ప్రముఖులు ఏం పుస్తకం చదువుతున్నారు..? ఇది అందరికీ ఆసక్తికరమైందే… ప్రత్యేకించి పుస్తక ప్రియులకు..! వ్యక్తులు చదివే పుస్తకాలను బట్టి వాళ్ల తత్వాలను, అభిరుచులను, ఆలోచన ధోరణులను అంచనా వేయడం కూడా చాలామందికి అలవాటు… కాకపోతే 80 వేల నుంచి లక్ష పుస్తకాల్ని అలవోకగా ఊదిపారేసే కేసీయార్, పవన్ కల్యాణ్ వంటి నాయకులను ఈగాటన కట్టలేం… వాళ్ల రికార్డు ప్రపంచంలో ఎవరికీ చేతకాదు, అసాధ్యం, అందుకే వాళ్లను అంచనా వేయడం హరిహరాదులకూ అసాధ్యం…
కేసీయార్ టేబుల్ మీద తాజాగా రెండు పుస్తకాలు కనిపిస్తున్నట్టు దిశ అనే వెబ్ పత్రికలో ఓ వార్త కనిపించింది… అవి 1) ది 21 ఇర్రెపుటబుల్ లాస్ ఆఫ్ లీడర్ షిప్ 2) ఇకిగాయ్ (ఆనందమయమైన చిరాయుష్షుకు జపనీయుల రహస్యం)… టేబుల్ మీద కనిపించినంత మాత్రాన వాటిని చదువుతున్నట్టు భావించాలా..? ఎవరో తెచ్చి ఇచ్చిన పుస్తకాలు అక్కడ కనిపించవచ్చు కదా..? అనే ప్రశ్నలను పక్కన పెడితే, వాటిని కేసీయార్ గబగబా చదివి జీర్ణం చేసుకునే పనిలోనే ఉన్నాడనే భావిస్తే…
ఇందులో రెండో పుస్తకం పేరు ఇకిగాయ్… దీని మీద కేసీయార్‌కు ఆసక్తి కలగడానికి కారణం ఏమిటి..? ప్రస్తుత స్థితిలో కేసీయార్ ఏం కోరుకుంటున్నాడు..? ఎందుకంటే..? తన వర్తమానం తనకు అత్యంత చేదుగా ఉంది… ఎక్కడో ఓ చిన్న ఊరి నుంచి మొదలైన జీవితం… అంచెలంచెలుగా పెరిగి, తెలంగాణ సాధకుడిగా పేరు తెచ్చుకుని, పదేళ్లు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం వరకూ… మామూలు అచీవ్‌మెంట్ కాదు… సగటు రాజకీయనాయకుడు కలలు గనే కీర్తి అది… తృప్తి అది… కానీ..?
Ads
చేజేతులా తన మంచి పేరును తనే తుడిచేసుకున్నాడు… ఓ కొత్త నిజాం నవాబు తరహా వ్యవహార ధోరణితో గగనాన విహరించిన తను జర్రున జారి పాతాళంలో పడ్డాడు… అరయగ కర్ణుడీల్గె అన్నట్టుగా మళ్లీ మళ్లీ ఆ కారణాల మథనం ఇక్కడ అవసరం లేదు… ఎడాపెడా బయటపడుతున్న కుంభకోణాలు, పాలన వైఫల్యాలు, రజాకార్లు-జమీందార్లలా మారి ఊళ్లపై పడి దోచుకున్న తన నాయకగణం, క్రూడ్ పాలిటిక్స్, జైలుకు చేరిన బిడ్డ, పార్టీని వదిలేసి వెళ్తున్న అనుచరగణం… పిచ్చి వ్యూహాలతో కేంద్రాన్ని ఢీకొట్టి, బెదిరించబోయి కొమ్ములు విరుచుకున్న తెంపరితనం… ఇదొక చేదు దశ…
ఇప్పుడు తన దృష్టి ఇకిగాయ్ అర్థం చేసుకోవడం మీద పడిందా…? ఇకిగాయ్ అంటే… నిజానికి ఈ పదానికి సరిగ్గా బాష్యం చెప్పడం ఎవరివల్లా కాలేదు… నిజానికి మనిషి ఆనందంగా జీవించడానికి ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉంటుంది, ఏదో ఓ ఉత్ప్రేరకం మనిషిని ఆనంద జీవితంవైపు నడిపిస్తూ ఉంటుంది… తనను అలా నడిపించే కారణమేమిటో కనుక్కోవాలి, నడవాలి, జపనీయుల చిరాయుష్షు రహస్యం అదేనంటారు ప్రపంచ అధ్యయనకారులు… దృఢమైన ఇకిగాయ్‌తో ప్రతిరోజూ సార్థకంగా, రసవత్తరంగా సాగుతుంది…
అధికశాతం జపనీయులు ఎప్పుడూ రిటైర్ కారు… పని, పని, పని… వాళ్లకు అదే ఆనందం… జపాన్‌లోని ఓ ఊళ్లో వందేళ్ల ఆయుష్షు దాటిన వృద్ధుల సంఖ్య అత్యధికం… ఈ ఇకిగాయ్ పుస్తక రచయితలు ఆ గ్రామవాసుల్ని ఇంటర్వ్యూ చేసి, వారి చిరాయుష్షు వెనుక దాగిన ఆనంద రహస్యాల్ని కనుక్కొని, అక్షరబద్ధం చేయడానికి ప్రయత్నించారు… అంతర్జాతీయంగా చాలా భాషల్లోకి అనువదింపబడి, బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన పుస్తకం ఇది…
కేసీయార్‌కు రాజకీయాల్లోనే ఆనందం ఉంది… ఎత్తుగడలు, విజయాలు, ప్రత్యర్థుల అణిచివేత, డబ్బు, పెత్తనం, ఆధిపత్యం, రాచరికం… తనను చిరాయుష్షుడిగా ఉంచేవి, ఉంచాల్సినవీ అవే… ఈ ఇకిగాయ్‌ను తను కొత్తగా కనుక్కునే పనేమీ లేదు, తనకేం కావాలో, తన బలమేమిటో, తన ఆనంద హేతువులేమిటో తనకు బాగా తెలుసు… సో, ఈ చీకటి దశ నుంచి మళ్లీ ‘ఆనందమయమైన జీవనసరళి’కి ఇంకా తనేం చేయాలో తెలుసుకునే అదనపు సమాచారం కోసమేనా ఈ అన్వేషణ..?
ఇన్నేళ్లుగా తనకు భజన మీడియా, భజన మేధావులు, భజన రచయితలు, భజన నాయకగణం తగిలించిన కృత్రిమ భుజకీర్తులు తననే పకపకా నవ్వుతూ వెక్కిరిస్తున్న చేదు వర్తమానం తనది… వెలుగు వైపు, ఆత్మశోధన వైపు తనకు ఈ ఇకిగాయ్ ఓ దారి చూపిస్తుందనే విశ్వసిద్దాం…! ఎస్, ఇప్పుడు ఈ పుస్తకం అవసరం కేసీయార్‌కు ఎంతైనా ఉంది…!!
Share this Article