.
దోగిపర్తి సుబ్రహ్మణ్యం…. యన్టీఆర్- రాఘవేంద్రరావు- వేటూరి- చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ కొండవీటి సింహం సినిమా .
అడవిరాముడు , వేటగాడు ప్రభంజనం కొనసాగింది ఈ ఇద్దరి కాంబినేషన్లో . దాసరి డబుల్ పోజ్ రాఘవేంద్రరావు కూడా ట్రై చేసి వీర సక్సెస్ అయ్యాడు . Late 1970s , early 1980s లలో యన్టీఆర్ ద్విపాత్రాభినయం సినిమాలు పుష్కలంగా వచ్చాయి . అందువలన కూడా బాగా ఆడాయి .
36 సెంటర్లలో వంద రోజులు , పదిహేను సెంటర్లలో సిల్వర్ జూబిలీ , అయిదు సెంటర్లలో రెండు వందల రోజులు , విశాఖపట్నంలో షిఫ్టుల మీద 315 రోజులు . కలెక్షన్ల సునామీ . ప్రేక్షకుల జేజేలు . తమిళంలో శివాజీ గణేషన్ సినిమాను బేస్ చేసుకుని సత్యానంద్ , రాఘవేంద్రరావు , నిర్మాత అర్జున్ రాజులు బాగా నేసిన కధ . అందుకు తగ్గట్లు తారాగణం . దర్శకత్వం . చక్రవర్తి- వేటూరిల మేజిక్ . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మల గాత్రం .
Ads
(అడవిరాముడు తరహాలోనే చాలా సినిమాల్లో అవే పాటలు.., వేటూరి రాయాలి, చక్రవర్తి వాయించాలి, శ్రీదేవి- ఎన్టీయార్ కలిసి ఎగరాలి… అదొక హిట్ ఫార్ములా… అత్తమడుగువాగులోన అంటే అర్థమేమిటో చెప్పడానికి ఇప్పుడు వేటూరి లేడు, ఎన్టీయార్ లేడు, చక్రవర్తి లేడు, శ్రీదేవి కూడా లేదు… రాఘవేంద్రరావుకు ఏమర్థమైందో తనైనా చెప్పాలిక……)
ఇవన్నీ ఒక ఎత్తయితే యన్టీఆర్ రెండు భిన్న పాత్రల్లో చూపిన నటన మరో ఎత్తు . సర్దార్ పాపారాయుడులో ఎలా అయితే తండ్రి పాత్ర సీరియస్ , కొడుకు పాత్ర చలాకీగా ఉంటాయో ఈ కొండవీటి సింహం సినిమాలో కూడా తండ్రి రంజిత్ కుమార్ సీరియస్ , కొడుకు రాము చలాకీ సరదా పాత్ర . రెండు పాత్రల్నీ యన్టీఆర్ చాలా బాగా నటించారు .
ముఖ్యంగా చెప్పుకోవలసింది యన్టీఆర్ శ్రీదేవితో సమానంగా డాన్సులు . ఆ వయసులో ఆ డాన్సులు వేయటం సాధారణ విషయం కాదు . Hats off to him for his passionate acting . తండ్రి యన్టీఆర్ పాత్రకు రెండు పాటలు .
ఒకటి ఈ మధుమాసంలో ఈ దరహాసంలో చాలా శ్రావ్యంగా ఉంటుంది . మరో పాట మా ఇంటి లోన మహలక్ష్మి నీవె ఆర్ద్రతతో నిండిన పాట . యన్టీఆర్ , జయంతిల నటన ప్రేక్షకులను కదిలిస్తుంది .
వేటూరి వారి మరో పార్శ్వం కొడుకు యన్టీఆర్, శ్రీదేవిల డ్యూయెట్ సాంగ్స్ . మొదట చెప్పుకోవలసింది బంగినపల్లి మామిడిపండు రంగు మీదుంది పాట . రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మామిడిపండ్లను కవర్ చేసేసారు వేటూరి వారు . సంతోషం ఏమిటంటే వాటినన్నింటినీ శ్రీదేవి మీద కురిపించలేదు రాఘవేంద్రరావు . కురిపించి ఉంటే శ్రీదేవి ఏమయ్యేదో !
