.
విశాఖపట్టణం నుంచ వెలువడే లీడర్ పత్రికలో ఓ ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఏపీ పాలిటిక్స్ ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో రోజూ చదువుతూనే ఉన్నాం కానీ ఇది మరీ హాశ్చర్యకరమైన వార్త అనిపించింది…
ఓ పెద్ద మనిషి మరణించాడు… ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓ పెద్దాయన అమెరికా నుంచి వచ్చాడు… ఎలాగూ వచ్చారు కదా, ఓ గౌరవ డాక్టరేట్ ఇస్తాం, కాదనొద్దు, ప్లీజ్, ఏదో మా మర్యాదకు ఇస్తున్నాం, కాదంటే మామీదొట్టు సుమీ అని బతిమిలాడి, పట్టుబట్టి, ఆంధ్ర విశ్వవిద్యాలయం పెద్దలు ఆయనకు నిర్బంధంగా ఓ డాక్టరేట్ ఇచ్చేసి… ఇస్తినమ్మ వాయినం అని సంబరపడిపోయారట పాపం… ఏదో మొహమాటంతో ఆయన అంగీకరించినందుకు మహదానందపడి, ఈ కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా కూడా చేసేసి మరింత హానందపడిపోయారుట కూడా…
Ads
అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఎంత ఆనందపడిపోయారో… ఎందుకంటే, మరి ఇదంతా అస్మదీయగణం కదా… ఆ లీడర్ వార్త ఏం చెబుతున్నదంటే… ఇంకొన్ని వివరాల్లోకి పోదాం ఓసారి…
డాక్టర్ సగ్గుర్తి పూర్ణచంద్ర రావు… ఇప్పుడు గౌరవ డాక్టరేట్ మరింత గౌరవంగా స్వీకరించిన ఈయన ఎవరంటే..? మరణించేంత వరకూ గీతం యూనివర్శిటీ గౌరవ ఛాన్సలర్ గా వ్యవహరిం చిన కోనేరు రామకృష్ణారావుకు ఈ సగ్గుర్తి స్వయంగా అల్లుడుట… వీరు అమెరికాలో స్థిరపడ్డారుట… అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్నతస్థాయి ఉద్యోగంలో వున్నారుట…
సో వాట్… మన తెలుగువాళ్లలో బోలెడు మంది అమెరికాలో పెద్ద పెద్ద కొలువుల్లో ఉన్నారు… ఈ సగ్గుర్తి సద్విశేషం ఏమిటి అంటారా..? ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎలాగైనా నాశనం చేసి తన గీతం యూనివర్శిటీని అభివృద్ధి చేసుకోడానికి కంకణం కట్టినట్టు ప్రచారం జరిగే విశాఖ ఎంపీ శ్రీభరత్ కుటుంబానికి, యూనివర్శిటీకి సన్నిహితుడైన కోనేరు రామకృష్ణారావుకి ఈ సగ్గుర్తి అల్లుడు… తమ మామ కోనేరు ఆస్తిని గీతం యూనివర్శిటీకి విరాళం ఇచ్చిన దానశీలి… శ్రీభరత్‌కు తాత, ఈమధ్య మరణించిన మాజీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు కుటుంబాన్ని పరామర్శించడానికి సదరు సగ్గుర్తి పూర్ణ చంద్రరావు అమెరికా నుంచి వచ్చారట…

అంతే… వీసీ రాజశేఖర్‌కు శ్రీభరత్ మెప్పు పొందేందుకు అవసరమైన ముఖ్యఅతిథి దొరికేశాడు… అందుకే సగ్గుర్తికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న విషయాన్ని చివరి నిమిషం వరకూ వీసీ రాజశేఖర్ రహస్యంగా వుంచాడు… గతంలో ఎప్పుడూ ఏ వైస్-ఛాన్సలర్ కూడా ఈ విధంగా వ్యవహరించ లేదు… స్నాతకోత్సవం తేదీతో సహా ముఖ్యఅతిథిగా ఎవర్ని తీసుకురావాలన్న విషయమై రెండు నెలలు ముందుగానే ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చర్చించడం పరిపాటి… కానీ ఈసీ సమావేశాన్ని నిర్వహించకుండానే వీసీ రాజశేఖర్ సగ్గుర్తి పూర్ణచంద్రరావును ఎంపిక చేసేశారు…
గతంలో దలై లామా వంటి మహోన్నత శిఖరాలకు డాక్టరేట్లను ప్రదానం చేసిన వందేళ్ళ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట ఏ విధంగా దిగజారిపోయిందోనంటూ ఏయూ పూర్వ విద్యార్థులు విలపిస్తున్నారు… పైగా సదరు సగ్గుర్తి మాటల్లో భారతీయ బ్యాంకుల్ని చిన్న చూపు చూసి మాట్లాడడం అందరికీ చిరాకు కలిగించింది… మన స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లను కలిపినా బ్యాంక్ ఆఫ్ అమెరికా పదిరెట్లు పెద్దదని సగ్గుర్తి సెలవిచ్చారుట…
సో వాట్..? భారతీయ బ్యాంకుల్ని తేలికగా తీసిపారేసే వ్యాఖ్యలు చేయడానికా ఈ ముఖ్య అతిథి రాక, ఈ డాక్టరేట్ ప్రదానం..? కనీసం సందర్భశుద్ధ కూడా లేని సదరు సగ్గుర్తి విజ్ఞత ఏపాటి..? ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు… కానీ మన మందబుద్దులు దానికి ఫుల్ రివర్స్…
కాన్వొకేషన్ మరుసటి రోజు పూర్వ విద్యార్థుల సభ అద్భుతంగా జరిగేది. కానీ జి.ఎం.ఆర్ లాంటి దిగ్గజాలకు వీసీ రాజశేఖర్ పోకడలు నచ్చక దూరంగా వున్నట్టు తెలిసింది… అందుకే కాబోలు పూర్వ విద్యార్థుల సభ కూడా జరగకుండానే స్నాతకోత్సవ వేడుకలు ముగిసిపోయాయి… ఆశ్రిత పక్షపాతం అస్సలు పట్టని పాలన దురంధర్ చంద్రబాబుకు పాపం ఈ విషయాలు తెలిసి ఉండవు, లేకపోతే ఆగ్రహించినట్టు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వార్త వచ్చి ఉండేది..!!
Share this Article