ఒక చిన్న డిస్‌క్లెయిమర్ :: ఈ కథనంలో చెప్పబోయే ఏ సీరియలైనా సరే… ఓ రీతి, రివాజు ఉండదు… తలాతోకా లేని కథనం, లాజిక్కుల్లేని కథ, దిక్కుమాలిన దర్శకత్వం, తలకుమాసిన కేరక్టరైజేషన్స్, ప్రేక్షకులు ఎడ్డోళ్లు అనే క్రియేటివ్ పొగరు, ప్రత్యేకించి తెలుగు ఆడవాళ్లకు బుర్రల్లేవనే పైత్యం… ఇత్యాది అవలక్షణాలతో కునారిల్లుతున్న సీరియల్సే… ఒక్కటీ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకంగా మగ వేషాలన్నీ ఆలోచనల్లో, అడుగుల్లో హిజ్రా తరహా… ఇంకా చెప్పుకుంటే పోతే దిమాక్ ఖరాబ్…
కానీ కోట్ల టీవీ యాడ్స్ డబ్బు రూపంలో, ప్రేక్షకులు వెచ్చించే వందల గంటల టైం రూపంలో, చెడిపోతున్న బుర్రల రూపంలో… సొసైటీకి బహుముఖంగా నష్టదాయకం కాబట్టి వీటి రేటింగులు గట్రా మాట్లాడుకోవాలి… ఇవి రకరకాల వేరియంట్స్ తప్ప బేసిక్‌గా ఒకే వైరస్… విషయానికి వస్తే కొన్నేళ్లుగా కార్తీకదీపం అనే ఓ దిక్కుమాలిన చెత్తా సీరియల్ తెలుగు టీవీ సీరియళ్ల రేటింగ్స్‌ను దున్నేస్తోంది… అసలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా కుళ్లుకునే రేంజ్ టీఆర్పీలు వస్తుండేవి ఆ సీరియల్‌కు… సరే, దాన్ని ప్రసారం చేసే మాటీవీ ‘‘రేటింగుల తెలివి, సామర్థ్యం’’ కావచ్చు, నిజంగానే సీరియల్ జనానికి నచ్చింది కావచ్చు… ఆ సీరియల్ సూపర్, బంపర్ హిట్… అది అఖండ, పుష్ప టైప్ విజయం…
Ads
కానీ ఇప్పుడు భారీగా తేడా కొడుతోంది… కార్తీకదీపం కొడిగడుతోంది… ప్రభ మసకబారుతోంది… ఆ కథ, కథనం తీరు చూసి జనం పకపకా నవ్వుతున్నారు ఇప్పుడు… దర్శకుడి మనోస్థితి మీద జాలిపడుతున్నారు… నిజానికి మనసంతా ప్రేమను, మంచితనాన్ని, పాజిటివిటీని నింపుకున్న ఓ ఛాయనలుపు మహిళ కేరక్టర్ మొదట్లో ప్రేక్షకులను బలంగా ఆకర్షించింది… టీవీ అత్త అంటేనే తాటకి టైపు కదా, కానీ ఇందులో అత్త తనే అమ్మగా సపోర్ట్‌గా నిలబడుతుంది…
శూర్పణఖ వంటి మరో లేడీ విలన్ (ఈ పాత్రధారి శోభాశెట్టి ఈమధ్య దీప పాత్రధారి ప్రేమీ విశ్వనాథ్‌ను డామినేట్ చేస్తోంది… సూపర్బ్ నటన…), ఆకట్టుకునే పిల్లలు, ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో బతికే హీరోయిన్ పాత్ర చాన్నాళ్లు ప్రేక్షకుల ఆదరణను పొందాయి… కానీ ఇప్పుడు కథను ఇంకా ఇంకా సాగదీసే కక్కుర్తిలో పడి, కథను భ్రష్టుపట్టించారు… కథనాన్ని పాతేశారు… ఇప్పుడు తాజా రేటింగ్స్ చూస్తే అర్థమవుతోంది… కార్తీకదీపం వెలుగు ఎలా తగ్గిపోయిందో…
స్థూలంగా చూస్తే ఈరోజుకూ ఈ సీరియలే టాప్… కానీ ఒకప్పుడు ఈ సీరియల్ రేటింగులకు పది ఆమడల దూరంలో ఉండేవి మిగతా సీరియళ్లు… కానీ ఇప్పుడు కార్తీకదీపం సీరియల్‌కూ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌కూ పెద్ద తేడా లేదు… (ఆ గృహలక్ష్మి కథ, కథనం మరో దరిద్రం)… దానికి దగ్గర్లోనే గుప్పెడంత మనసు… ఒక రోజయితే మరీ దేవత అనే మరో దిక్కుమాలిన సీరియల్‌కన్నా కార్తీకదీపం రేటింగుల్లో దిగువకు పడిపోయింది… సో, క్లియర్… కార్తీక్ అనబడే నపుంసక కేరక్టర్ ఇక ప్రేక్షకులకు పట్టదు… దీప కన్నీళ్లు బుల్లితెరను తడపలేవు…
అంటే మిగతా సీరియళ్లు బాగున్నాయని కాదు… ఇన్నాళ్లు తాము అభిమానించిన కార్తీకదీపం ఇలా మకిలిబట్టిపోవడాన్ని సగటు తెలుగు టీవీ ప్రేక్షకుడు, అందులో మహిళా ప్రేక్షకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారని అర్థం… ఆ రేటింగుల లిస్టు చెబుతున్నది కూడా అదే… జీతెలుగు సీరియళ్లు మరో ఇంట్రస్టింగ్… (జెమిని, ఈటీవీ సీరియళ్లను ప్రేక్షకులు ఎవరూ పెద్దగా చూడరు కాబట్టి వాటి గురించి చెప్పుకోవడం కూడా ఇక్కడ స్పేస్ దండుగ)…
ఒకప్పుడు సతీ త్రినయని, ప్రేమ ఎంత మధురం సీరియళ్లు టాప్‌లో ఉండేవి… మంత్రాలు, భూతాలు, సోదెమ్మ, పునర్జన్మ వంటి పైత్యాల మాటెలా ఉన్నా ఈ రెండు సీరియళ్లు జీటీవీ ప్రేక్షకులకు నచ్చేవి… కానీ క్రమేపీ కథల్ని, కథనాల్ని భ్రష్టుపట్టించేసి, సోది చెప్పడం స్టార్ట్ చేశారు దర్శకులు… మరీ పాత్రల కేరక్టరైజేషన్ అయితే దరిద్రం… దీంతో ప్రేక్షకులు ఫోఫోవోయ్, నీ మొహం సీరియల్ అని పట్టించుకోవడం మానేశారు… ఫలితంగా రేటింగుల జాబితాలో కొట్టుకుపోతున్నయ్ అవి… ఈ రెండూ ఇంకా దిగజారిపోతాయని ‘ముచ్చట’ చాన్నాళ్లుగా చెబుతున్నదే…
రాధమ్మకూతురు, ముత్యమంత ముద్దు, నంబర్ వన్ కోడలు… ఇవన్నీ త్రినయనిని దాటిపోయాయి… త్రినయని సీరియల్ ప్రధానలోపం హీరోను మరీ ఎడ్డిగాడిదలా చూపించడమే… ప్రేమ ఎంత మధురం హీరో కూడా దాదాపు అంతే… చివరకు జనం మొదట్లో తిరస్కరించిన కృష్ణ తులసి సీరియల్ కూడా త్రినయని, ప్రేమఎంతమధురం సీరియళ్లను దాటేస్తోంది కొన్నిసార్లు… నిజానికి టీవీ ప్రేక్షకులంటే ఉత్త ఎదవలనీ, ఏం చూపించినా చూస్తారనీ, వారికి వేరే దిక్కులేదనీ తప్పుడు అంచనాల్లో ఉన్న నిర్మాతలు, దర్శకులకు కర్రుకాల్చి వాతలు పెట్టాలంటే… కార్తీకదీపం, త్రినయని, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్ల రేటింగ్స్ ఇంకా పడిపోవాలి… పాపం శమించుగాక…!!
Share this Article