అత్త మడుగు వాగులోన అత్త కూతురో , వానొచ్చె వరదొచ్చె , గోతి కాడ గుంట నక్క డ్యూయెట్లు యన్టీఆర్ అభిమానులను థియేటర్లలో డాన్సులు చేయించాయి . అక్కడక్కడా నాణేలు కూడా తెర మీదకు విసిరారు . అంత క్రేజీగా ఉంటాయి పాటలు అప్పుడూ ఇప్పుడూ .
తండ్రి పాత్రలో యన్టీఆర్ , ఆయన భార్యగా జయంతి , దారి తప్పిన కొడుకు పాత్రలో మోహన్ బాబుల నటన ఫుల్ డ్రామాతో నిండి ఉంటుంది . మోహన్ బాబు బాగా నటించాడు . ఇంక శ్రీదేవి . చెప్పేదేముంది . తన గ్లామరుతో అభిమానులను ఉర్రూతలూగించింది . ఇతర పాత్రల్లో సత్యనారాయణ , నాగేష్ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , కాంతారావు , త్యాగరాజు , ముక్కామల , గీత , పుష్పలత , సుభాషిణి , తదితరులు నటించారు .
దసరా సీజనుకు 1981 అక్టోబర్ ఏడున విడుదలయిన ఈ సినిమా ఓ ప్రభంజనాన్ని సృష్టించింది . బహుశా ఈ సినిమా చూడనివారు ఎవరూ ఉండరు . ఎవరయినా ఒకరూ అరా ఉంటే యూట్యూబులో ఉంది . చూసేయండి . 100% entertaining , musical hit movie . Undoubtedly a watchable one . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
నిజానికి ఈ సినిమాలో తండ్రి ఎన్టీయార్‌కు ఇద్దరు కొడుకులు… ఒక పాత్ర తనే చేశాడు… మరో పాత్ర మొదట చిరంజీవితో చేయించాలని అనుకున్నారుట… అంతకుముందు అదే ఏడాది చిరంజీవి ఎన్టీయార్‌తో తిరుగులేని మనిషి అనే సినిమాలో కలిసి నటించాడు…
దానికీ రాఘవేంద్రరావే దర్శకుడు… ఎన్టీయార్ కొడుకు అంటే పాజిటివ్ పాత్ర అనుకున్నాడట… కానీ అది తండ్రిని ఎదిరించే పాత్ర… నెగెటివ్ షేడ్స్… పైగా ఎన్టీయార్ మీద తిరగబడి సేమ్ డైలాగ్స్ ధాటిగా చెప్పే పాత్ర…
ఎదురుగా ఉన్నది ఎన్టీయార్ కదా, చిరంజీవి డైలాగులు చెప్పడంలో వెనుకంజ వేస్తుండేసరికి… ఇక 5 రోజుల షూటింగ్ అనంతరం చిరంజీవిని వద్దని చెప్పి మోహన్‌బాబును పెట్టారట… మోహన్‌బాబుకు ఎన్టీయార్‌తో కాస్త ఎక్కువ చనువు కదా… లాగించేశాడు… అబ్బే, కాదు, చిరంజీవి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో తప్పించాల్సి వచ్చిందని అప్పట్లో రాఘవేంద్రుడే ఏదో వివరణ ఇచ్చాడట కూడా..!! రకరకాల వెర్షన్లు… బహుశా కొంత షూటింగ్ జరిగాక సినిమా నుంచి తప్పించడం బహుశా చిరంజీవి కెరీర్‌లోనే ఇదే మొదటిది, ఇదే చివరిది అనుకోవాలి..!!
Share this Article