ఆర్ ఆర్ ఆర్ అనేది ఒక fictitious movie. “చరిత్రలో నిజంగా వున్న ఫలానా రెండు కారెక్టర్లు కలుసుకుంటే” అనే కల్పనలోంచి పుట్టిన కథ అది. ఆ విషయాన్ని రాజమౌళి పదే పదే అనేకసార్లు అనేక వేదికల మీద చెప్పాడు. అయినా సరే, చరిత్ర గురించి కేవలం సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకునే భావితరాలకి (లేదా ప్రస్తుత తరాలకి) ఈ సినిమా రాంగ్ మెసేజ్ పంపే ప్రమాదం వుందనేది ఓ ఆందోళన. కరెక్టే, అది వుంది. “ఇది ఫిక్షన్ బాబోయ్” అని మేకర్స్ మొత్తుకున్న సినిమాలతోనే యింత ప్రమాదం వుంటే.. “ఇది 100% హిస్టరీ” అని బల్లగుద్ది చెప్పిన సైరా నరసింహారెడ్డి, రుద్రమదేవి, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర సినిమాల సంగతేంటి? అది యింకా ప్రమాదం కాదా? ఆయా సినిమాల ద్వారా మనం తెలుసుకున్న historical facts కి వున్న ప్రామాణికత ఎంత?
“ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఆ సినిమాలన్నింటి గురించీ మాట్లాడాల్సిందే” అని నేను అనడం లేదు, ఆ వక్రభాష్యం అవసరం లేదు… . “నేనూ అదే అన్నాను భయ్యా, నోరిప్పాలంటే ముందు అరడజను సినిమాలు చూడాలంట..”, “అవునక్కా, ఇప్పుడు నాలుగు రోజులు సెలవు పెట్టి ఆ సినిమాలన్నీ ఏడ చూసేది. అందుకే దీని గురించి కూడా మాట్లాడట్లేదక్కా..” అనకండి దయచేసి… పైన ప్రస్తావించబడిన సినిమాలన్నీ కానీ, లేదా అందులో కనీసం వొకదాని గురించి కానీ గతంలో పాజిటివ్ గా మాట్లాడి వున్నవాళ్ల గురించి మాత్రమే ఈ పాయింట్ చెపుతున్నా నేను… ఇదిగో ఫలానా వీరుడి చరిత్రని సినిమాగా తీస్తున్నాం అని తొడగొట్టిన వాళ్ల విషయంలో లేని అభ్యంతరాలు… మాది ఫిక్షను బాబోయ్ అని లబలబలాడే వాళ్ల విషయంలో ఎందుకు అనేదే నా డౌటు…
చరిత్ర గురించి సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకునే వాడికి అసలు ఎంత చరిత్ర తెలుసుద్ది? అలా పోగేసుకున్న చారిత్రిక జ్ఞానం వల్ల ఆయా వ్యక్తులకీ, వాళ్లవల్ల సమాజానికీ జరిగే లాభం, నష్టం ఎంత? అసలు చరిత్రలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఆ మాటకొస్తే వర్తమానంలో ఏం జరుగుతుందో మాత్రం మనకి తెలుసా?
Ads
అమరావతి విషయంలో భావితరాలు చరిత్ర పాఠాల్లో చదువుకోవాల్సింది ఏంటి? “రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మరియు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా జగన్ అనే నియంత అధికార వికేంద్రీకరణ అనే పేరుతో ఆడిన నాటకం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిక్కులేని వాళ్లయ్యారు”… ఇది చరిత్ర అవుతుందా? “ఒక కులానికీ, లేదా ఒక పార్టీకీ డబ్బులు దోచిపెట్టడం కోసం చంద్రబాబు అనే నియంత ఆడిన నాటకాన్ని కనిపెట్టి, సమాజపు వనరులు సమాజం అంతటికీ చెందాలీ అనే సంకల్పంతో చివరికి న్యాయాస్థాలని కూడా లెక్కచేయకుండా మొండికెళ్లిన జగన్ అనే ధీశాలి తెలుగునాట దేవుడిగా అవతరించాడు”… ఇది చరిత్ర అవుతుందా? రెండూ కాదు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ రాయించింది చరిత్రగా చలామణీ అవుద్ది. మళ్లీ ఐదేళ్లకి ఆ చరిత్ర బూటకంగా మారి, కొత్త చరిత్ర వెలుగులోకి వస్తుంది.
– – సినిమాలు కాకుండా పుస్తకాల ద్వారా చరిత్ర తెలుసుకున్నామని అనుకునే మా తరానికి తెలిసింది కూడా నిజం చరిత్ర కాదు. “మద్రాసు నగరం కూడా తెలుగువాళ్లకి కావాల్సిందే” అని మొండిపట్టు పట్టడం వల్లే పొట్టి శ్రీరాములు గారు చనిపోవాల్సి వచ్చిందంటారు. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరేమీ లేదు. ఈ విషయం ఏ చరిత్ర పుస్తకం లోనూ లేదు.
— సైమన్ కమీషన్ వచ్చినప్పుడు టంగుటూరి ప్రకాశం గారు గుండీలు “తెంచేసి దమ్ముంటే నన్ను కాల్చండిరా” అని అన్లేదు. లేనిపోని కథ పుట్టించారని ఆయనే స్వయంగా ఆత్మకథలో రాసుకున్నారు. కానీ, చరిత్ర పుస్తకాల్లో నిజం ఏంటో రాయబడలేదు.
— శివాజీ హిందూ మతాన్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకోలేదు. ముస్లిం రాజులతో కలిసి ఆయన హిందూ రాజుల డొక్క పగలగొట్టిన సందర్భాల గురించి చరిత్ర పుస్తకాలు సరైన అవగాహన కల్పించలేదు.
— సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం గురించిన పుస్తకాల్లో బోలెడు మేటరుంటుంది. కానీ, ఆయన జర్మనీ వెళ్లి అక్కడే వొక జర్మన్ మహిళని పెళ్లి చేసుకొని, కొన్నాళ్లయ్యాక “ఛీ దీనెమ్మా జీవితం, ఈ హిట్లర్ గాడిని నమ్ముకొని అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకున్నాను. ఈ ఎదవలకి నేనంటే రెస్పెక్ట్ లేదు” అని పశ్చాత్తాపపడి, అక్కణ్నించీ బయటపడిన విషయం చరిత్ర పుస్తకాల్లో చదివిన గుర్తు లేదు.
— శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాలనే ఎనిమిది మంది కవులు వుండేవారు అనేది కూడా కట్టు కథే. అసలు ఆ ఎనిమిది మందీ ఒకేకాలంలో, ఒకే రాజు దగ్గర వున్నవాళ్లు కాదు. అసలు తెనాలి రామలింగడు అనేవాడు వున్నాడా లేడా. ఉంటేగింటే ఆయన రాసినట్టు చెప్పబడుతున్నదంతా ఆయన సృజించిన సాహిత్యమేనా అన్నది యీనాటికీ తెలియదు.
— జునాగఢ్‌లో హిందువులు ఎక్కువమంది వున్నారు కాబట్టీ, వాళ్లు ఇండియాలో కలవాలనుకుంటున్నారు కాబట్టీ అక్కడ వున్న ముస్లిం రాజుని బెత్తంతో నాలుగు పీకి, ఆ సంస్థానాన్ని మన దేశంలో కలిపిన నాయకులు.. మరి కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి అక్కడి ప్రజల మనోభావాలని కాకుండా.. అక్కడ వున్న హిందూ రాజు అభిప్రాయాన్ని మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారో నాకు ఏ చరిత్ర పుస్తకంలోనూ కనిపించలేదు.
చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి వున్నవాడు రకరకాల సోర్సుల్లో వెతికి, రకరకాల వెర్షన్లు విని, తన దృక్పథం భావజాలం ఆధారంగా యిదీ నిజం అని ఒక అభిప్రాయానికి వస్తాడు. అది కూడా అభిప్రాయమే. ఏదీ నిజమైన చరిత్ర కాదు. యుగాలుగా తొక్కేయబడిన కొన్ని వర్గాలకీ, జాతులకీ బ్రిటీష్ వాళ్లు దేవుళ్లుగా కనబడ్డారు. శాస్త్రీయ పరిశోధనలకీ, సాంకేతిక అభివృద్ధికీ దూరమైపోయిన దేశానికి ఆంగ్లేయుల రాక నాగరికత నేర్పిందని భావించిన వారున్నారు.
సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర పోరాటమా? లేక జారిపోతున్న అధికారాన్ని అంటిపెట్టుకోడానికి కొందరు నీరసంగా, బలహీనంగా సాగించిన బేరసారాలకి మరో రూపమా? దత్తత తీసుకున్న కొడుకుని సింహాసనం మీద కూచోబెట్టడానికి తెల్లవాళ్లు సరే అని వుంటే చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి స్థానం ఏంటి? ఇలా చరిత్ర గురించి మనకి వందరకాల భిన్నాభిప్రాయాలు వున్నాయి.
మార్క్సిస్టు కోణంలో రాయబడిన చరిత్ర, జాతీయవాదుల చరిత్ర, దళితులు రాసిన చరిత్ర, దళిత చైతన్యాన్ని జీర్ణించుకోలేనివారు రాసిన చరిత్ర.. కొత్తగా వాట్సప్ సృష్టించే చరిత్ర… ఇన్ని చరిత్రల మధ్యలో ఒక ఫిక్షన్ సినిమా కథ చరిత్రగా మిగిలిపోతుందేమోనన్న భయాలు మీకుంటే.. మంచిదే. అలాగే కానిద్దాం.
నేనేదో ఈ సినిమాని భుజానేసుకున్నానని అనుకోవొద్దు. నేనింకా అసలు ఈ సినిమా చూడనేలేదు. మా అబ్బాయి చూశాడు. “విడివిడిగా చూస్తే ముక్కలుముక్కలుగా బావుంది నాన్నా. కానీ ఆ ముక్కల్ని కలిపే త్రెడ్ మాత్రం వీక్ గా వుంది. నిజం చెప్పాలంటే కాస్త డిజపాయింట్ అయ్యాను” అన్నాడు. నాకూ అలాగే అనిపించే అవకాశం వుంది. వాడికి నచ్చినంతగా కూడా నాకు నచ్చకపోవచ్చు.
ఈ సినిమా బాగోలేదని కొందరు రాశారు. బాగోదని నమ్ముతున్న కారణంగా చూడాలనే ఆలోచన లేదు అని కొందరు రాశారు. సంతోషం. వాళ్ల స్టాండు ఎప్పుడూ అలానే వుంటుంది. సినిమా అనే మాధ్యమం సమాజంలో సామరస్య ధోరణులని పెంచి తీరాలనే సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లు కాబట్టీ.. వాళ్లకి ఆ సినిమా నచ్చకపోవచ్చు. కానీ, చారిత్రక సినిమాల పేరుతో గతంలో వచ్చిన కార్టూన్ పిల్ముల కన్నా ఆర్ ఆర్ ఆర్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని భావించేవాళ్లతో మాత్రం నాకు భిన్నాభిప్రాయం…
Share this Article