తెలుగు ప్రేక్షకులు ఉత్త అజ్ఞానులు అనేది తమిళ నిర్మాతలు, దర్శకుల బలమైన అభిప్రాయం… వాళ్ల సినిమాల్ని మనమీద రుద్దే విధానం అలాగే ఉంటుంది… ఇష్టారాజ్యంగా డబ్ చేసేసి వదుల్తుంటారు… ప్రత్యేకించి కమర్షియల్ సినిమాల్లోని ఆ పాటలు, ఆ మాటలు, ఆ సీన్లు ఓ అరాచకం… (ఉదాహరణ… అపరిచితుడు సినిమాలో కొండాకాకీ కొండేదానా, గుండిగలాంటి గుండేదానా, అయ్యారేట్టు పళ్లదానా, మట్టగిడస కళ్లదానా… కాళిదాసు దగ్గర్నుంచి లక్షల మంది రచయితలు ఆడదాన్ని కోటి రకాలుగా వర్ణించారు గానీ… ఇలా అండలు, గుండిగెలు, బానలతో వర్ణన నభూతో… సగం జుట్టు ఊడిపోయింది గానీ ఈ వాక్యాల్లోని సదరు రచయిత కవిహృదయం ఇప్పటికీ బోధపడలేదు… మణిరత్నం, శంకర్ వంటి మహామహుల సినిమాల్లోనూ అంతే… ట్యూన్లలో తెలుగు పదాల్లాగా వినిపించేవి కొన్ని ఇరికిస్తుంటారు, అంతే…) ఆఫ్టరాల్, తెలుగు ప్రేక్షకుడే కదా అనుకుంటారు వాళ్లు…
ఇంత ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందీ అంటే… ఒకానొక కాలంలో, 2014లో మద్రాస్ అనబడే ఓ సినిమా తీయబడింది… పా రంజిత్ దర్శకుడు, కార్తి హీరో, కేథరిన్ హీరోయిన్… ఆ సినిమా కథ జోలికి ఇప్పుడొద్దులే గానీ, సినిమా మాత్రం సూపర్ హిట్… 15 కోట్లతో సినిమా తీస్తే 45 కోట్లు వసూలు చేసింది… అప్పటికి ఓటీటీలు, ఇంతగా టీవీ ప్రసారహక్కుల డబ్బుల్లేవు కాబట్టి థియేటర్ల లెక్కలే ఇవి… నిజానికి ఇంత డబ్బు వచ్చిందంటే చాలు, వెంటనే సదరు నిర్మాత నుంచి రీమేక్ హక్కులు కొనేస్తారు మనవాళ్లు ఎవరైనా… లేదంటే ఆ తమిళ నిర్మాతే కుడిచేత్తో తెలుగు, ఎడమచేత్తో మలయాళంలోకి డబ్బింగ్ చేసేసి, తనే రిలీజ్ చేసుకుంటాడు… విచిత్రంగా ఇదేమీ జరగలేదు…
ఏడేళ్ల తరువాత అరెరె, ఈ సినిమాను మనం తెలుగులో రిలీజ్ చేయలేదు కదా అని డౌటొచ్చినట్టుంది వాళ్లకే… ఇప్పటికైనా పోయిందేముందిలే… ఎలాగూ రంజిత్, కార్తి ఇప్పుడు పాపులరే… బాగానే ఉంది… నాలుగు రోజుల్లో డబ్ చేసేశారు… జస్ట్, డైలాగులు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులతో పలికించడం, నోటికొచ్చిన తెలుగు పదాల్ని ఆ తమిళ ట్యూన్లలో ఇరికించి రికార్డ్ చేయడం… అంతేకదా… కానీ అదే మద్రాస్ పేరుతో లేదా చెన్నై పేరుతో రిలీజ్ చేయొచ్చుకదా… పోనీ, హైదరాబాద్ అని పెట్టొచ్చు కదా… నో, చేయలేదు… ఏమనిపించిందో మరి… నాపేరుశివ-2 అని పేరు పెట్టి వదులుతున్నారు… ఇదేమిటి..?
Ads
ఎందుకంటే..? ఇదే కార్తి 2010లో నటించిన Naan Mahaan Alla అని మరో సినిమా… కాజల్ హీరోయిన్… అదీ సక్సెసైందే… దాన్ని వెంఠనే తెలుగులోకి ‘నాపేరుశివ’ పేరుతో వదిలారు… తెలుగులోనూ కాస్త ఆడినట్టే అనిపించింది… ఇప్పుడు ఆ మద్రాస్ సినిమాకే నాపేరుశివ-2 అని పేరుపెట్టి వదులుతున్నారు… ఆ పాత హిట్ సినిమా పేరును వాడుకోవడం ప్లస్ ఇది ఆ సినిమాకు సీక్వెల్ అని జనం కళ్లకు గంతలు కట్టడం… నేములోనేముందిలే, చూసేద్దాం, ఓ పనైపోతుంది అంటారా..? నిజమే, కానీ ఈ అరవోళ్ల ఈ పైత్యం దేనికి..? స్ట్రెయిట్‌గా ఇంకేదో పేరు పెట్టేసి రైట్ రాయల్‌గా రిలీజ్ చేయొచ్చుగా… అదే, అదే… తెలుగు ప్రేక్షకులు అజ్ఞానులు అనే తేలికభావం… కొసమెరుపు :: ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది
Share this Article