Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక అభిజిత్ దీప్కే – ఒక సౌరవ్ దాస్ – ఒక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి !!

August 14, 2026 by M S R

.

ఒక అభిజిత్ దీప్కే… ఒక సౌరవ్ దాస్… ఒక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి… ఇక తెలంగాణలో కొత్త విప్లవం… రుమాలు చుట్టి తను ఇక రణరంగంలోకి ఓ కళాకారుడిలా విజృంభిస్తాడట… అవునా..? ఏమో, ఈయన తాజా మాటలు, ఆవేశం, ఆక్రోశం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది సుమీ…

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయాడు…

Ads

ఓసారి వివరంగా వెళ్లిపోదాం…

అధికార పక్షంలో ఉన్నా … ప్రతిపక్షంలో ఉన్నా నేనెప్పుడూ ప్రజల పక్షమే… (అంటే మిగతా నాయకులు పాకిస్థాన్ పక్షమా, చైనా పక్షమా..?)

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం నాది. (పర్లేదు, కానీ దేనికోసం మాట్లాడుతున్నావనేది కదా ముఖ్యం)…

దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి… (ఎవరి దోపిడీ..? ఏం దోపిడీ..? కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ అంటావా..? మరి అందులో ఇంకా దేనికి కొనసాగడం..?)

అందుకు ఏపూరి సోమన్న లాంటి కళాకారులు గజ్జె కట్టాలి… నేను రుమాలు చూడతా… ప్రజల్లోకి వెళదాం… (భేష్, అదీ స్పిరిట్… కమాన్, కాంగ్రెస్ బంధనాలు తెంచుకో పోరాటవీరుడా..?)

రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచంట.. తప్పు చేస్తే తప్పని అంటా… (గుడ్, గుడ్)… తెలంగాణ వచ్చాక కూడా పేదలకు న్యాయం జరగలేదు. (అవును, దుష్ట దుర్మార్గ బీఆర్ఎస్ పాలనలో అదే జరిగింది)…

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు, కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్ళు… ఇవ్వాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. (కాంగ్రెస్ అంటేనే ఓ సముద్రం, ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు… అంతెందుకు..? తమరు కూడా మధ్యలో కాషాయం కప్పుకుని మురిసిపోయారు కదా మాస్టారూ..?)

ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే బాధ అనిపిస్తుంది. (తెలంగాణ ఉద్యమం పదవులకు ఓ అర్హతా..? ఎలా..? బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులు కూడా మంత్రి పదవుల్లో చేరారు, మరెప్పుడూ మాట్లాడలేదేం..?)

రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది. నా నిజాయితీనే నా బలం… (అంతే, అందుకే ఒక అభిజిత్ కావాలి నువ్వు, ఒక సౌరవ్ కావాలి నువ్వు… తెలంగాణ కాక్రోచ్ పార్టీ జిందాబాద్)…

రానున్న కాలంలో నిజాయితీపరులు, యువకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. రాష్ట్ర రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలి. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారనున్నాయి. (అందుకే తక్షణం కాంగ్రెస్ వదిలెయ్ నాయకా..? మార్పు కోసం గజ్జె కట్టు, రుమాలు చుట్టు, బరిలోకి దిగిపో…)

నా వెంట ప్రజలు ఉన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు, డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు, పాచిపోయిన ఎమ్మెల్యేలు నాకు అవసరం లేదు. (నాయకుల వెంట ఉండేది ప్రజలే… చివరకు షర్మిల, కవిత వెనుక కూడా ప్రజలే ఉంటారు… కానీ డిపాజిట్ రాకుండా ఎమ్మెల్యేలు అయిందెవరు..? పాచిపోవడం అనగానేమి..?)

ఒకసారి గెలవగానే డబ్బు, అధికారం, పదవిపై వ్యామోహం పెరుగుతుంది. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. నేను నామినేషన్లకు డబ్బులు ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యేలు అయినోళ్లు ఉన్నారు. (ఇంత పలుకుబడి, ప్రభావశీలత ఉండీ ఆ కాంగ్రెస్‌లో ఉండిపోవడం ఏమిటన్నా మరీనూ…)

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించాను. ఇప్పుడు వాళ్లను మనం పిలిస్తే వస్తారా… రారు. వాళ్ళు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే పోతారు… (అవును, రాజకీయాలు భ్రష్టుపట్టాయి, ప్రక్షాళనకు నువ్వే నడుం కట్టాలి నాయకా..? )

కులం, మతం పేరు చెప్పుకొని పైకెదిగిన తర్వాత వసూలు రాజాలుగా మారిన వ్యక్తులను తరిమికొట్టాలి. తప్పుడు పనులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిది కాదు…. (కరెక్ట్, జాలిమ్ కౌన్‌రే, ఉస్‌కా జులుం క్యారే… తిరగబడాల్సిందే, నువ్వే నాయకత్వం వహించాలి నాయకా..?)

ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అండగా ఉండాలి… కానీ అహంకారం పెంచుకోవద్దు. పదవి అనేది బాధ్యత కానీ… కిరీటంగా భావించవద్దు… (అవును, మంత్రి పదవి ఇస్తేనే గుర్తింపు అనే భ్రమల్లోనూ ఉండకూడదు…)

ఇప్పుడున్న నాయకులు చాలామంది గెలిచే వరకు ఒక తీరుగా… గెలిచిన తెల్లారే మరో తీరుగా మారుతున్నారు. (ఏం చేద్దామంటవ్ మరి..?) అట్లాంటి వాళ్లకు తెల్లారేసరికి పెద్దపెద్ద కార్లు ఎట్లా వస్తున్నాయి… (అవును, మీకు వచ్చాయంటే ఓ లెక్క, అందరికీ అలా ఎలా వస్తాయి..?)

ఉన్నోడేమో 1000 రేట్లు పెరుగుతుండు… లేనోడు ఇంకా అక్కడే ఉంటుండు. (నిఖాలస్ మాట చెప్పినవ్… తిరుగుబాటు తప్పదు, అదీ నువ్వే స్టార్ట్ చేయాలి…)

అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, పోరాటం చేస్తా… (అమాత్య పదవి ఇస్తే ఆ అవసరం రాదు, అదే కదా చెప్పేది, భలేవాడివే బ్రదరూ…) ఇన్నేళ్లు సహనంతో ఉన్నా… ఇక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. (అంతే, ఛోడ్ కాంగ్రెస్, ఇంక్విలాబ్ జిందాబాద్, అసలు తెలంగాణ మొత్తాన్ని ఓ జంతర్ మంతర్ ఛూమంతర్ చేసేద్దాం)…

ఏపూరి సోమన్న ఏదో ఒక నియోజకవర్గ నుంచి చట్టసభల్లో అడుగుపెడతాడు. నేను మాటిస్తే వెనక్కి పోను… (బోలెడు మందిని గెలిపించినవ్, నీకే ఏదైనా సాధ్యమే అన్నా… కమాన్… రుమాలు చుట్టు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!
  • నరుకుడు రోగం! మితిమీరిన హింస- మతిమాలిన దర్శకత్వ ప్రతిభ!!
  • The Paradise – దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను చరిత్ర క్షమించదు…
  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!
  • ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!
  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions