Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా మొత్తం పాటలే… డెబ్బయ్… ఈరోజుకూ చెరిగిపోని రికార్డ్..!!

January 28, 2025 by M S R

.

ఒక సినిమాలో ఎక్కువలో ఎక్కువ ఎన్ని పాటలుండొచ్చు? ఓ పదిహేననుకోండి! కానీ, ఓ సినిమా మొత్తం పాత్రలు పాటలతోనే పరిచయమై.. ఏడు పదుల పాటలుంటే..? అదే ఇంద్రసభ! రమణ కొంటికర్ల స్టోరీ చదవండి….

సస్పెన్స్ థ్రిల్లర్సో, హారరో పాటల్లేని ఏవో కొన్ని సినిమాలు మినహాయిస్తే… భారతీయ భాషల్లోని సినిమాలు, అందులోనూ కమర్షియల్ మూవీస్ అన్నీ ఫక్తూ పాటలతోనూ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం పరిపాటి.

Ads

అయితే ఒక సినిమాలో మ్యాగ్జిమం ఎన్ని పాటలుండొచ్చు. ఎక్కువలో ఎక్కువ ఓ డజన్ పాటలుండొచ్చు. ఇటీవల కాలంలో ఒక అమర్ సింగ్ చమ్కేలా, ఓ లూటేరా వంటి సినిమాలతో పాటు… 90ల్లో, 2000 సంవత్సర ప్రారంభకాలంలో ఒక ఊపు ఊపిన సినిమాల్లోనూ పాటలు అరడజన్ నుంచి డజన్ లోపే వినిపిస్తాయి.

వాటిల్లో హమ్ ఆప్కే హై కౌన్, తాళ్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, మొహాబ్బతే, దిల్ తో పాగల్ హై వంటి హిట్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

కానీ, ఈ సినిమాలన్నింటికన్నా దశాబ్దాలకు ముందే విడుదలైన ఓ సినిమాలో 72 పాటలున్న సంగతి మీకెవరికైనా తెలుసా మరి.. ?

సినిమా పేరు ఇంద్రసభ. భారతీయ సినిమా సంగీత యుగానికే నాంది పలికిన మొట్టమొదటి సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా పేరిది. 1932లో విడుదలైన ఈ సినిమాలో ఏకంగా 72 పాటలున్నాయి. కొంతమంది 69 పాటలున్నట్టుగా కూడా చెబుతుంటారు.

అయితే, ఒక పాట ఆనందం, విషాదం, ఉత్సాహం ఇలా వివిధ భావోద్వేగాలతో పలుమార్లు ఉండటం కూడా పాటల సంఖ్య పెరిగేందుకు మరో కారణం. 1980లో అత్యధిక పాటలున్న చిత్రంగా ఈ సినిమా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించింది.

1931లో విడుదలై సంగీతం, నృత్యాలను భారతీయ సినిమా తెరపై ఆవిష్కరించిన ఘనతను సాధించిన మొట్టమొదటి టాకీ చిత్రం ఆలమ్ ఆరా సినిమా విడులైన ఏడాదికి ఈ ఇంద్రసభ రిలీజైంది.

మణిలాల్ జోషి ఈ ఇంద్రసభకు దర్శకత్వం వహించగా.. సుమారు మూడున్నర గంటల సమయం నిడివితో నిర్మించిన భారీచిత్రం ఇంద్రసభ. నాటి నాటక సంప్రదాయ శైలిలో ఈ ఇంద్రసభ సినిమా నిర్మాణం కనిపిస్తుంది. ఆఘాహాసన్, అమానత్ రాసిన ఓ ఉర్దూ నాటకం ఆధారంగా ఈ ఇంద్రసభ నిర్మించారు. పాత్రలను పరిచయం చేయడానికి కూడా సంగీతంతో పద్యాలతో నాటకాల్లో ఎలాంటి ఎంట్రీ అయితే కనిపిస్తుందో ఆ శైలిని ఈ సినిమా అనుసరించింది.

ది కేంబ్రిడ్జ్ గైడ్ టూ ఏసియన్ థియేటర్ అనే బుక్ లో రచయిత జేమ్స్ ఆర్ బ్రాండన్ ఈ సినిమా విశేషాలను పేర్కొన్నారు. 31 గజల్స్, బెనాసర్, గయా ఘరానాల తరహాలో 9 తుమ్రీలు, 15 పాటలు, నృత్యాల కోసం రచించే థిల్లానాలతో సినిమా అంతా పాటలమయమే. ప్రతీ ప్రధాన పాత్రకొక పాట ఉందనే విషయాన్ని కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ సినిమా గురించి పేర్కొంది.

నేటి సినిమాలతో ఓసారి పోల్చిచూస్తే!

అర డజన్ పాటలకంటే ఎక్కువ ఉన్న సినిమాలు ఓ పదింటిని లెక్కలోకి వేసుకున్నా… ఇంద్రసభ పాటల సంఖ్యతో పోటీ పడలేవు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం, రామ్ లక్ష్మణ్ సంగీతంలో 1994లో వచ్చి హమ్ ఆప్కే హై కౌన్ లో 14 పాటలుంటే.. సుభాష్ ఘాయ్, రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన తాళ్ లో 12 పాటలున్నాయి.

అలాగే ఆదిత్యాచోప్రా దర్శకత్వం వహించిన మొహాబ్బతేలో 9 పాటలుంటే.. 2011లే ఏ.ఆర్ రెహమాన్ సంగీతంలో రిలీజైన ఇంతియాజ్ అలీ సినిమా రాక్ స్టార్ లోనూ 14 పాటలు మాత్రమే ఉన్నాయి. దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో మొత్తం 7 పాటలున్నాయి. ఈ మొత్తం సినిమాలన్నీ కలిపినా.. వీటి పాటల సంఖ్య కేవలం 56 మాత్రమే. అంటే ఇంద్రసభలో మూడొంతులు మాత్రమే. అందుకే అత్యధిక పాటలున్న సినిమాగా ఇంద్రసభది ఇప్పటికీ, ఇంకెప్పటికీ చెరిగిపోని రికార్డ్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions