.
నిన్న సినిమాలకు సంబంధించిన సోషల్ మీడియా, మీడియా, యూట్యూబ్ చానెళ్లు ఓ విషయాన్ని ప్రధాన వార్తగా ప్రసారం చేసి పండుగ చేసుకున్నాయి, మురిసిపోయాయి… వైరల్ చేసుకున్నాయి… మనవాళ్లు ఇంకా ఇంకా వ్యక్తిపూజలో ఎలా ఆరితేరారో ఇదంతా స్పష్టం చేస్తోంది… ఆ వార్తలు, ఆ ఫోటోలు, ఆ కథనాల సారాంశం ఏమిటో తెలుసా…
శీర్షిక: అప్పుడే బడిబాట పట్టిన ‘మెగా’ వారసురాలు.. వైరల్ అవుతున్న చరణ్-ఉపాసన వీడియో! కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా! మొన్ననే మెగా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని సంబరాలు చేసుకున్నట్లుంది, అప్పుడే ఆ చిన్నారి స్కూల్ గేటు దాటే వయసుకు వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల తనయ క్లిన్ కారా తాజాగా స్కూల్లో అడ్మిషన్ తీసుకుంది.
Ads
రెండేళ్ల పాటు కెమెరా కళ్లకు చిక్కకుండా దాచిపెట్టి, ఈ జూన్‌లోనే పాపను పరిచయం చేసిన ఈ జంట.. ఇప్పుడు ఏకంగా బడిలో చేర్పించే పనిలో పడ్డారు. గత దసరాకే అక్షరాభ్యాసం కానిచ్చేయగా, తాజాగా కార్తీక పౌర్ణమి మంచి రోజు అని చూసి స్కూల్లో జాయిన్ చేయించారు. అయితే క్లాసులు మాత్రం వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే షురూ కానున్నాయి.

స్కూల్ ఆవరణలో చరణ్ తన కూతురిని ఎత్తుకుని నడుస్తుంటే, పాప చిరునవ్వులతో ఉపాసన వైపు అడుగులు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కవలలు కూడా తోడవడంతో మెగా ఫ్యామిలీలో సందడి మామూలుగా లేదు. వీడియో చూసిన అభిమానులు మాత్రం “అప్పుడే క్లిన్ కారా స్కూల్‌కు వెళ్లిపోతుందా?” అని ఆశ్చర్యపోతున్నారు…
ఓ పోస్టు కింద ఓ నెటిజన్ పరుషంగా ఇలా రాశాడు… ‘‘పాప కారు దిగింది, పాప టాయిలెట్ పోసింది, పాపకి వేరే డైపర్ వేశారు, ఈ వార్తలు ఎవడికి ఉపయోగంరా బేవార్స్… ఇది అందరు తల్లిదండ్రులు చేసేదే కదా… ఇదొక వార్తా..? ప్రపంచంలో ఎవరికీ పిల్లలు పుట్టలేదా..? ఎవరూ స్కూళ్లలో జాయిన్ చేయలేదా…?’’
Share this Article