లా చదివి సినిమాల్లో ప్రయత్నిస్తున్న మమ్ముట్టిని మొదట గమనించి ప్రోత్సహించింది ఎం.టి.వాసుదేవ నాయర్. ‘నేను ఆయన వల్లే హీరోనయ్యాను’ అని కృతజ్ఞత ప్రకటిస్తాడు మమ్ముట్టి. సాహిత్యం పట్ల కృతజ్ఞత ప్రకటించడం సంస్కారం అని చాలామంది స్టార్లు అనుకోకపోవచ్చు. అనుకునే స్టార్లు కొందరు ఉంటారు. కేరళలో ఎక్కువమంది ఉన్నారు. మమ్ముట్టి గతంలో వైకం ముహమ్మద్ బషీర్ ‘గోడలు’ (కాత్యాయని గారి అనువాదం ఉంది) కథలో నటించి జాతీయ అవార్డు పొందాడు.
ఇప్పుడు విశేషం ఎం.టి.వాసుదేవ నాయర్ 9 కథలు యాంథాలజీగా ‘మనోరథంగళ్’ పేరుతో తెర రూపం దాల్చి జీ 5లో స్ట్రీమ్ కానున్నాయి. మన మలయాళ గొప్ప రచయిత కథల్లో నటించకపోతే ఎలా అని మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాజిల్, బిజు మీనన్ ఇంకా చాలామంది ప్రసిద్ధ నటీనటులు ముందుకు వచ్చారు. ప్రియదర్శన్ వంటి దర్శకులూ క్యూ కట్టారు.
Ads
కమల హాసన్ అంతటి వాడు ముందుకొచ్చి సిరీస్‌కు ఇంట్రడక్షన్ పలికాడు. దీని వల్ల ఏమవుతుంది? పుస్తకాలు, కథలు తెలియని వారు కూడా సాహిత్యం వైపు చూస్తారు. కొత్త తరం చూస్తుంది. స్కూలు పిల్లలు చూస్తారు. మలయాళ కథ కొత్తనీరు తాగి కొనసాగుతుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ డబ్బింగ్ వల్ల మలయాళ కథ ఆ భాషల్లో చర్చకు నిలుస్తుంది.
మరి మన సంగతి? దూరదర్శన్‌లో సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’ రాగలిగాయి. తెలుగు దూరదర్శన్‌లో భరాగో కథలు కూడా కొన్ని వచ్చాయి. శాటిలైట్ చానల్స్ మొదలయ్యాక తెలుగు కథలకు దృశ్యరూపం ఇవ్వడానికి ఎంతో వీలుంది. కాని గొల్లపూడి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని సంపూర్ణంగా ఎపిసోడ్స్ తీయడం తప్ప చెప్పుకోదగ్గ కృషి జరగలేదు.
ఓటిటిలు వచ్చాక తెలుగులో మొట్టమొదటిసారి యాంథాలజీగా నా ‘మెట్రో కథలు’ కరుణ కుమార్ దర్శకత్వంలో రావడం సంతోషించాల్సిన సంగతే గాని కొనసాగింపు లేదు. నా ‘పోలేరమ్మ బండ కథలు’ ఓటిటి రైట్స్ కొన్నారు. అనుకున్నంత వేగంగా పని ముందుకు కదలడం లేదు. తెలుగు కథ ‘మిథునం’ చదివి మలయాళంలో సినిమా తీసిన ఎం.టి. వాసుదేవనాయర్ వంటి దర్శకులు తెలుగు కథ కోసం తెలుగులో ఎక్కడ?
ఇప్పుడు ‘మనోరథంగళ్’ ట్రైలర్ చూశాక చలం తొమ్మిది కథలు, కొ.కు తొమ్మిది కథలు, మధురాంతకం రాజారాం తొమ్మిది కథలు, అల్లం రాజయ్య తొమ్మిది కథలు, ఓల్గా తొమ్మిది కథలు, చాసో తొమ్మిది కథలు… ఎన్ని యాంథాలజీలు తీయొచ్చు.
సన్నపరెడ్డి, పెద్దింటి, కుప్పిలి పద్మ… అలాంటి తొమ్మిది మనకు నూటా తొమ్మిది.
అలా కాకుండా ఇప్పటికిప్పుడు తొమ్మిది కథలు తీయాలంటే సంఘటనాత్మకమైన కథలుగా దృశ్యరూపానికి అనువుగా నాకు గుర్తుకు వచ్చినవి ఇవి:
1. పాలగుమ్మి పద్మరాజు – గాలివాన
2. కల్యాణ సుందరి జగన్నాథ్ – అలరాస పుట్టిల్లు
3. అల్లం శేషగిరిరావు – వఱడు
4. మహేంద్ర – అతడి పేరు మనిషి
5. కొలకలూరి ఇనాక్ – అస్పృశ్య గంగ
6. బండి నారాయణ స్వామి – సావుకూడు
7. తిలక్ – నల్లజర్ల రోడ్డు
8. బోయ జంగయ్య – ఇప్పపూలు
9. స్మైల్ – ఖాళీ సీసాలు……. మనం ఎప్పుడు చూసుకుంటామో. ……. ( By మహమ్మద్ ఖదీర్ బాబు )
Share this Article