అది నివ్వెరపోయేంత నిజాయితీ
Mohan On Our Father Tadi Appalaswamy
Ads
—————————————————————–
తెలంగాణసాహిత్య పత్రిక ‘పాల పిట్ట’ 2014 నవంబర్ సంచిక ఆర్టిస్ట్ మోహన్ special issue గా వచ్చింది. అందులో మా నాన్న తాడి అప్పలస్వామి గురించి మోహన్ ఒక వ్యాసం రాశాడు. ఈ మధ్య కార్ల్ మార్క్స్ పుట్టిన రోజున నా వ్యాసం లో మా నాన్న గురించి రాసింది చదివి, ఆయన వివరాలు మరిన్ని తెలిస్తే బావుంటుందని కొందరు ఫోన్లు చేశారు. ఇది మా నాన్న 25వ వర్ధంతి సంవత్సరం.
కేవలం ఇది మా నాన్న గురించిన వ్యాసమే కాదు…
A slice of history also.
– Prakash
*** *** ***
Article by Artist Mohan
మాది ఇరుకూరు. బాగా మురికూరు.
మాది ఏలూరు.
అలాగని అంతా అంత దరిద్రమేం కాదు.
కాలవ అవతల అగ్రహారం,
తమ్మిలేరు పక్కన అశోక్‌నగర్‌లో పెంకుటిళ్ళూ, డాబాలూ అందాలు చిందుతుండేవి.
షోకు పిల్లుల్లాగుండేవి.
మా పేటలు మాత్రం
బురద రోడ్లతో పందులూ, కుక్కలూ,
గుడెసెలూ సారాకొట్లతో అలరారుతుండేవి.
అసలు మా తాతలది శ్రీకాకుళం. సిక్కోలోళ్ళు.
అంతా పాలమూరు లేబర్ కంటే కనాకష్టం.
స్వాతంత్రానికి ముందెప్పుడో పొట్ట చేత
పట్టుకుని వలసొచ్చి ఏలూరు చేరారు.
అప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకి బ్రిటీష్ కలెక్టర్ వచ్చారు. జిల్లా రాజధాని ఏలూరు.
“మీ ఊరు పేరోంటోయ్” అని ఇంగ్లీషులో అడిగాడట. “ఏలూరండి” అని మా టిపికల్ యాసలో గుమాస్తాలు చెప్పారట. దొరగారికి నోరు తిరక్క “ఎల్లోర్” అన్నాడు. మాఊరి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ మీద పసుప్పచ్చటి బోర్డుమీద నల్ల రైల్వే అక్షరాలతో
“ELLORE” అనే రాసి ఉంటుంది. అది పెద్ద స్టేషన్.
మా కొత్తపేట దగ్గర ఉండే చిన్న స్టేషన్‌లో మటుకు “POWER PET” అని బోర్డుంటుంది. ఎందుకో తెలీదు. అనాగరికులైన ఆసియా వాసుల్ని “సివిలైజ్” చేసే పవిత్ర కర్తవ్యంగల మా జిల్లా
తెల్లదొరవారిని పట్టుకుని “శిరస్సరఝరీ…పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ నిస్వనస్ఫుట…” అని అనమంటే ఏమనుండే వాడో. మావూరు మాత్రం సివిలైజ్ కానంటే కానని ఠలాయించింది.
మా తాత సన్యాసినాయుడుని నేనెప్పుడూ చూడలేదు. ఆయన హమాలీ. ఎవడేనా బండిలాగే హమాలీని ఒరే అంటారు గానీ
“ఆయన” అంటే ఎబ్బెట్టుగా ఉండదూ. సన్యాసి నాయుడుకి గానీ, అతని తొమ్మిదిమంది అన్నదమ్ములకి కానీ ఎన్నడూ
చదువులేదు. లేకపోగా మరో గొప్ప ఎడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ తూర్పుకాపుల కులంలో చదువు అనేదొకటుంటుందని కూడా పలు శతాబ్దాలుగా తరతరాలుగా తెలీదు.
“ఓరే సన్నాసినాయుడూ” అని జీవితాంతం పిలవబడిన తాతగారిని నేనెన్నడూ చూడలేదు. కానీ అతని పెళ్ళాం నాకు బాగా తెలుసు. చాలా పొడగరి. రివట. రావిషంగ్‌బ్యూటీ. పొడుగాటి ముక్కు జారిపోయే చెవులపైనా కిందా వేలాడే బంగారు ఆభరణాలు. విశాల ఫాలభాగం మీద రూపాయి బిళ్ళంత బొట్టు. ఏక వస్త్ర. జాకెట్ అనే పేరు బతుకులో వినలేదు. తెలీదు. బొబ్బిలి గిన్నెల్లో అంబలి మీద మజ్జిగ పోసి మధ్యలో బెల్లంముక్క పెట్టుకుని మొత్తం ఊర్చుకు తాగేసేది. మళ్ళీ
గిన్నె కడిగే పనిలేదు. అంతటి అందగత్తె అంతే హాండ్సమ్ కొడుకుని కనింది. సన్యాసి నాయుడు కొడుకేమవుతాడు?
తాడి అప్పలస్వామి అయ్యాడు.
*** *** ***
మా తాత ఒక రైస్‌మిల్లు నుంచి మరో మిల్లుకి బియ్యం బస్తాలేసుకుని బయల్దేరేటపుడు మిల్లు ఆసామీ చిన్న చీటీ ఇచ్చే వాడట. నానా చావూ చచ్చి చెమటలు కక్కి అల్లంత దూరాన ఉన్న మిల్లు దగ్గర ఆ బస్తాలన్నీ దింపినపుడు అక్కడి ఆసామీ ఈ చీటీని చూసి “అలాగే” అని ఓకే చేసేవాడట. ఇన్నన్ని బస్తాలు ఇంతంత బరువైనవి ఇంత దూరం లాగితే ఈ చిన్న చీటీముక్క వల్ల ఇక్కడి మనిషికెలా తెలిసిపోయింది? ఈ చిట్టి చీటీలో ఏదో మంత్రముందని విస్తుపోయేవాడట మా తాత.
నా కొడుక్కి కూడా ఈ చిట్టీ మంత్రమేదో తెలియాలనికూడా అనుకున్నాడట.
కనక నాలుగైదేళ్ళ వయసొచ్చాక మాస్టర్ అప్పలస్వామిని తీసుకెళ్ళి ఓ పచారీకొట్టు కోమటాయన దగ్గర పనిలో కుదిర్చాడు.
పని అనగా బియ్యం, ఉప్పూ, పవ్పులూ, చింతపండు లాటి వాటిని కాటాలో తూకం వేస్తూ సవాశేరూ, అర్థశేరూ, వీశె అని లెక్కగట్టి కస్టమర్లకి పొట్లాలు కట్టి ఇవ్వాలి. అవే మేథమాటిక్స్.
మధ్యాన్నం తిండీ నిద్రకు ముందు కోమటాయన
మా నాన్నకి పెదబాలశిక్ష సుమతీ శతకం, వేమన పద్యాలు, ఎరువు, నలుపు, తెలుపు, పసుపు పద్యాలు చెప్పాడు. అంటే పలకా పుస్తకాలుండవు. చెప్తుంటే వల్లెవేయాలంతే. ఇలా రెండేళ్ళు గడిచాక నువు నాలుగో తరగతి పాసయ్యావు
పొమ్మన్నాడు పెద్దాయన.
హమాలీగా చాల పెద్దపెద్ద వాళ్లతో హై కనెక్షన్స్ ఉన్న తాతయ్య ఇన్‌ప్లూయన్స్ ఉపయోగించి కొడుకుని ఒక చిన్న లైబ్రరీలో బోయ్‌గా అపాయింట్ చేయించాడు. లైబ్రరీని రోజూ తుడిచి శుభ్రం చేసి, కుండలో నీళ్ళు పట్టి, డైలీ పేపర్లంటినీ పెద్ద అట్టలకు కుట్టి, రాక్‌లలో పుస్తకాల దుమ్ము దులిపి సర్ది, వచ్చిన చదువరులందరికీ అడిగినప్పుడల్లా మంచినీళ్ళివ్వడం పని. దీనివల్ల జీతం గీతం పెద్దగా రాదు. కానీ మా తాత కొంచెం రిచ్ హమాలీ.
పెళ్ళాం చెవులకీ, ముక్కుకీ మెళ్ళో బోల్డంత బంగారం. చేతులకి బంగారు గాజులూ, కాళ్ళకి వెండి కడియాలూ, అది కూలికి సంపాదించిన రూపాయి బిళ్లల్తో పిటపిటలాడే చిన్న బిందె లాటి పెద్ద పిడత. రోజు గడవడానికి బెంగలేదు. కొడుకు కూలి చేయక్కర్లా. చిట్టీ మంత్రం తెలుసుకుంటే చాలు.
సర్టిఫికేట్ లేని నాలుగో తరగతి క్వాలిఫికేషన్‌తో తెలుగు పేపర్లన్నీ కూడబలుక్కుని చదువుతూ తెలీని పదాల గురించి లైబ్రరీలో చదువర్లను అడుగుతూంటే వాళ్ళూ ముచ్చటపడి ఓపిగ్గా మన బాలకార్మికుడికి చెప్పేవారు. ఏళ్ళుగడిచేకొద్దీ రాక్‌లలో పుస్తకాలు
చదవడం మొదలెట్టాడు బోయ్ అప్పలస్వామి. ఇదంతా చూసి “నువు హిందీ చదివి పరీక్షలు కట్టరా అబ్బాయ్ నే చెబుతాగా” అన్నాడో పెద్దాయన. దినదిన వ్రవర్ధమానమవుతున్న కుర్ర అప్పలస్వామి మెల్లగా ప్రాథమిక, మాధ్యమిక, ఉత్తమ లాంటి పరీక్షలు పాసైపోయాడు. ఇంట్లో గుడ్డిదీపం దగ్గర పుస్తకాలు తెరిచి పాఠాలు బిగ్గరగా వల్లెవేస్తున్న కొడుకుని చూసిన తల్లిదండ్రులకి… ఆశ్చర్యమో, ఆనందమో తెలీక బిక్కచచ్చిపోయారు. వంశంలోనూ, ఇంటావంటా లేని పుస్తకం
ఇంట్లోకి రాడమేటి?
దాన్ని కొడుకు గడగడా చదవడమేంటి?
గిరీశం, వెంకటేశం ఇంగ్లీష్ రైమ్స్ చెప్పుకుంటున్నపుడు వెంకటేశం తల్లి తబ్బిబ్బయిన దానికి ఇంటూ వంద అని ఈ కూలి దంపతుల ఆనందాన్ని లెక్కేసుకోవచ్చు.
*** *** ***
స్వతంత్ర పోరాటానికి గట్టి దన్నునిచ్చే హిందీ పత్రిక “ప్రభాత్”లో నెహ్రూగారి వ్యాసాన్ని అప్పలస్వామి చదివాడు. అందులో “ఇంగ్లీష్ ఈజ్ ది విండో ఆఫ్ ది వర్‌ల్డ్” అని నెహ్రూ రాశారట. వెంటనే ఎ.బి.సి.డి.ల చార్ట్ కొనితెచ్చి వల్లెవేసి, లైబ్రరీలో ఇంగ్లీషు నేర్పే పుస్తకాలు తిరగేసి అనుమానం వచ్చినప్పుడల్లా, అర్ధం కానవుడూ, లైబ్రరీలోని జనాన్ని వేపుకుతిని పదాలూ, వాక్యాలూ కూడబలుక్కోడాలూ,
సొంత ఉచ్భారణలతో కొంత నేర్చుకున్నాడు. డిక్షనరీలు తిరగేశాడు. గుడ్డిదీపం దగ్గర
దొరల భాష లాంటిది వినవస్తుంటే
తల్లిదండ్రులకు తెల్లదొరలయింత ఫీలింగ్.
చదువుతూ దినదిన ప్రవర్మమానమవుతున్న స్వామి, అతని మిత్రులు టీనేజ్ టీమ్‌గా తయారయ్యారు. గాంధీజీ పిలుపునందుకున్నారు.
స్వాతంత్రం వచ్చేవరకూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదని ఆ మాగ్నిఫీషియంట్ సెవెన్ భీషణ ప్రతినబూనారు.
ఇక మావూళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో చివరికి జిల్లా అంతా తిరగడం ప్రదర్శనలు, నినాదాలు, సాయంత్రం బహిరంగ సభలూను. అందులో స్వామి ఉద్రేకపూరిత ప్రసంగాలూ, తెల్లదొరలపై చెణుకులూ, దేశం దుస్థితి మీద కన్నీళ్ళు పెట్టించే వాక్యాలూ సకల
రసాలూ ఒలికించి జనాన్ని కట్టిపడేసేవి. సభానంతరం పురప్రముఖుల్లో ఒకరింట్లో
భోజనాలు ఆనవాయితీ.
అలా ఒకసారి వడ్డిస్తున్న ఓ అమ్మాయి స్వామి మీద మనసు పారేసుకుంది. చేసుకుంటే ఈయన్నే అని తండ్రికి చెప్పింది. ఆయనా సంతోషించి విషయం చెప్పాడు. స్వతంత్రం వచ్చేవరకూ మేమెవ్వరం పెళ్ళిళ్ళు చేసుకునే బాపతు కాదని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది గుంపు.
మర్నాడు ఆ అమ్మాయి
నూతిలో దూకి చనిపోయింది.
ఆవిడ పేరు గంగ.
*** *** ***
గాంధీ గారికి అనుంగు శిష్యుడూ, కాంగ్రెస్ అగ్రనాయకుడూ అయిన భోగరాజు పఠాభి సీతారామయ్య ఓసారి ఏలూరొచ్చారు.
కాంగ్రెస్ సభ. ఇసకేస్తే రాలనంత జనం.
“రష్యాలో ఫాక్టరీలూ, పొలాలూ అన్నిటినీ జాతీయం చేస్తారు. ఆఖరికి ఆడవాళ్ళని కూడా జాతీయం చేస్తారేమో” అని పఠాభి వెటకారంగా అన్నారు.
జనంలో దూరంగా ఉన్న గుంపుభుజాల మీది నుంచి స్వామి ఒక రేకు డోమ్ పట్టుకుని “రష్యాలో మహిళల ప్రగతి” అని మీరు రాసిన పుస్తకంలో (ఫలానా పేజీ ఫలానా పేరాలో) అక్కడి ప్రభుత్వాన్నీ మహిళలనూ ఎంతగానో పొగిడారు. ఇప్పుడిలా అంటున్నారు. పుస్తకం అబద్ధమా, ప్రసంగం అబద్ధమా? అని అడగ్గా పఠాభి లెక్కచేయకుండా ప్రసంగిస్తూనే ఉన్నారు.
కాని వదలకుండా స్వామి మళ్ళీ మళ్ళీ డోమ్‌లో అరుస్తూనే ఉన్నందువల్ల ఆయన స్పీచ్
ఆపాడు. స్టేజి దిగి జనం మధ్యలోంచి నడుచుకుంటూ అల్లంత దూరాన ఉన్న గుంపు దగ్గరకొచ్చి డోమ్ పట్టుకున్న స్వామి భుజాల మీద చేతులేసి
“నిజమే నీలాంటి వాళ్ళు పదిమందుంటే దేశం ఎంతో ముందుకుపోతుంద””ని పొగిడి వెళ్ళిపోయారు.
ఏం జరిగిందో తెలీక తత్తరపడుతున్న కాంగ్రెస్ నాయకులు రెప్పలార్చే లోపే అంతా అయిపోయింది.
కుర్రాళ్ళంతా స్వామిని భుజాలకెత్తుకుని ఊరేగింపుగా నినాదాలు చేస్తూ పేటకు వచ్చేసారు. మర్నాడు “హిందూ” పత్రికలో “యూత్ డిస్టర్స్ పఠాభీస్ మీటింగ్” అనే పెద్ద హెడ్డింగ్‌తో వార్త వచ్చింది.
అటు కూలినాలి జనంతోనూ, ఇంగ్లీషు పేపర్లు
చదివే మిడిల్ క్లాస్‌లోనూ స్వామి పేరు మోగింది.
మరోసారి లెనిన్‌కు చాలా సన్నిహితుడూ, లెనిన్ రాసిన “కలోనియల్ థీసిస్”కు “సప్లిమెంటరీ థీసిస్ రాసి లెనిన్ ఆమోదం పొందిన ఎమ్.ఎన్.రాయ్ ఏలూరొచ్చారు. ఆయన ఇంటలెక్చువల్ జైంట్ అనీ, స్వామిలాంటి స్మాల్‌టౌన్ బోయిస్ ఆయన ముందేమీ కాదనీ అందరికీ తెలిసిందే. అయినా ఆయననేదో అడగాలి, ఏదో చేయాలి అనుకుంటూ ఈ గుంపంతా సభ దగ్గర చేరింది. విశాల ఫాలభాగం, చెట్టంత పర్సనాలిటీ, భయపేట్టేంత అందంతో ఠీవిగా ఎమ్.ఎన్.రాయ్… చేతులు కట్టుకుని గడగడలాడుతూ వాళ్ళంతా.
“ఎనీ క్వశ్చన్స్?” అడిగాడయన.
స్వామి లేచి మేకపోతు గాంభీర్యంతో
“తమరిని మూడు ప్రశ్చలడుగుతా.
మొదటి ప్రశ్నకు జవాబు చెబితేనే రెండో ప్రశ్న అడుగుతా. అలాగే మూడోది కూడాను. అని కండిషన్ పెట్టాడు. ఆయన చాలా రెక్‌లెస్‌గా ఓకే అన్నాడు. “మొదటిది… సెకండ్ ఇంటర్నేషనల్ (కొమింటర్న్) మిమ్మల్ని ఎందుకు బహిష్కరించింది?” అడిగాడు స్వామి. రాయ్ భృకుటి ముడిచి అడిగిన వాడివంక తలెత్తి చూసి “నో” అన్నాడు. అయితే మిగతా రెండు ప్రశ్నలూ అడగం అంటూ యువకుల గుంపంతా వాకౌట్ చేసింది. ఊళ్ళో అభం శుభం తెలీని వాళ్ళంతా “స్వామి ప్రశ్నకి రాయంతటి వాడే జవాబు చెప్పలేక పోయాడ”ని బుగ్గలు నొక్కుకున్నారు. ఆ కారణంగా స్వామి మరీ పెద్దనాయకుడై పోయాడు.
ఇంతకు ముందే ఏళ్ళతరబడి స్వామి, అతని గ్యాంగ్ కలిసి ఏలూరులో “లేబర్ ప్రొటెక్షన్ లీగ్” స్థాపించారు. పట్నంలోని ఏకైక పరిశ్రమ శ్రీకృష్ణా జూట్ మిల్స్‌లో బలమైన ట్రేడ్ యూనియన్‌ను పెట్టి మేనేజ్‌మెంట్‌తో పోరాడి జీతాలు పెంచుకున్నారు.
ఊళ్ళో అల్యూమినియం, బీడీ, చుట్ట, తివాసీ కార్మికసంఘాలు, పాకీసంఘం ఇంకా ఎన్నో యూనియన్‌లు పెట్టారు.
స్వతంత్ర పోరాటం ఉధృతమయింది. స్వామి, కొందరు మిత్రుల్ని బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలా స్వతంత్రానికి ముందూ, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీపై నిషేధ కాలంలో, రాజమండ్రి కడలూరు, రాయవెల్లూరు లాంటి ఎన్నో జైళ్ళలో ఏళ్ళ తరబడి కారాగారం, కఠిన కారాగారం, ఒంటరిగా సెల్‌లో బంధించడం (సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్) అయింది. ఈ జైళ్ళలోనే కాంగ్రెస్ ప్రముఖులతో, తర్వాత కమ్యూనిస్టు అగ్రనేతలతో పరిచయాలయ్యాయి.
అన్నట్టు స్వతంత్రం వచ్చేవరకూ పెళ్ళీగిళ్ళి జాంతానై అన్న ప్రతిజ్ఞకు భంగం వాటిల్లెను. బంగారాలూ సింగారాలతో దిగిన ఓ చక్కటమ్మాయి సూర్యావతిని స్వామి చేసుకున్నాడు. పెళ్ళి ముచ్చట తీరక ముందే జైలుకి… తిరిగొచ్చి కొద్ది రోజులు ఉద్యమాలనీ, సమ్మెలనీ, ప్రదర్శనలూ, సభలూ, ఉపన్యాసాలు గడిచాక మళ్ళీ జైలుకి… ఆకాలంలోనే జ్యూట్‌మిల్ లో ఆరు నెలలకు పైగా సమ్మె జరిగింది. స్వతంత్రానికి ముందు జరిగిన సుదీర్ధమైన సమ్మె ఇదేననేవారు. అవునో కాదో తెలీదు. సమ్మెకాలంలో స్వామికి
యజమాని లునానీ కలలో కూడా అనుకోనంత డబ్బు ఆఫర్ చేసాడు. స్వామి నిరాకరించి సమ్మె సాగించాడు. చివరికి సక్సెస్. జీతాలు పెరిగాయి. స్వామి నిజాయితీని చూసి యజమాని నివ్వెరపోయాడు. అభిమానమూ పెంచుకున్నాడు.
