.
ముందుగా ఒక వార్త చదవండి… నాలుగు దశాబ్దాల క్రితం భార్య హత్య… 82 ఏళ్ల వయసులో నిందితుడి అరెస్టు… దాదాపు 40 ఏళ్ల క్రితం భార్యను హత్య చేసి పరారైన ఓ వ్యక్తి, 82 ఏళ్ల వయసులో ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. అతడి ఫొటోలు, ఆధార్ కార్డు లాంటి ఆధారాలేవీ లేకపోయినా, ఢిల్లీ పోలీసులు మానవ మేధస్సును ఉపయోగించి ఈ కేసును ఛేదించడం విశేషం.
బీహార్… నలందాకు చెందిన చంద్రశేఖర్ ప్రసాద్ తూర్పు ఢిల్లీలో నివసించేవాడు… 1986లో తనకు 42 ఏళ్ల వయసున్నప్పుడు, ఏదో ఘర్షణ పెరిగి, క్షణికావేశంతో భార్యను ఇటుకరాయితో తలపై మోది హత్య చేశాడు… భార్యకు ఏదో వివాహేతర సంబంధం ఉందన్నది అనుమానం… దాంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు…
Ads
ఇదీ నేరం… హత్య అనంతరం పోలీసులు, కేసులు, శిక్షలకు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు… దీనిపై కేసు నమోదైంది… అప్పటి
నుంచి తన ఆచూకీ దొరక్కుండా ఉండేందుకు ఆయన ప్రయాసలు మొదలయ్యాయి… భయంతో పలు రాష్ట్రాలకు తన మకాం మార్చాడు… పేర్లు మార్చుకున్నాడు… రిక్షా కార్మికుడిగా కొన్నాళ్లు పనిచేశాడు… మరి కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా…
తరువాత మరోచోట ఓ ఆశ్రమంలో తలదాచుకున్నాడు… 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కేసుపై ఇటీవల పోలీసులు మళ్లీ దృష్టి సారించారు… నిందితుడి పిల్లలు ఢిల్లీ, బిహార్ లలో నివసిస్తున్నట్లు గుర్తించారు… కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లపై నిఘా ఉంచారు… ప్రసాద్ జీవించే ఉన్నాడని, తరచూ పండుగలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసేవాడని గుర్తించారు…
నిందితుడి కదలికలపై నిఘా ఉంచి, ఈనెల 2న అతణ్ని ఉత్తర ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీ స్టోర్ రూమ్‌లో అదుపులోకి తీసుకున్నారు…….. ఇదండీ వార్త…
ఇప్పుడు తన వయస్సు 82 ఏళ్లు… చట్టం చేతులు చాలా పొడుగు… ఎప్పటికైనా నేరగాడు తప్పించుకోలేడనీ చెప్పుకోవడానికి తప్ప ఈ కేసు దేనికీ పనికిరాదు… ఆ కేసులో అంత నిఘా కూడా అవసరం లేదు… నలభై ఏళ్లుగా వాడు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు… అజ్ఞాతవాసంలో భయంతో, దాక్కుని దాక్కుని, ఎక్కడెక్కడో బతుకుతూ జైలు శిక్షకన్నా ఎక్కువే అనుభవించాడు… ఏమో, కేసులో యావజ్జీవం పడినా రెమిషన్లతో ఆల్రెడీ బయటికి కూడా వచ్చేసేవాడేమో…
జైలు శిక్ష అనేది నేరగాడిలో మార్పు కోసమే కదా… ఈ వయస్సులో వాడిని శిక్షించినా, జైలులో వేసినా… ప్రజల సొమ్ముతో మేపడం తప్ప తనలో మార్పూ రాదు, మారినా సమాజానికి వచ్చేదేమీ లేదు… వెరసి, ఈ కేసులో పోలీసులు మేమేదో సాధించామనే ఘనతకూ అర్థం లేదు… “న్యాయం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం” (Justice delayed is justice denied) అనే కోణం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది… ఆమె మరణించి 40 ఏళ్లు గడిచిపోయింది…
చట్టం పరిభాషలో… భిన్నంగా, వ్యతిరేకంగా ఉన్నా సరే… ఈ విశ్లేషణ ఓ రియాలిటీ… ఎన్నిరకాల పడికట్టు పదజాలంతో సమర్థించుకున్నా సరే… మన పోలీసులు సాధనసంపత్తిని ఈ పనికిరాని ముసలి కేసులకు బదులు… ఈ కేస్ డిస్పోజల్ ప్రయాసలకు బదులు… మనల్ని కమ్మేస్తున్న సైబర్ క్రైమ్స్, ఉగ్రవాదం నియంత్రణ, నివారణకు ఉపయోగిస్తే ఎంతో మేలు..!!
అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే..? తన కుటుంబసభ్యులు కూడా తనను క్షమించేశారు..!! అరెస్టు సరే, కానీ ఇక కోర్టు ఏమంటుందో చూడాలి..!!
Share this Article