Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే జరిగితే… రేవంత్ రెడ్డి చెప్పినట్టు చరిత్రాత్మక ముందడుగే!

June 25, 2026 by M S R

.

‘పంచాయితీలు కావాలా, పరిష్కారాలు కావాలా అనడిగితే పరిష్కారమే కావాలంటాను’ రేవంత్ రెడ్డి ఈరోజు కర్నాటకలో వెల్లడించిన మాట. అవును, దీని వెనుక ఓ కీలక పరిణామం ఉంది. అది కేంద్రం మధ్యవర్తిగా రాష్ట్రాలు అంతర్రాష్ట్ర నదీప్రవాహాల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకోవడం! దీనికి వేదిక, సందర్భం ఏమిటంటే… మొత్తం క్రెస్ట్ గేట్ల మార్పిడి జరిగిన తుంగభద్ర డ్యామ్ రీఓపెనింగ్ కార్యక్రమం.

నిజంగానే ఇది కొత్త విషయం మనకు… కానీ కేంద్రం కొన్నిచోట్ల దీన్ని అమలు చేసి చూపించింది. ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం… అంతర్రాష్ట్ర నదీజలాలు అంటేనే పంచాయితీలు. ఏళ్ల తరబడీ కేసులు, తెగని వివాాదాలు. ట్రిబ్యునళ్లు, కోర్టులు. ప్రాంతాల నడుమ ఉద్రిక్తతలు. కావేరిపై కర్నాటక- తమిళనాడు వైరం తెలుసు కదా.

Ads

వాటికి తోడు ఒక్కో నదిలోని నీటిలభ్యత, నికరజలాలు, మిగులుజలాలు, వరదజలాలు (కొత్తగా చంద్రబాబు కనిపెట్టిన వృథాజలాలు) వంటివి ఎప్పుడూ తేలవు, ఏ ప్రాజెక్టుకు ఎంత నికరమో, ఏది అధికారికమో తెగదు. (జలయజ్ఞం సమయంలో వైఎస్ అన్నాడు కదా, ఇవేమైనా కెమికల్ ఫ్యాక్టరీలా? కట్టేయడమే అని) ఎవరు ముందుగా నీటివినియోగ ప్రాజెక్టులు కట్టేసుకుంటే వాళ్లే తోపులు, వాళ్లకే హక్కుభుక్తం అన్నట్టు మారింది.

  • తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినా, పదేళ్లలో కేసీయార్ తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది కూడా ఇదే. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ, కృష్ణా ప్రాజెక్టుల విషయంలో…! ఇప్పుడు పాటిల్ ఓ ఆచరణాత్మక పరిష్కారాన్ని ప్రతిపాదించాడు ముగ్గురు ముఖ్యమంత్రులకు (ఏపీ, కర్నాటక, తెలంగాణ). కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కేంద్రం సమక్షంలో ఒక ఎంఓయూ చేసుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చారు.

దీన్ని ముగ్గురు సీఎంలు స్వాగతించారు, పరస్పరం సమ్మతితో కుదర్చుకునే ఒప్పందాలతో కొన్ని సమస్యలు పరిష్కారమైతే అంతకన్నా కావల్సింది ఏముంది? ఈ సందర్భంగా పాటిల్ కొన్ని ఉదాహరణలు చెప్పాడు.

  • నర్మదా డ్యాం నుంచి సర్దావర్ సరోవర్ డ్యాం ద్వారా సబర్మతి నదికి చేసిన నది అనుసంధానం.
  • కెన్, బెత్వా నదుల మధ్య అనుసంధానం.
  • రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య పార్వతి, నేవాజ్, కాళీ సింధ్, చంబల్ నదుల సంధానం.

“నీళ్ల కోసం ఇక తాము కొట్లాడుకోమంటూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాకు హామీ ఇచ్చారు. మా మాట వింటామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా అందరికీ మేలు జరిగేలా ఒక చక్కటి నిర్ణయం అమలైతే తమకు సంతోషం అని చెప్పారు. దక్షిణాది చరిత్రలో ఇదొక మరిచిపోలేని రోజు ” అని పాటిల్ చెప్పారు.