ఇంట్లో పిల్లలెవరయినా అమ్మ దగ్గరకెళ్ళి
“నేనెప్పుడు పుటానమ్మా” అనడిగితే నాన్నగారు రాయవేలూరు జైలు నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేది. మరి అన్నయ్య ఎప్పుడు పుట్టాడని అడిగితే కడలూరుజైలు నుంచి వచ్చాక అనేది.
అలాగే మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా అంటే స్టేజి మీద దండల పెళ్ళే. అప్పుడు ఫలానా పెద్ద కమ్యూనిస్టు నాయకులొచ్చి ఉపన్యాసాలిచ్చారు. “అంతేనా” అంటే “చివర్లో చాలాసేపు పాటలు పాడారు.
నేనేమో “స్టాలినో నీ ఎర్రసైన్యం” పాట పాడాను” అనేది. అమ్మా మరి నన్ను ఉయ్యాల్లో వేసినపుడేం చేశారు అంటే, పక్కింటి వరలక్ష్మి వ్రతం పాట పాడింది. నేనేమో నీ ఉయ్యాల ఊపుతూ
“మాస్కో పాలిమేరలోన మారణ యంత్రాలు పెట్టి” అని హిట్లర్ మీద పాడాను – అని చెప్పేది.
అలా ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు
ఆడపిల్లల్ని కనింది.
ఆస్తిపాస్తులున్నందువల్ల విశాలమైన ఆవరణలో ఇల్లూ, చుట్టూ ప్రహరీగోడ, దానివెంట రకరకాల చెట్లూ, పూలతీగలూ, కూరగాయల పాదులూ, పెద్ద గడ్డివామీ, ఇంటి వెనక పొడుగాటి పాకలో ఏడెనిమిది గేదెలూ, వాటి దూడలూ, ఏడాదికి సరిపడా ధాన్యం ఉండే గాదె, ఖరీదైన పర్ణశాలలా ఉండేది.
పెరట్లో పిల్లలు చదువుకోడానికి ప్రత్యేకంగా మరో చిన్న ఇల్లు. నిర్భంధాలూ, నిషేధాలూ అన్నీ ముగిశాక ఊర్లో కమ్యూనిస్టుపార్టీ బలమైన శక్తిగా ముందుకొచ్చింది. మాస్‌ఫాలోయింగ్ గల వక్తగా, నాయకుడిగా స్వామి మరింత ఎదిగాడు. పశ్చిమగోదావరిలోనే కాక కృష్ణా, తూర్పుగోదావరుల్లో చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య,
తరిమెల నాగిరెడ్డి సభలు జరిగితే వక్తగా స్వామిని కూడా పిలిచేవారు.
ఒకసారి తేలప్రోలు (కృష్ణా) లో సుందరయ్యగారి సభకు స్వామిని కూడా ఆహ్వానించారు. వందకు పైగా ఎడ్లబళ్ళను మనుషులే లాగుతూ అగ్రభాగాన ఇద్దరికీ గులాబి దండలేసి ఊరేగించారు.
ఎన్నికల కాలం వచ్చింది. ఎప్పుడూ కౌన్సిలర్‌గా ఖాయంగా ఎన్నికయ్యే స్వామి ఒకసారి మునిసిపల్ చైర్మన్ అయ్యాడు. రెండున్నరేళ్ళు ఆ పదవిలో ఉన్నాడు. పేట జనానికి పండుగ. కొంతమందికి ఉద్యోగాలోచ్చాయి. పేటలో అక్కడక్కడా మునిసిపల్ పంపులు పడ్డాయి. చైర్మన్ అయిన మర్నాడే మునిసిపల్ సిబ్బంది స్వామి ఇంటికి కదిలి వచ్చింది. ఇంటి ఆవరణలో మంచినీటి పంపూ, ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిగించడానికి హడావుడి పడుతున్నారు. ఇంతలో స్వామి ఎక్కడినించో ఊడిపడి పనంతా ఆపుచేయించాడు. సోషలిజం ఎలాగూ కొద్దికాలంలో వచ్చేస్తుంది కనుక ఊరంతా విద్యుద్దీపాలు, ఇంటింటికీ కరెంటూ వస్తుందని చెప్పాడు.
రోజూ సాయంత్రం ఇంటికి చేరే పార్టీ కార్యకర్తలూ, కార్మికులందరికీ పత్రికల్లో వార్తలూ, వాటిమీద విశ్లేషణలూ చెప్పేవాడు. “స్టాలిన్ సీక్రెట్ రిపోర్ట్‌ను కృశ్చేవ్ బయట పెట్టినపుడు పార్టీకి పెద్ద కుదుపొచ్చింది. స్వామి ఇవన్నీ ఇంగ్లీషు పత్రికల్లో చదివి జనానికి చెప్పేవాడు.
క్యూబాలో విప్లవం వచ్చి “మిసైల్ సంక్షోభం”లో అటు కెనెడీ ఇటు కృశ్చేవ్‌ల మధ్య బుల్లి క్యూబా వల్ల మరో ప్రపంచయుద్ధం వస్తుందా అని ఆందోళన పడే జనానికి జవాబు స్వామి చెప్పాల్సిందే. సోవియట్ చైనాల చరిత్ర మీదా, అక్కడి నాయకుల గురించీ వందల పేర్లతో వివరంగా వినొచ్చు. స్టాలిన్ కాకుండా యాకొవ్ స్వెర్డ్ లోవ్ నాయకుడైతే బావుండేదనీ, లెనిన్ వీలునామాలో ఇదే రాశాడనీ అనేవాడు.
రజనీ పామీదత్ “ఇండియా టుడే” నెహ్రూ “డిస్కవరీ ఆఫ్ ఇండియా” పారాయణం మామూలు.
“లింక్”, “బ్లిట్ట్” వీక్లీలు ప్రతివారం ఇంటికి తెచ్చేవాడు. సోవియట్, చైనా పత్రికలన్నీ ఇంటికొచ్చేవి.
చదువు నాన్‌స్టాప్. మార్క్స్, ఎంగెల్స్ జీవితాల్లో నాటకీయమైన ఘట్టాన్ని చెబుతుంటే జనం చెవులు రిక్కించి వినేవాళ్ళు. జాగ్రఫీ పిచ్చి బాగా వుండేది. ఆసియా, యూరప్‌లలో ఏ దేశం పక్క మరో దేశం ఎటుంటుందో, రెండు ప్రపంచ యుద్దాల్లో సైన్యాలు ఎటునుంచి ఎటు కదిలి ఎక్కడ తలబడ్డాయో చెబుతుంటే నిజంగా అక్కడికెళ్ళి అవన్నీ చూశాడేమోనని విస్తుపోయేవాళ్ళు.
కాలం గడిచింది. ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని స్వామి అసంతృప్తి చెందాడంటారు. 1964లో పార్టీ చీలింది. ఆయన
సి.పి.ఎం పక్షం. ఆ పార్టీ చీలింది. ఆయన నాగిరెడ్డి పక్షం. అదీ చీలింది. మావో చెప్పేది ఏదైతే దాని పక్షమయ్యాడు. సాయుధ
పోరాటపంథా తప్ప మరోదారి లేదన్నాడు. రామాయణం, మహాభారతాల్లో సమస్యలన్నీ ఆయుధాల వల్లే పరిష్కారమయ్యాయనేవాడు.
జూట్‌మిల్, ఇతర ట్రేడ్ యూనియన్‌ల నాయకత్వాన్ని జూనియర్లకు అప్పగించాడు.
ఆస్తి కరిగింది. చేతికందిన పిల్లలతో ముందు విజయవాడకూ, తర్వాత హైదరాబాద్‌కూ వచ్చాడు. ఇంత మహా నక్సలైటు కూడా సోవియట్
యూనియన్ కూలిపోయిందంటే బెంగపడ్డాడు. హైదరాబాద్‌లో ఇంటికొచ్చే జర్నలిస్టులతో చరిత్ర, ఫిలాసఫీ చర్చలు పెట్టేవాడు.
82 ఏళ్ళ వయసులో తన ప్రయాణం చాలించాడు.
– Mohan, Artist
*** *** ***
వివరణ: మా నాన్న ఏలూరు మున్సిపాలిటీకి పూర్తి స్థాయి చైర్మన్ కాదు. కొన్ని నెలలు మాత్రం ఇంచార్జి చైర్మన్ గా ఉన్నారని నాకు గుర్తు. మోహన్ పొరపాటు పడ్డాడని అనుకుంటున్నాను.
– Taadi Prakash. 9704541559
Share this Article