Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!

October 9, 2026 by M S R

.

(  రమణ కొంటికర్ల  99126 99960 ) …. ఇండియాలో ఇంటర్నెట్ వార్! భారత్ లో స్టార్ లింక్ ను ఆలిగార్కులు అడ్డుకుంటున్నారన్న మస్క్ మాటలు… ఇప్పుడు భారతదేశంలో ఓ పెద్ద డిబేట్ గా మారాయి. సామాన్యులు, వీవీఐపీలు, పొల్టీషియన్స్ నుంచి.. కేంద్ర సమాచార సంస్థల వరకూ ఈ సోషల్ మీడియా ఫైట్ లో భాగస్వామమవ్వడంతో ఈ చర్చ ఇప్పుడు రచ్చ రేపుతోంది.

ఇంతకీ ఆలీగార్కులంటే ఎవరు..? ధనవంతులు, శక్తిమంతులు… దేశ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపేవారు. మరి ఎలన్ మస్క్ దృష్టిలో అలా తన స్టార్ లింకును అడ్డుకుంటున్నదెవరు..?

Ads

భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఆరంభించేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తోంది ఎలన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్. కానీ, అందుకు కారణాలేవైనా… భారత్ ఇంటర్నెట్ వ్యవస్థలోకి స్టార్ లింకుకు చోటు లభించడం లేదు. దీంతో ఈసారి టెక్నాలజీ కంటే కూడా వ్యాపార ప్రయోజనాలు, స్పెక్ట్రమ్ కేటాయింపులు, జాతీయ భద్రతా అంశాలే ప్రస్తుతం జరుగుతున్న చర్చలో ఫైట్ కు తెరతీశాయి. కొత్త ప్లేయర్లను రాకుండా ఖచ్చితంగా లోకల్ ప్లేయర్లు అడ్డుకుంటారు, వ్యాపారంలో ఇవి సహజమే…

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. భారత్ లో స్టార్ లింక్ ప్రవేశాన్ని కొందరు ఆలిగార్కులు అడ్డుకుంటున్నారని మొదట ఆరోపించారు. వారి గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు తన సంస్థను అడ్డుకుంటున్నారన్నది ఆయన వాదన. అయితే మస్క్ ఎవ్వరినీ పేర్లతో సంబోధించకపోయినా… భారత టెలికాం రంగంలో ప్రధానంగా గుత్తాధిపత్యమంతా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాదేనన్నది జగమెరిగిన సత్యం. అయితే మరికాస్సేపటికే మస్క్ ఏకంగా ముఖేష్ అంబానీ పేరును కూడా ప్రస్తావిస్తూ.. is ambani real boss of india అని ప్రశ్నిస్తూ.. తన X ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

musk

దురదృష్టవశాత్తూ భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ కొందరు ఆలిగార్కులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వారెవరో మీరూహించొచ్చు. ఇది భారత ప్రజానీకంపై వారు నేరానికి పాల్పడుతున్నట్టేనంటూ కూడా మస్క్ పోస్ట్ చేశారు.

ఈ వివాదం ముదిరి పెరిగి పెద్దదైంది. దీనిపై రాహూల్ గాంధీతో సహా పలువురు స్పందించారు. కేటీఆర్ ఐతే… ఎలాన్ ఎవరా ఆలిగార్క్స్… పేర్లతో సహా బట్టబయల్జేయండంటూ తన X ఖాతాలో రిప్లై ఇచ్చారు. ఇలా మొత్తం పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సామాన్యులు, టెకీస్ అంతా స్పందించేసరికి ఇది సోషల్ మీడియాలో ఓ పెద్ద ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

మరోవైపు, ఎలన్ మస్క్ X పోస్టుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఖంగుతింది. అలర్టైంది. దేశంలో నిష్పాక్షికమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు… వివక్ష లేని నియంత్రణ వ్యవస్థ పనిచేస్తోందని సమాధానమిచ్చింది.

అసలు కథ ఎక్కడ మొదలైంది..? స్టార్ లింక్ 2021లోనే భారత్ లో తన వ్యాపారాన్ని ఆరంభించేందుకు లైసెన్స్ కు అప్లై చేసుకుంది. కొంతకాలం సేవల కోసం ప్రకటనలు, ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఇక్కడే కేంద్రం స్టార్ లింకును అడ్డుకుంది. అవసరమైన లైసెన్స్ లేకుండానే ముందస్తు బుకింగ్స్ ప్రారంభిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్టార్ లింక్ ప్రక్రియ.. ముందుకు వెళ్లకుండా నిల్చిపోయింది.

2022లో మళ్లీ ఈ సంస్థ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉండగా.. ఎట్టకేలకు, 2025 జూన్ లో స్టార్ లింకుకు భారత్ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు అవసరమైన లైసెన్స్ మంజూరైంది. అయితే, లైసెన్స్ వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిడం కుదరదు. భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి కీలక దశలు ఇంకా మిగిలున్నాయి.

మరి భారత్ లో స్టార్ లింకుకు పోటీ ఎవరు..? భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ రంగాన్ని ఇప్పటికే పలువురు కీలక పారిశ్రామికవేత్తలు శాసిస్తున్నారు. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతీ గ్రూప్ మద్దతున్న యూటెల్ సాట్ వన్ వెబ్ ఇలాంటివాటితో… ఇప్పుడు స్టార్ లింక్ కూడా పోటీ పడబోతోంది. సో, ఈ రంగంలో ఇప్పటికే కీలక ఆటగాళ్లు ఆట మొదలుపెట్టడమే కాదు.. క్రీజులో శాసిస్తున్నారు. అంతేకాదు, ఇదే సమయంలో అమెజాన్ కు చెందిన అమెజాన్ లియో కూడా భారత శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రావడానికి యత్నిస్తోంది.

రాబోయే రోజుల్లో భారత్ లో భూమిపై ఏర్పాటు చేసిన మోబైల్ టవర్స్ ఆధారిత ఇంటర్నెట్స్ తో పాటు… వీటికి పోటీగా నేరుగా ఆకాశం నుంచే అందే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ఒక ప్రత్యేక మార్కెట్ తయారుకానుంది.

మరి జియోతో మస్క్ కు విభేదాలేంటి..? శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్ కేటాయింపులపై… జియోకు, శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీలకు మధ్య విభేదాలున్నాయి. జియో అభిప్రాయం ప్రకారం భూమిపై టెలికాం కంపెనీలు వినియోగించే ఎయిర్ వేవ్స్ తో పోటీపడే శాటిలైట్ సేవలకు కూడా స్పెక్ట్రమ్ విషయంలో అవే నిబంధనలు వర్తించాలనే కండిషన్ ను జియో తెరపైకి తెచ్చింది. శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రమ్ ను… వేలం ద్వారా కేటాయించాలనే వాదనను జియో గతంలో వినిపించింది.

కానీ, శాటిలైట్ సేవల స్పెక్ట్రమ్ ను పరిపాలనా అనుమతులను నేరుగా ఇవ్వాలనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థలకు స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీగా అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో ఐదు శాతం వసూలు చేసే ప్రతిపాదనకు కూడా టెలికాం శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం ఇంకా లభించాల్సి ఉంది.

ఇలాంటి సమయంలో మరి మస్క్ ఎందుకు మండిపడుతున్నాడు..? ఈరోజు జరిగిన మోబైల్ కాంగ్రెస్ లో స్టార్ లింక్ ఉన్నతాధికారైన లారెన్ డ్రేయర్ మాట్లాడారు. భారత్ కోసం తమ సంస్థ ప్రత్యేక భద్రతా వ్యవస్థలను రూపొందించిందనీ వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నామని.. భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలను రూపొందించామనీ ఆమె తెలిపారు. ఇందుకోసం, భారత్ లో ఇప్పటికే 20 గేట్ వే సైట్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

ఇదే సమయంలో స్టార్ లింక్ సేవల ఆరంభానికి ఇంకా అనుమతులు రావకపోవడంపై సోషల్ మీడియాలో చర్చకొచ్చింది. ఇదే అదనుగా సోషల్ మీడియా వేదికగా మస్క్ ఘాటుగా స్పందించాడు. భారత్ లో స్టార్ లింక్ ప్రవేశాన్ని కొందరు అడ్డుకుంటున్నారంటూ.. పరోక్షంగా ముఖేష్ అంబానీ, మిట్టల్ వంటివారిపై ఎక్కుపెట్టిన మస్క్.. ఆ తర్వాత ముఖేష్ అంబానీని నేరుగా టార్గెట్ చేశారు.

స్పందించిన కేంద్రం! మస్క్ వ్యాఖ్యలపై వెంటనే కేంద్ర కమ్యూనకేషన్ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్ లో అన్ని టెలికాం సంస్థల సేవలకు, శాటిలైట్ కమ్యూనికేషన్ కు నిష్పాక్షికమైన, వివక్ష లేని అనుమతి వ్యవస్థ అమలవుతోందని పేర్కొంది. లైసెన్స్ పొందిన ప్రతీ సంస్థా భద్రతా నిబంధనలనకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం స్టార్ లింక్, జియో శాటిలైట్, వన్ వెబ్.. ఈ మూడు సంస్థల భద్రతా మదింపు ప్రక్రియ కొనసాగుతోందని… ఈ సంస్థల సేవలు ఆరంభించే విషయంలో దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయనీ ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల ఎవరికో అనుకూలంగానో, ప్రతికూలంగానో వ్యవహిస్తున్నట్టు నిరూపించే ఆదారాల్లేవనీ స్పష్టం చేస్తోంది.

అసలు సమస్య మస్క్ వర్సెస్ ముఖేష్ అంబానీనా..? మస్క్ అయితే అదే ఆరోపిస్తున్నాడు. ముమ్మాటికీ అంబానీని టార్గెట్ చేశాడు. గుత్తాధిపత్యాన్ని గట్టిగా లేవనెత్తాడు.

అయితే భారత్ కు శాటిలైట్ ఇంటర్నెట్ వల్ల ఒక పెద్ద ప్రయోజనం చేకూరనుంది. నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకొస్తాయి. కొండలు, మారుమూల పల్లెలు, దీవుల్లోనూ.. కేబుల్స్, మోబైల్ టవర్స్ ఏర్పాటు చేయడం సమస్యగా మారిన ప్రాంతాల్లోనూ శాటిలైట్ ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్ సేవలను అందిచొచ్చు. అదే వాదనను స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ చేస్తున్నాడు.

అయితే, ఇదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో రెండుగా విడిపోయి చర్చిస్తున్నవారు కనిపిస్తున్నారు. డేటా భద్రత, విదేశీ శాటిలైట్ వ్యవస్థలపై భారత నియంత్రణ వంటి పలు సున్నితమైన ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టింది. భారత్ డేటా ఎక్కడికి వెళ్తుంది.. శాటిలైట్ నెట్వర్క్ పై భారతదేశానికి ఎంత నియంత్రణ ఉంటుంది… అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యవస్థను ఎలా పర్యవేక్షించవచ్చు.. ఇలాంటి ప్రశ్నలతో ఇప్పుడు భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆలోచనలు సాగుతున్నాయి.

భవిష్యత్తులో భారత్ లో ఇంటర్నెట్ ఎలా ఉండొచ్చు..? ఇప్పటివరకూ మనం ఇంటర్నెట్ వ్యవస్థ.. మోబైల్ టవర్స్, ఫైబర్ కేబుల్స్, బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ చుట్టూ తిరిగింది. శాటిలైట్ ఇంటర్నెట్ విస్తరిస్తే మరో కొత్త ప్రక్రియను మనం చూడబోతున్నాం.

భూమిపై మోబైల్ టవర్స్.. భూమిలోపల ఆప్టికల్ ఫైబర్… ఆకాశంలో శాటిలైట్స్… ఇలా మూడు కలిసి పనిచేసే రోజులు దగ్గర్లోనే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇండియా ఇంటర్నెట్ వార్ లో ఎలన్ మస్క్ కు అనుమతించకపోవడం కంటే కూడా.. భవిష్యత్తులో శాటిలైట్ ఇంటర్నెట్ నియంత్రణపైనే భారత ప్రభుత్వ ఆందోళన కనిపిస్తోంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!
  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!
  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?
  • SIR – ఈ ఆందోళనల అసలు లక్ష్యం దేశంలో అశాంతి – కల్లోలం !!
  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions