కొన్ని పబ్బులుంటయ్… చెడ్డీ, కట్ డ్రాయర్‌తో పోటీపడే షార్ట్ వేసుకుని… బ్రాకు ఎక్కువ, జాకెట్‌కు తక్కువ టాప్ వేసుకుని వెళ్లినా సరే వోకే… కానీ ఖచ్చితంగా బూట్లు ధరించి ఉండాలి… లేకపోతే బౌన్సర్లు లోనకు రానివ్వరు, పొరపాటున వచ్చినా బయటికి దాదాపుగా గెంటేస్తారు… అది డ్రెస్ కోడ్ అట, దిక్కుమాలిన సెల్ఫ్ రూల్స్…
సహజంగానే ప్రభుత్వం ఇలాంటివి పట్టించుకోదు కదా… పట్టించుకోవల్సిన అధికారులు ఆ పబ్బుల్లో మందు కొడుతూ గ్రూప్ డాన్స్ చేస్తుంటారు… అవునూ, ఇవి అసలు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి..? ఎవడు డ్రెస్ కోడ్ రూపొందించేది..? ఇంకొన్ని పబ్బులుంటయ్… జంటగా మాత్రమే రావాలి… వచ్చేది భార్యా, ప్రియురాలా, మరొకరా పబ్బు సెక్యూరిటీ వాళ్లకు అవసరం లేదు… ఇదొక నెత్తిమాసిన పెయిర్ కోడ్…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… పబ్బులు అంటే అదొక అథోలోకం, అదొక డిఫరెంట్ పిచ్చి కల్చర్… ఆ ఎటికసీలు వేరు… దానికి తగినట్టు ఉండేవాళ్లనే రానిస్తారు… వేరేవాళ్లు అక్కడ ఫిట్ కాలేరు కాబట్టి వోకే అనుకుందాం… కానీ సినిమా హాల్‌కు ఏమైంది..? ఓ మాల్‌కు ఏమైంది…? ఇదే ప్రశ్న బెంగుళూరులో ఉత్పన్నమైంది…
Ads
బెంగుళూరులోని జీటీమాల్… అందులో సినిమా చూడటానికి ఫకీరప్ప అనే రైతు తన కొడుకుతో కలిసి వెళ్లాడు… పద్ధతిగా ధోవతి, అంగీ, చెప్పులు ధరించాడు… తలపై తలపాగా కూడా ఉంది ఆహార్య సంస్కృతిబద్దంగా… కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్లను వాటీజ్ దిస్ నాన్సెన్స్ అనిపించిందట… నో ధోతీ ప్లీజ్, ప్యాంటు వేసుకుని రా, లేకపోతే నో ఎంట్రీ అన్నారు…
ఒరేయ్ బాబూ, ప్యాంట్లు వేసుకునే అలవాటు నాకు లేదు, నా పద్ధతి ఇది, నన్నెందుకు రానివ్వరు అంటాడు రైతు… వద్దంటారు వాళ్లు… ఇదంతా వీడియో తీసి ఆ కొడుకు సోషల్ మీడియాలో పెట్టాడు… ఆ వీడియో కాస్తా వైరలైంది… ప్రజాసంఘాలు వచ్చి బైఠాయించాయి… రచ్చ… ఇంకాస్త ఉద్రిక్తత పెరిగితే నష్టం తప్పదని భావించిన యాజమాన్యం రంగంలోకి దిగింది…
సెక్యూరిటీని మందలించింది, ఆ రైతుకు సారీ చెప్పింది, సన్మానించి, ఎత్తుకుని తీసుకెళ్లి మరీ కుర్చీలో కూర్చోబెట్టింది… మరి ముందెందుకు లేదు ఈ సోయి అంటారా..? ఇలాంటిది ఏదైనా జరిగితేనే కదా తెలిసొచ్చేది…
సందర్భానుగుణంగా ఓ ముచ్చట… ఆమధ్య కొన్నిరోజులు అమెరికాలో ఉండొచ్చాను కదా… అక్కడ మాల్స్, టూరిస్ట్ ప్లేసులు, క్లబ్స్, రెస్టారెంట్స్, మోటెల్స్, కేసినోలు… ఎక్కడికైనా సరే ఎవరు ఏ డ్రెస్సులో వస్తున్నారో ఎవడూ పట్టించుకోడు… ఎవరి అభిరుచి వాళ్లది… మరీ బరిబాతల తిరగరు గానీ మరీ కురచ దుస్తులు ధరించేవాళ్లు బోలెడు మంది… ఐనా ఒకరి డ్రెస్ కల్చర్‌ను అవమానించడం నీచమే… అవి ఇండియాలోనే ఎక్కువ… మరీ ఇండియన్ విలేజీ కల్చర్‌కు కూడా ఈ భంగపాట్లు, నగుబాట్లు మరీ దురదృష్టం..!!
చివరగా… డ్రెస్సింగు, లుక్కుకు బాగా ప్రయారిటీ ఇచ్చే బ్రిటన్ దేశానికి… జస్ట్, ఓ బుడ్డ గోచీ పెట్టుకుని గాంధీ చర్చలకు వెళ్లాడు… స్వాగతించి, మర్యాదలు చేసి చర్చించారు పలు విషయాలు అక్కడి సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులు… మరి హఠాత్తుగా మనవాళ్లకేం పుట్టింది..?!
.
Update :: సదరు మాల్ వారం మూసేయాలని ప్రభుత్వం శిక్ష విధించింది… I welcome it…
Share this Article