మంత్రి గారి భార్య గారి ప్రోటోకాల్ తహతహ!
ఆమె మంత్రి కాకపోవచ్చుగాక. సాక్షాత్తు మంత్రి గారి భార్య గారు. మంత్రికి భార్య కాబట్టి మంత్రిలో సగభాగం. “ధర్మేచ… అర్థేచ…” ధర్మం ప్రకారం ఆమె పొద్దు పొద్దున్నే ప్రోటోకాల్ అడగడంలో తప్పు లేదు! కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ… ముందు కుయ్ కుయ్ అని సైరన్లు మోగగ… మంత్రి గారి భార్య గారికి ఊరేగాలని కోరిక ఉండడం “అర్థేచ” ప్రకారం అర్థం చేసుకోదగ్గదే!
డబ్బులెవరికీ ఊరికే రావు. అలాగే పదవులెవరికీ ఊరికే రావు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకోగా వచ్చిన పదవిని ఊరికే వదిలేస్తే ఎలా?
అనుభవించాలి.
Ads
అయినా రాయచోటిలో ఆ పోలీసేమిటి అలా చేశాడు? ఆ కాలంలో రాజులకు, ఈకాలంలో మంత్రుల కుటుంబాలకు చోటిస్తేనే కదా “రాయచోటి” అన్న మాటకు లిటరల్ గా క్షేత్ర వ్యుత్పత్తి అర్థం సరిపోయేది!
మంత్రి గారి భార్య గారు అయిన అమ్మ గారు రోడ్డు మీదికి వస్తే… ముందే రోడ్డును క్లియర్ చేయాలి కదా? పైలట్ వెహికిల్ పెట్టాలి కదా? సైరన్ మోగిస్తూ అత్యవసర అంబులెన్సులను కూడా పక్కకు ఆపి పెట్టాలి కదా? పైగా ఆఫ్టరాల్ ఒక పోలీసు కోసం అమ్మ గారు అరగంట నడిరోడ్డు మీద నిరీక్షించడం ప్రజాస్వామ్యానికి ఎంతటి మాయని మచ్చ?
ఆమె చదువుకున్నామె కాబట్టి… సంస్కారం పోతపోసిన మనిషి కాబట్టి… ఎంతో సంయమనంతో పోలీసును అత్యంత మర్యాదయిన మాటలతో తిట్టింది. విసుక్కుంది. హెచ్చరించింది. ప్రతిపక్షం కాదు కదా నీకు జీతమిచ్చేది? అని జీతభత్యాలు, అలవెన్సులు, హెచ్ ఆర్ ఏ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల దాకా వెళ్లింది.
ఏ మాటకామాట!
ఆమె పోలీసును నిలదీస్తున్న పద్ధతి ఎంత చూడముచ్చటగా ఉందో! ఈరోజుల్లో సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివారూ జర్నలిస్టే కాబట్టి… ఎవరో ఉత్సాహవంతుడు ఈ ప్రోటోకాల్ తహతహను అందంగా రికార్డు చేసి లోకానికి అందించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ మంత్రికి ఫోన్ చేసి… విసుక్కున్నట్లు… ఆ మంత్రి విచారం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. మంత్రి గారి భార్య గారు విచారం వ్యక్తం చేసినట్లు ఇప్పటికైతే వార్తలు రాలేదు కాబట్టి విచారించదలుచుకున్నవారు తనివితీరా విచారించుకోవచ్చు!
గతంలో తెలంగాణాలో ఒక జిల్లాపరిషత్ అధ్యక్షురాలి కొడుకు గారు హైదరాబాద్ లో రోజూ జిమ్ కు వెళుతుంటే ఆ ముద్దుల కుమారుడికి కుడి ఎడమల ఎక్కుపెట్టిన తుపాకులతో బాడీ గార్డులు రోజూ రక్షణగా వెళ్లిన దృశ్యాలు, ఆ అబ్బాయి కండలు తిరిగిన గుండె విరుచుకుని వెళుతుంటే బాడీ గార్డులు తలుపులు తెరవడాలు, లిఫ్టులు నొక్కిపెట్టి… ఆపి పెట్టడాలు చూడముచ్చటగా ఉండేవి. ఇక్కడ కూడా ఆ అబ్బాయి బాడీని పెంచడానికి జిమ్ముకు వెళ్లడం, ఆ బాడీని రక్షించడం బాడీగార్డుల విహిత ధర్మంగా వ్యుత్పత్తి అర్థమే చెప్పుకోవాలి!
అయినా- రాజ్యాంగం ప్రకారం పదవీ స్వీకార ప్రమాణంలో-
“…. అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని… భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను”
అనే అన్నారు కానీ… నా భార్యకు ప్రభుత్వ ప్రోటోకాల్ అడగనని; నాకిచ్చిన బాడీ గార్డులను మా అబ్బాయికి పంపనని అనలేదు కదా!
… అర్థం చేసుకోవడంలోనే ఉంది పరమార్థం!! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article