి వేటూరి.
— శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు
———-
పింగళి నాగేంద్రరావు గారి తరువాత చక్కగా చిన్నచిన్న మాటలతో ఉన్నతమైన భావాలను వెలిబుచ్చే రచయిత వేటూరిగారు. ఆయనది ఒక ప్రవాహ వేగం.
— శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు
———-
ఆయన వ్రాసిన ప్రతిపాటా అందులోని ప్రతిమాట ఏ దర్శకుడినైనా ఉత్తేజపరుస్తుంది. ఏ దర్శకుడిలోనైనా ఆటోమేటిక్గా ఆ సాహిత్యంలోనే చిత్రీకరణకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మా తీసే ప్రతిభకన్నా ఆయన వ్రాసే ప్రతిభే ఎక్కువ.
— శ్రీ కె. విశ్వనాథ్ గారు
———-
ఆయన సమకాలీనుడవడం, ఆయనతో పరిచయం కలిగి ఉండటమే చాలా అదృష్టంగా భావిస్తాను.
— శ్రీ బాపు గారు
———-
సవ్యసాచి అనే మాటొకటుంది. అంటే కుడి ఎడమ బాణాలు బాగా వేస్తాడని. కానీ సుందరరామ్మూర్తి గారు కుడి ఎడమ ఐమూలగా అడ్డంగా ఇలా ఎలా కావలిస్తే అలా బాణాలు వెయ్యగల ఎక్స్ట్రార్డనరీ పెర్సన్.
— శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారు
———-
“పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే. మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికిపోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి… “గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!” అని చెప్పి వచ్చేశాను”
— శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
———-
వేటూరిగారికి నేను అభిమానిని కాను భక్తుణ్ణి!
–శ్రీ వెన్నెలకంటి గారు
———-
హి ఈజ్ నాట్ ఓన్లీ ఎ రైటర్. హి ఈజ్ రైటర్స్ రైటర్
— శ్రీ భువనచంద్ర గారు
———-
“బాణోచ్చిష్టం జగత్సర్వం” అన్నట్టు ఆయన ఎప్పుడో వాడేసిన పదాల్ని ఏరుకొని అక్కడక్కడా మిక్స్ చేసి పాటలు రాసేస్తున్నాం.
— శ్రీ చంద్రబోస్ గారు
———-
ఆయనొక మహాసముద్రం. అందులో చిన్న చేపల దగ్గరనుండి ముత్యాల దాకా అన్నీ దొరుకుతాయి.
— శ్రీ పుహళేంది గారు
———-
వేటూరిని తమిళరచయిత కణ్ణదాసన్ గారితో పోల్చవచ్చు. ఒకవిధంగా కణ్ణదాసన్ గారికన్నా కూడా ఎక్కువ ప్రయోగాలు చేశారు వేటూరి.
— శ్రీ వి.ఎ.కె.రంగారావు గారు
———-
తమిళంలో వైరముత్తుగారు దర్శకనిర్మాతలు అంగీకరించని తన ఉన్నతభావాలను పుస్తకరూపంలో రిలీజ్ చేసేవారు. కానీ వేటూరిగారు ఎంతో ఉన్నతమైన తన భావాల్ని దర్శకనిర్మాతలతో అంగీకరింపజేసి సినిమాపాటల్లో చూపించారు. నాకు తెలిసి తమిళ, మళయాళ, కన్నడ, తెలుగు భాషలలో ఆయనకు కంపేరిజన్ లేదు.
— శ్రీ విద్యాసాగర్ గారు (సంగీత దర్శకులు)
———-
ఎందరు లేరు మిత్రులు మరెందరు లేరట సాహితుల్ హితుల్
చందురువంటి చల్లనయు సాహితి సౌహితి గుత్తగొన్నవా
రెందరు అందరన్ దిగిచి ఈ కవి డెందము హత్తుకొన్న మా
సుందరరామమూర్తికి వసుంధరలో నుపమానమున్నదే!
— శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారు
———-
అయ్యా! వేటూరిగారూ.. ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్పిన తరువాత, ఇక మీగురించి నేనేమిటి చెప్పేది! అందుకే.. కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రం చెబుతూ మీకు నమస్కరించుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు సినీ కవిసార్వభౌమా! స్వస్తి!
Share this Article