ఈ పరిష్కార ప్రయత్నాల్ని స్వాగతించాలి. కేంద్రం ఏ ప్రతిపాదనను ముందుపెడుతుందో చూడాలి. ఐతే కొన్ని చిక్కులూ ఉంటాయి. ప్రభుత్వాలు ఏం చేసినా కట్టెలు పెట్టి గాయిగత్తర చేయడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉండటం. (కర్నాటకకు ఆ ప్రాబ్లం లేదు, ప్రతిపక్షంలో బీజేపీ కాబట్టి, మధ్యవర్తి కేంద్ర బీజేపీ ప్రభుత్వమే కాబట్టి డీకేకు ఆ తలనొప్పి లేదు)

  • ఏమీ లేకుండానే గాయిగత్తర రేపే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డికి ఓ నిత్య శిరోభారం. (రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం, శివకుమార్ కోసం తెలంగాణ జలప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడంటూ రేపు హరీష్ రావు విరుచుకుపడతాడు చూడండి, ఆల్రెడీ తుంగభద్ర దగ్గర మీటింగ్ అనగానే నిన్ననే ‘రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్టు కోసం తుంగభద్రకు ఎగువన కర్నాటక కట్టుకునే ప్రాజెక్టులకు ఓన్వోసీలు ఇచ్చేశాడంటూ మొదలు పెట్టాడు. అదొక నిరంతర బురద ప్రవాహం)

ఏపీలో చంద్రబాబుకు జగన్ తలనొప్పే, కానీ జగన్ క్యాంపు నుంచి ఎంతసేపూ కుల పంచాయితీలు తప్ప పెద్దగా జలతగాదాలపై అధ్యయనం, అవగాహనతో మాట్లాడేవాళ్లు లేరు. అది బాబుకు రిలీఫ్. ఐతే ఇక్కడ చాలా చిక్కుముళ్లు ఉంటాయి. కాకపోతే అందరమూ ఒక్కమాట మీదకు వద్దాం అని ముగ్గురు సీఎంలు ముందుకు రావడం మాత్రం ఖచ్చితంగా ఓ ముందడుగే.

తుంగభద్ర అంటే ఈ ముగ్గురు వోకే అంటే సరి, కానీ కృ‌ష్ణా అంటే మహారాష్ట్ర కలిసి రావాలి, ఆల్రెడీ ట్రిబ్యునల్ విచారణ ఇంకా సా-గు-తూ-నే ఉంది. అదే గోదావరి అయితే ఈ నాలుగు రాష్ట్రాలే కాదు, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలూ కలిసి రావాలి. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే కాబట్టి నిర్మాణాత్మక, ఆచరణాత్మక ప్రతిపాదనల్ని కేంద్రం రూపొందిస్తే… రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈరోజు చరిత్రాత్మక రోజు అవుతుంది, ఆ పరిష్కారాలకు, ఆ ప్రయత్నాలకు బీజం పడిన రోజు కాబట్టి!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంపేస్తారా? సోనమ్ వాంగ్‌చుక్‌ను చంపేస్తారా?
  • నో, నో – త్రీ ఇడియట్స్ హీరో పాత్రకూ ఈ సోనమ్ వాంగ్‌చుక్‌కూ లింకే లేదు !!
  • ఔను, నిజమే… ఆమె జీవితం ఓ పాఠ్యాంశం ఎందుకు కాకూడదు !!
  • లార్డ్స్‌లో రోహిత్ శర్మ చివరి మ్యాచ్? వీడ్కోలు అనివార్యమేనా?
  • ప్రైవేటు కంపెనీల ‘స్పేస్’లోకి ఇస్రో మేధోవలస ! ఓ నిశిత పరిశీలన !!
  • BRS – a political paradox ! బీఆర్ఎస్ అంటేనే ఓ పేద్ద విరోధాభాసం !
  • సుప్రీం సరేనంది ! మమత మార్క్ ముస్లిం రిజర్వేషన్లకు తెర !!
  • తీస్తా-3 ఓ వార్నింగ్ బెల్..! మేడిగడ్డతో ఆటలాడితే అసలుకే మోసం !!
  • ఆమె మాకొద్దు, మాకసలే వద్దు… శ్రీలీలకు ఏమిటి ఈ దురవస్థ !
  • బుల్‌డోజర్ సర్కారు! ఆ యూనివర్శిటీ 38 బిల్డింగులనూ కూల్చేస్తారట!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions