Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు

November 27, 2026 by Rishi

.

తెలంగాణలో భారత క్రీడా సంబురం … 24 ఏండ్ల తర్వాత ఆటల పండుగ … 7 వేల మందికిపైగా క్రీడాకారులు… 20 పోటీ వేదికలు… తెలంగాణలో సరికొత్త క్రీడా అధ్యాయం

దేశంలోని యువ క్రీడా ప్రతిభకు తెలంగాణ ప్రధాన వేదికగా నిలుస్తోంది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 7 వేల మందికిపైగా యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 27 క్రీడాంశాల్లో పోటీలతో పాటు మరో రెండు క్రీడల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు తెలంగాణలో జాతీయ క్రీడల సందడి నెలకొననుంది.

Ads

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి జరుగుతున్న ఈ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో మొత్తం 20 వేదికలను సిద్ధం చేస్తోంది. పన్నెండు రోజుల పాటు ఆయా నగరాల్లో క్రీడా సందడి నెలకొననుంది.

khelo india

హైదరాబాద్‌కు ఘనమైన క్రీడా చరిత్ర …  హైదరాబాద్‌కు ఘనమైన క్రీడా చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో హైదరాబాద్‌ కేంద్రంగా 32వ జాతీయ క్రీడలు జరిగాయి. అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం గచ్చిబౌలి స్టేడియంలో ఈ క్రీడలను ప్రారంభించారు. జాతీయ క్రీడల సందర్భంగా నగరంలో ఎన్నో క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరుసటి ఏడాది ఆసియా, ఆఫ్రికా దేశాల క్రీడాకారులతో తొలి ఆఫ్రో–ఆసియా క్రీడలను నిర్వహించారు. దీంతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ క్రీడల నిర్వహణలోనూ గుర్తింపు లభించింది.

బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, షూటింగ్‌ క్రీడల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గగన్‌ నారంగ్‌ ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులకు హైదరాబాద్‌ శిక్షణ కేంద్రమైంది. ఈ ఏడాది మార్చిలో ఎనిమిది దేశాలు పాల్గొన్న మహిళల హాకీ ప్రపంచకప్‌ అర్హత పోటీలను ఇక్కడే నిర్వహించారు. 2002 జాతీయ క్రీడల తర్వాత 24 ఏళ్లకు ఖేలో ఇండియా రూపంలో మరో భారీ జాతీయ క్రీడోత్సవానికి తెలంగాణ వేదికవుతోంది.

.

ఏటేటా పెరుగుతున్న ఆదరణ … దేశంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను ప్రారంభించింది. ఢిల్లీలో జరిగిన తొలి విడత పోటీల్లో 3,507 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరుసటి ఏడాది ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ పేరుతో పుణెలో పోటీలు నిర్వహించారు. అప్పటికే క్రీడాకారుల సంఖ్య 5,925కు చేరింది. ఆ తర్వాత గువాహటి, హర్యానా, మధ్యప్రదేశ్‌, తమిళనాడులో ఈ క్రీడలు జరిగాయి. గతేడాది బిహార్‌లో ఏడో విడత పోటీలు నిర్వహించారు. ఈసారి ఆ అవకాశం తెలంగాణకు దక్కింది.

ఖేలో ఇండియా పోటీల్లో ఎప్పటికప్పుడు కొత్త క్రీడలను చేరుస్తున్నారు. తెలంగాణలో జరిగే పోటీల్లో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌కు అవకాశం దక్కింది. ఆతిథ్య రాష్ట్రం తనకు నచ్చిన ఒక క్రీడను ఎంచుకునే అవకాశం ఉంది. తెలంగాణ రోయింగ్‌ను ఎంచుకుంది. హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్‌ పోటీలు నిర్వహించనున్నారు. సెయిలింగ్‌తో పాటు తెలంగాణ పల్లెల్లో ప్రాచుర్యంలో ఉన్న కర్రసామును ప్రదర్శన క్రీడగా చేర్చడం ఈసారి విశేషం.

రాష్ట్రమంతటా ఆటల పోటీలు … ఖేలో ఇండియా హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా సందడి చేయనుంది. గ్రేటర్​ సిటీతో పాటు వివిధ జిల్లాల్లో 15 వేదికల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఐదు క్రీడలను జిల్లాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్స్‌, ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో విలువిద్య పోటీలు జరగనున్నాయి. కరీంనగర్‌ అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో జూడో, మహబూబ్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కబడ్డీ, నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌లో టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు నిర్వహిస్తారు.

అత్యధికంగా స్విమ్మింగ్‌లో 38, అథ్లెటిక్స్‌లో 32, రెజ్లింగ్‌లో 21, బాక్సింగ్‌లో 20 ఈవెంట్లు ఉన్నాయి. హాకీ, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, షూటింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలతో పాటు మల్లఖంబ్‌, గత్కా, కలరిపయట్టు, థాంగ్‌–టా, యోగాసన వంటి సంప్రదాయ క్రీడలను నిర్వహించనున్నారు. జాతీయ స్థాయి పోటీలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం జిల్లాల్లోని విద్యార్థులకు, క్రీడాభిమానులకు దక్కనుంది.

telangana

స్టేడియాలకు కొత్త హంగులు … ఖేలో ఇండియా నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించింది. కేంద్రం రూ.21 కోట్లు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.120 కోట్లను స్టేడియాల అభివృద్ధికి, ఆధునిక క్రీడా సామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్‌ కోర్టులను ఆధునికీకరించారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కొత్తగా చెక్క ఫ్లోరింగ్‌ వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌కు మరమ్మతులు చేపట్టారు. హుస్సేన్‌సాగర్‌లో జల క్రీడల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నారు. జిల్లాల్లోని స్టేడియాల్లోనూ వసతులు మెరుగుపరుస్తున్నారు.  తాత్కాలిక ఏర్పాట్ల కంటే శాశ్వత సదుపాయాల కల్పనకే ప్రభుత్వం ఎక్కువ నిధులు వెచ్చిస్తోంది.

messi

పదేండ్ల ముందే సన్నద్ధత … 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఖేలో ఇండియాలో పోటీపడే 14 నుంచి 18 ఏళ్ల వయసున్న క్రీడాకారులు అప్పటికి 24 నుంచి 28 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. అనేక క్రీడల్లో రాణించేందుకు అనువైన వయసు అది. ఇప్పుడే ప్రతిభావంతులను గుర్తించి, మెరుగైన శిక్షణ అందిస్తే పదేళ్ల తర్వాత వారిలో కొందరు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగవచ్చు. ఈ ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం ‘ఛాంపియన్స్‌ ఫర్‌ 2036’ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

పల్లెల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో క్రీడా అకాడమీల సంఖ్యను ఏడింటి నుంచి 20కి పెంచింది. మొత్తం 33 జిల్లాల్లో ఖేలో ఇండియా కేంద్రాలున్నాయి. విదేశీ క్రీడా సంస్థల సహకారంతో రాష్ట్రంలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రయత్నిస్తోంది. గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో యంగ్‌ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో గచ్చిబౌలి క్రీడా ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడలకూ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అదే లక్ష్యానికి అందివచ్చిన అవకాశంగా ఖేలో ఇండియా పోటీలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు
  • కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!
  • దేవుడా- ఓ మంచి దేవుడా… మాకెందుకయ్యా ఈ ఇండిగోను ఇచ్చావ్
  • మూడుసార్లు దెయ్యాన్ని చూశా! నరక ద్వారాలూ కనిపించాయి !!
  • పెద్ద నంబర్ గేమ్ మళ్లీ ! ఈసారి సినిమాలో చాలా ట్విస్టులు!!
  • అసలు అదొక పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రం
  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!
  • ఇక ఇండియాపై చైనా- పాక్ జాయింట్ ఉపగ్రహ నిఘా!!
  • Miss & Mrs Universe… ఏడేళ్ల కూతురికి తల్లి… ఈసారి విశ్వసుందరి!
  • 26/11 ముంబై ఉగ్రవాద దాడి… ఇది మరో కుట్రకోణం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions