యుద్ధం ముదురుతోంది… ఇది మూడో ప్రపంచ యుద్ధం అని వెంటనే తేల్చేయలేం గానీ… కోరుకోలేం గానీ… సంకేతాలన్నీ మరింత ప్రమాదాల్నే సూచిస్తున్నాయి…
ఆల్రెడీ ఉక్రెయిన్- రష్యా యుద్ధం నడుస్తూనే ఉంది, అదొక రావణ కాష్టం… మరోవైపు లెబనాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ హెజ్‌బుల్లా వెన్ను విరిచిన ఇజ్రాయిల్ మరింతగా పట్టు సాధించేందుకు లెబనాన్ మీదకు ఆర్మీని నడిపిస్తోంది… హెజ్‌బుల్లా చీఫ్‌ను హతమార్చిన ఇజ్రాయిల్ కొత్తగా నియమితుడైన చీఫ్‌ను కూడా ఏడు గంటల్లో మట్టుపెట్టింది…
మరో ఉగ్రవాద సంస్థ హమాస్ పొలిటికల్ చీఫ్, సీనియర్ కమాండర్లను కూడా ఖతం చేసింది… దీంతో ఇరాన్ రంగంలోకి దిగింది… వందల బాలిస్టిక్ మిసైల్స్‌ను ఇజ్రాయిల్ మీదకు ప్రయోగించింది… ప్రాణనష్టం వార్తలూ వస్తున్నాయి… ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా వెంటనే ఇరాన్ మిసైల్స్ కూల్చివేతకు తన డిఫెన్స్ వింగ్‌ను ఆదేశించింది…
Ads
వెరసి లెబనాన్, ఇరాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, అమెరికా ఇప్పటికి యుద్ధరంగంలో ఉన్నాయి… ఇది ఇంకా ఏయే ప్రాంతాలకు విస్తరిస్తుందో చెప్పలేం… ఇజ్రాయిల్ అంత తేలికగా వెనక్కి తగ్గే బాపతు కూడా కాదు… ఆల్రెడీ తన గగన తలాన్ని క్లోజ్ చేసింది… ఉన్నత స్థాయి సమీక్షకు దిగింది… తదుపరి చర్యలేమిటో చూడాల్సి ఉంది…
ఇప్పటికిప్పుడు అయిదారు దేశాల్లో కనిపిస్తున్నాయి, కానీ పరిస్థితి విషమిస్తే అమెరికా మిత్రదేశాలు గనుక రంగంలోకి దిగితే మరింతగా ఉద్రిక్తతలు పెరిగి, మరిన్ని దేశాలకూ వ్యాపించే అవకాశాలైతే ఉన్నాయి… ఒకవేళ ఇజ్రాయిల్ గనుక అణుదాడికి దిగితే..? అదీ ఇప్పుడు ఆందోళనకరం… ఏమో, తనకు ఎప్పుడైనా ప్రమాదమేననే భావనతో ఇరాన్ అణుకేంద్రాల మీద దాడులకు పూనుకోవచ్చునని ఓ అంచనా వినిపిస్తోంది మీడియాలో…
ఇప్పటికే తన దేశ సరిహద్దుల్లోని ప్రజల్ని ‘సురక్షిత ఏర్పాట్ల’లోకి చేరాలని ఇజ్రాయిల్ హైఅలర్ట్ ప్రకటించింది… సైరన్లు మోగించింది… అంటే ఇరాన్ నుంచి తీవ్రమైన దాడినే సందేహిస్తోందన్నమాట… ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదనీ హెచ్చరించింది… ఇరాన్ క్షిపణుల్ని ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఎదుర్కుంటోంది…
ఇరాన్ తమ అధినేత ఆయతుల్లా ఖొమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించింది… అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధానికీ సన్నద్ధమైపోయింది… ఇజ్రాయిల్ రాజధానిలో కాల్పులు… ప్రాణనష్టం… ఆ సాయుధులెవరనేది తేలాల్సి ఉంది… ఇది రాత్రి 12 గంటల వరకూ ఉన్న సమాచారం… తెల్లారేసరికి ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నాయో వేచి చూడాల్సి ఉంది…
Share this Article