నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏమీ నచ్చలేదా..? ఎందుకు నచ్చలేదు..? ఆ ఇద్దరు హీరోల ధోరణి బాగుంది… నటన గురించి చర్చ వదిలేయండి… ఫ్యాన్స్ విమర్శలు, రచ్చ గట్రా కూడా వదిలేద్దాం… నటనలో వాళ్లిద్దరిలో ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు… కాస్త జూనియర్ ఎన్టీయార్ అనుభవం వల్ల కావచ్చుగాక, తన ఎమోషన్స్ పలికించడం, డైలాగ్ డిక్షన్ కంపేరిటివ్‌గా బెటర్… రంగస్థలం తరువాత రాంచరణ్ నటనలో మెచ్యూరిటీ లెవల్ ఇంకాస్త పెరిగింది…
అయితే ఒక మల్టీస్టారర్ సినిమా తీస్తున్నప్పుడు మన ద్రవిడ భాషలకు సంబంధించి ఓ చిక్కు ఉంటుంది… అభిమానులతో చిక్కు… తమ హీరోకు ఏమాత్రం ప్రాధాన్యం తగ్గినా కన్సర్న్‌డ్ ఫ్యాన్స్ ఊరుకోరు… అందుకే మన హీరోలు ఎందుకొచ్చిన పెంట అనుకుని మల్టీస్టారర్ల జోలికి పెద్దగా వెళ్లరు… వాళ్లను బ్యాలెన్స్ చేయడానికి దర్శకుడికి కూడా పెద్ద తలనొప్పి… హిందీలో, ఇంగ్లిషులో కథ ప్రకారం ప్రాధాన్యాలు ఉంటయ్, వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు…
నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కథ ప్రకారం రెండు బలమైన పాత్రలు… అందుకే ఇద్దరు సమానస్థాయి హీరోలను తీసుకున్నాడు… ఇద్దరినీ బ్యాలెన్స్ చేయడానికి విశ్వప్రయత్నం చేశాడు… ఫస్టాఫ్ ఎన్టీయార్ హవా నడిస్తే, ఇంటర్వెల్ తరువాత రాంచరణ్ అందుకున్నాడు… కాస్త త్రాసు చూస్తే రాంచరణ్ వైపే మొగ్గినట్టు సగటు ప్రేక్షకుడి ఫీలింగ్… కథ కూడా ప్రధానంగా రాంచరణ్ కేంద్రంగానే సాగుతుంది…
తనకు ఓ హిందీ హీరోయిన్… ఆమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరక్కపోయినా సరే, ఆమెను హిందీ మార్కెట్ కోసమే తీసుకున్నా సరే, అలియా భట్ పాపులారిటీ ఎంతోకొంత సినిమాకు ప్లస్సే… తెల్లవాడి ఆయుధాగారాన్ని కొల్లగొట్టాలనే లక్ష్యంతో బ్రిటిష్ సేనలో చేరడం, ఓ పిల్లాడిని రక్షించడం, భీంలో మిత్రుడిని వెతుక్కోవడం, కానీ ఓ పిల్ల కారణంగా ఇద్దరూ కొట్టుకోవడం, మళ్లీ కలిసిపోవడం… రాంచరణ్ యాంగిలే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది…
Ads
జూనియర్‌ది ఓ లక్ష్మణుడి పాత్ర అనిపిస్తుంది… ఒకరు నిప్పు, ఒకరు నీళ్లు అని చెప్పినా… సమస్కంధులుగా చూపించే ప్రయత్నం చేసినా సరే, ఈ సినిమా జూనియర్‌కన్నా రాంచరణ్‌కే ప్లస్ అనిపిస్తుంది… జూనియర్ కోసం ఓ ఒలీవియా అనబడే ఓ తెల్లతోలు సుందరిని పట్టుకొచ్చినా సినిమాలో తనకు పెద్దగా ఉపయోగపడిందేమీ లేదు… ఇక్కడ మెచ్చుకోదగిన అంశం ఏమిటంటే… ఇవన్నీ జూనియర్ పట్టించుకోలేదు, ఎక్కడా ఇగో ఫీల్ కాలేదు… రాజమౌళి చెప్పినట్టు చేసుకుంటూ పోయాడు… తెర బయట కూడా రాంచరణ్‌తో తన బలమైన దోస్దీ కనిపించింది… గుడ్…
ఒక చాణక్య చంద్రగుప్త, ఒక కురుక్షేత్రం చూసినప్పుడు ఇద్దరు బలమైన సమస్థాయి హీరోల బ్రొమాన్స్ మళ్లీ తెలుగు తెరపై సాధ్యమేనా అనిపించేది… కానీ ఈ ఇద్దరూ చేసి చూపించారు… పైగా ప్రస్తుతం తెలుగు హీరో అంటే నటీనటులు, బ్యానర్, దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుల ఎంపిలక దగ్గర నుంచి, బయ్యర్ల ఎంపిక దాకా, సీన్ల రచన దాకా అన్నింట్లో వేలు పెడుతుంటారు… (బాలయ్య కాస్త మినహాయింపు)… దర్శకుడు ఉత్త విగ్రహపుష్టి… కానీ ఈ సినిమాకు సంబంధించి దర్శకుడే సుప్రీం… ఇద్దరు హీరోలు తను చెప్పినట్టుగా చేస్తూ పోయారు… గుడ్…
రాజమౌళి మీద ఎవరెన్ని విమర్శలు చేసినా సరే, అందరూ అంగీకరించే ఓ ప్లస్ పాయింట్ ఉంది… వెగటు, వెకిలి, బూతు, అశ్లీలం జోలికి పోడు… జబర్దస్త్ తరహా కామెడీకి కూడా దూరంగా ఉంటాడు, ఉంచుతాడు తన సినిమాను… నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలో కుమ్రం, అల్లూరి పేర్లను వాడుకోకుండా ఉంటే… సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఇంకాస్త అధికంగా ఉండేవి…!!
Share this Article