‘‘ఫిల్మ్ బ్యూరో రాధా అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సూపర్ స్టార్’’ అని ఓ వీడియో కనిపించింది… ఇలాంటి వీడియో వార్తల సంగతి తెలుసుకదా… అందుకని మనసులోనే ఆంజనేయస్వామిని ఓసారి పాహిమాం అని ధ్యానించి, చూడ సాహసించి, వీడియో ఓపెన్ చేస్తే… సదరు సూపర్ స్టార్ షాక్ సంగతేమిటో గానీ… నాకు కొన్ని షాక్స్ తగిలాయి… కానీ ఏమాటకామాట… ఆ తిక్క స్క్వేర్ ప్రశ్నకు మహేష్ జవాబు ఇచ్చిన తీరు, తను చూసిన చూపు మాత్రం భలే నచ్చేశాయి…
రాజమౌళి పుట్టిన కాలంలో మనమూ పుట్టడం మన పుణ్యం, అదృష్టం, మన జన్మసార్థకం అంటూ ఏదో ప్రెస్‌మీట్లో ఎవరో ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ జర్నలిస్టు ప్రవచించాడు కదా… జర్నలిస్టు అని చెప్పుకునే ప్రతి ఒక్కడూ సిగ్గుతో తలదించుకున్నాడు కదా… తరువాత ఇంకెవరో జగమెరిగిన ఘన జర్నలిస్టు డీజే టిల్లుకు ‘ఏమోయ్, హీరోయిన్ ఒంటిమీద పుట్టుమచ్చలు వెతికావా’ అని అత్యంత పదునైన వయాగ్రా ప్రశ్న వేశాడు గుర్తుందా..? దానికి హీరో సిద్ధూ చాలా హుందాగా ‘‘ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం’’ అని పరోక్షంగా ‘‘నీ బొంద ప్రశ్న వేశావోయ్’’ అన్నట్టుగా చూశాడు… అప్పుడు జర్నలిస్టు అనేవాడు మరోసారి చచ్చిపోయాడు… (సినిమా జర్నలిజంలో ఇలా రోజూ చచ్చిపోవడమే జీవితగమనం అని ఓ మిత్రుడు సత్యమేదో చెప్పినట్టు గుర్తు… అఫ్‌కోర్స్, మెయిన్ స్ట్రీమ్ బాగుందని కాదు…)
Ads
భారత్ టుడే… ఎవరో పెట్టిన చానెల్, ఆమధ్య ఎవరో స్వామి చేతుల్లోకి ఉండేది, తరువాత ఇంకెవరో తీసుకున్నారు… అది కాదు అసలు చెప్పదలుచుకున్నది… ఫిల్మ్ బ్యూరో రాధా అంటే ఏమిటి..? రాధా అంటే జర్నలిస్టు పేరా..? ఫిల్మ్ బ్యూరో రాధా అంటే అంత ఫేమసా..? తను అడగిన ప్రశ్నకు మహేష్ బాబు షాక్ తిన్నాడని థంబ్ నెయిల్ పెట్టేసి, ఆ చానెలే ఇలా ప్రచారం చేసుకోవాలా..? సరే, ఆ ప్రశ్న ఏమిటో తెలుసా..?
సదరు జర్నలిస్టు ఈమధ్య ఎక్కడికో వెళ్తే తన ఫోటోలు పట్టుకుని జాతరలో ఊరేగుతున్నారట కొందరు… ఇదేమిట్రా అనడిగితే, మా దేవుడు మహేష్ బాబు, ఇక్కడి గుడి దేవత మా దేవత అని సమాధానం ఇచ్చారట… అది చెబితే సరిపోయేది, అలాంటి ఫ్యాన్స్ కోసం మీ తండ్రి బయోపిక్ ఎప్పుడు నిర్మిస్తున్నావ్..? ఇదీ ప్రశ్న… ఆహా… ఇది రాజమౌళి భజన జర్నలిస్టును మించిపోయిన ప్రశ్న… నేరుగా కృష్ణ బయోపిక్ నిర్మిస్తారా అనడిగితే చెప్పడా మహేషుడు..?
మహేష్ రియాక్షన్ నచ్చింది… ప్రశ్న అయిపోగానే తనదైన ఓ చిరునవ్వు… అందులో లౌక్యం ఉంది… ఈ పొగడ్తకు ఎలా రియాక్ట్ కావాలో తెలియనితనం, బిడియం కూడా ఉంది… చాలా తెలివైన ఆన్సర్ ఇచ్చాడు… ‘‘ఆ సినిమా, ఆ బయోపిక్ ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే ఆనందంగా చూస్తాను… నేనయితే ఆ పాత్ర చేయలేను, ఆయన నా దేవుడు కాబట్టి… నాకు అవకాశముంటే ప్రొడ్యూస్ చేస్తాను..’’ ఇదీ తన ఆన్సర్… అదే దేవుడి భాషలో…!! ఇందులో తండ్రి పట్ల గౌరవం ఉంది, ఫ్యాన్స్ అభిమానం పట్ల కృతజ్ఞత ఉంది, తను ఆ బయోపిక్‌లో నటించననే క్లారిటీ ఉంది, తన తండ్రి పాత్ర తను చేయలేను అనే వినమ్ర ప్రకటన ఉంది.., అవసరమైతే డబ్బు పెట్టి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడం ద్వారా ఇక ఆ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టేసిన తెలివిడి కూడా ఉంది… భలే జవాబు చెప్పావు మహేషూ… సోషల్ మీడియా ట్రోలింగుకు, మీడియా క్వశ్చనింగుకు జవాబులు చెప్పడం అనేది ఓ ఆర్ట్…!!
Share this Article