.
కావు, ఇవన్నీ ఒక ప్రధాని జనరల్‌గా చెప్పిన పొదుపు సూత్రాలు కావు అవి… ఏదో ఓ విపరిణామాన్నో, విపత్తునో, ప్రమాదాన్నో, యుద్ధాన్నో హింట్స్ ఇస్తున్నాయి… ఒక ప్రధాని నోటి వెంట నిరర్థకంగా ఒక్క మాట కూడా వెలువడకూడదు… కానీ జనం తప్పకుండా పాటించాలని తను చెప్పిన పది సూచనల వెనుక ఏదో మర్మం ఉంది…
ముందుగా ఆ సూచనలు ఏమిటంటే..? 1. ఏడాది పాటు బంగారం కొనకండి 2. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి 3. ఎలక్ట్రికల్ వాహనాల్ని వాడండి 4. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వండి 5. విదేశీ పర్యటనలు తగ్గించండి 6. వంట నూనెల వాడకం తగ్గించండి 7. రసాయన ఎరువుల వాడకం తగ్గించండి 8. సోలార్ పంపులు వాడండి 9. స్వదేశీ వస్తువులే కొనండి 10. ఆడంబరాలు తగ్గించండి…
Ads

జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఒకే సూత్రం చెబుతున్నాయి… విదేశీ మారక ద్రవ్యం… అన్నింటి అంతఃసూత్రం అదే… బంగారం, వంటనూనెలు, ఎరువులు, పెట్రోల్, డీజిల్, విదేశీ పర్యటనలు… అన్నీ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేసేవే… అంటే, విదేశీ మారక ద్రవ్యం విషయంలో ప్రధాని ఏదో ప్రమాదాన్ని ఊహిస్తున్నట్టు… కాదు, ఊహల మీద ఆధారపడి ఏ ప్రధానీ తన జనాన్ని భయపెట్టడు… విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Foreign Exchange Reserves) కాపాడుకోవడం, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడం అనే దిశలో సాగాయి ప్రధాని మాటలు…
అందుకే తనకు ఏదో సమాచారం ఉంది… అందుకే జనాన్ని ముందస్తుగా ప్రిపేర్ చేస్తున్నాడు… అమెరికా ఇరాన్ వార్ మరిన్ని దేశాలకు విస్తరించి, యుద్ధం ఇంకా తీవ్రమై సుదీర్ఘకాలం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయవచ్చుననే సూచనా..? ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి… మన ఆయిల్ కంపెనీలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి…
క్రూడ్ , గ్యాస్ దిగుమతులకు కూడా ‘హొర్ముజ్ గండాలు’ కొనసాగుతున్నాయి. యుద్ధం తీవ్రమైతే అవి ఇంకా పెరిగిపోనున్నాయి… కమర్షియల్ గ్యాస్ ధర ఆల్రెడీ అడ్డగోలుగా పెంచేసిన ప్రభుత్వం త్వరలో పెట్రో, డీజిల్, డొమెస్టిక్ గ్యాస్ ధరల్నీ పెంచవచ్చునని అందరూ ఊహిస్తున్నదే.,. ఇంధనం – విదేశీ మారక ద్రవ్యం… ఇవి రెండే ప్రధాని మాటల్లో ధ్వనించిన భయసందేహాలు… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
1. ‘సప్లై చైన్’ విచ్ఛిన్నం (Supply Chain Disruption) … యుద్ధం కేవలం చమురు ధరలనే కాదు, ప్రపంచ వాణిజ్య మార్గాలను దెబ్బతీస్తుంది. వంట నూనెలు, రసాయన ఎరువుల దిగుమతులు ఆగిపోతే దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అందుకే “వాడకం తగ్గించండి” అనడం వెనుక ఉన్న ఉద్దేశం—భవిష్యత్తులో ఏర్పడబోయే తీవ్రమైన కొరతకు జనాన్ని మానసిక సిద్ధం చేయడం.
2. రూపాయి విలువ పతనంపై ఆందోళన … మనం విదేశీ వస్తువులు కొన్నా, పెట్రోల్ వాడినా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలో చెల్లించాలి. యుద్ధం వల్ల డాలర్ బలపడి, రూపాయి విలువ పడిపోతే ద్రవ్యోల్బణం (Inflation) ఆకాశాన్ని తాకుతుంది. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండాలంటే, ఇప్పుడే ‘స్వదేశీ’ బాట పట్టడం మినహా మరో మార్గం లేదు.
3. యుద్ధ కాలపు ఆర్థిక వ్యూహం (War Economy Strategy)… చరిత్రను గమనిస్తే, పెద్ద యుద్ధాలు లేదా సంక్షోభాలు రాబోయే ముందు దేశాధినేతలు ప్రజలను ‘త్యాగాలకు’ సిద్ధం చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్ అనేవి కేవలం టెక్నాలజీ వినియోగం మాత్రమే కాదు, అవి దేశం లోపల రవాణా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి, అత్యవసర సేవల కోసం ఇంధనాన్ని నిల్వ చేసే ఎత్తుగడలు కావచ్చు.
4. ఎనర్జీ ఇండిపెండెన్స్ (Energy Independence) … సోలార్ పంపులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ఒత్తిడి పెంచడం అంటే— మనం పరాయి దేశాల ఇంధనంపై ఆధారపడటం తగ్గించుకోకపోతే, రేపు యుద్ధం వల్ల సరఫరా ఆగిపోతే దేశం మొత్తం స్తంభించిపోతుందనే హెచ్చరిక.
5. నిశ్శబ్ద ఆర్థిక ఎమర్జెన్సీ? … ప్రభుత్వానికి అందే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటే, విదేశీ మారక ద్రవ్యం కరిగిపోకుండా చూసుకోవడం ప్రాధాన్యత అవుతుంది. శ్రీలంక వంటి దేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని, భారతదేశం అటువంటి స్థితికి చేరకూడదనే ముందస్తు జాగ్రత్త ఇది.
ఇది కేవలం ఒక ప్రధాని సందేశం కాదు, రాబోయే ఒక ‘ఆర్థిక తుఫాను’ ముందు వినిపిస్తున్న సైరన్… ప్రజలు దీన్ని కేవలం సూచనలుగా తీసుకుంటారా లేక రాబోయే ప్రమాదానికి హెచ్చరికగా భావిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి… ఇదంతా అర్థమైంది కనుకే స్టాక్ మార్కెట్ నెగెటివ్ గా రియాక్టయింది…!!
Share this Article