Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పువ్వై పుట్టి… పూజే చేసి… పోనీ… రాలిపోనీ!

December 25, 2020 by M S R

“జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే
గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం…”

ఇది రావణాసురుడు రాసి, పాడగా అనంతరకాలంలో లోకంలో అందరూ పాడుకుంటున్నారని ప్రచారంలో ఉంది. వేద, పురాణాలను, మంత్రం పుట్టుపూర్వోత్తరాలను శాస్త్రీయంగా అంచనా వేయగలిగినవారు మాత్రం ఇది రావణుడు రాసింది కాకపోవచ్చు అని అంటారు. రావణాసురుడు సంస్కృతంలో, రుద్రవీణ వాయించడంలో ఎంత పండితుడయినా శివతాండవం క్రెడిట్ రావణుడికి ఇవ్వడానికి ఏవో ఇబ్బందులున్నట్లున్నాయి. ఆ గొడవ ఇక్కడ అనవసరం. సంస్కృతంలో ఉన్న ఆ శివతాండం స్థాయిలో తెలుగులో సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవాన్ని రచించి, గానం చేసి లోకానికి ఇచ్చాడు. పుట్టపర్తి శివతాండవం పాడుతుండగా విన్నవారిది అదృష్టం. శివుడితాండవం కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది. శ్రీ వైష్ణవుడై అయి ఉండి పుట్టపర్తి శివతాండవం రాయడం విశేషం. ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం దేశమంతా మారుమోగింది. కడప ఆకాశవాణివారు ముదిమివయసులో ఆయన పాడగా రికార్డు చేశారు కానీ- అందులో యాభై ఏళ్లపాటు ఆయన శివతాండవానికి ప్రత్యక్షప్రసారానువాదంగా పాడిన పట్టు లేదు. డెబ్బయ్ ల వయసులో అంతకు మించి ఆశించకూడదు.

“ఏమానందము?
భూమీతలమున!
శివతాండవమట!
శివాలస్యంబట!”

అని పుట్టపర్తి పాడుతుంటే శివుడు ఒళ్లు మరిచి ఆడుతూనే ఉండేవాడట.

ఆ శివతాండవంలో ఒక చోట-

“రాలెడు ప్రతి సుమమేలా నవ్వును?
హైమవతీ కుసుమాలంకారములందున తానొకటవుదునటంచునో?”

అని చెట్టు కొమ్మల చివరలనుండి నేలకు రాలుతున్న పూలు రేకువిచ్చి పులకింతతో, పరవశంతో నవ్వుతున్నాయట. ఎందుకంటే- మరికాసేపట్లో తాము పార్వతి మెడలో హారంగా మారబోతున్నామని. పార్వతి ఒళ్లో కూర్చుని శివుడి తాండవాన్ని దగ్గరగా చూడబోతున్నామని. పువ్వై పుట్టి పార్వతి పూజే చేసి జన్మను ధన్యం చేసుకోబోతున్నామని. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినా కైలాసంలో సాయం సంధ్యలో శివుడు తాండవం చేయడాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం దక్కదు- అలాంటిది పార్వతీ దేవి పుష్పాలంకారాల్లోకి వెళ్లడం ద్వారా వి వి ఐ పి సీట్లో కూర్చుని చూసే అదృష్టం దక్కబోతోందని.

అయితే- నేల రాలిన పూలు పూజకు పనికిరావు అన్నది అనాదిగా మన నమ్మకం. కింద పడితే దుమ్ము ధూళితో మలినమవుతాయి అని తప్ప ఇందులో మరో ఉద్దేశం లేకపోవచ్చు. భగవంతుడికి సమర్పించేవి ఏవయినా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు.

“మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభిషేకాయతే;
కించిద్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః కిం నకరో త్యహో వనచరో భక్తావతంసాయతే”

శంకరాచార్యుల శివానందలహరిలో గొప్ప శ్లోకమిది. తిన్నడు చెప్పుకాలితో లింగాన్ని శుభ్రం చేస్తే, పుక్కిటినీళ్లతో లింగాన్ని కడిగితే, కొంచెం కొరికి రుచి చూసి ఎంగిలి మాంసం పెడితే- శివుడు వీటినే పరిషేచనగా, అభిషేకాలుగా, మహాప్రసాదాలుగా తీసుకున్నాడు. నిర్మలమయిన భక్తి ముఖ్యం. మనసు ముఖ్యం.

జగిత్యాల- కరీంనగర్ రోడ్లో పారిజాత పూలు కిందపడకుండా చుట్టూ చీరలు కట్టిన వార్తను ఈనాడు ప్రచురించింది. నిజానికి పారిజాతం అతి సుకుమారం. కిందపడితే కందిపోతుంది. పారిజాత సుమదళాల పరిమళమే పరిమళం. ఆ అతిసుకుమారమయిన పూలను అమ్మఒడి ఉయ్యాలలో ఊగే పసిపిల్లలుగా భావించి చీరలు కట్టి, పూలు కింద పడకుండా దేవుడికి సమర్పించాలన్న పవిత్ర భక్తిని మాత్రం అభినందించాల్సిందే.

  • పమిడికాల్వ మధుసూదన్

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions