Bharadwaja Rangavajhala…….. భార్యా భర్తలు ఇలా సంగీతంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటారూ ?
మొన్న మీరేమన్నారూ …. వలచి రాగంలో వెన్నెలరేయీ ఎంతో చలీ చలీ అన్లేదూ …
అదెప్పటి మాట వేసవి రాకపూర్వం … ఇప్పుడు ఇందాక వర్షం పడ్డాక పరిస్తితి చూస్తుంటే … వలచిలోనే నా రాణి కనులలోనా అని పాడాలనుంది.
Ads
సర్లెండి … ఎవరేనా వింటే నవ్వుతారు… వసంతగాలికి వలపులు రేగ అని పాడే వయసా మనది వలచి రాగంలోనే …
అందుకే అనేది కాస్త జైజవంతి వినిపించినా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ అన్నారు శ్రీశ్రీ వలచిలోనే
మరదే … ఏం మాట్లాడినా … ఆనందభైరవిలో పలుకే బంగారమాయెరాఅన్నట్టుండాలి … అంటారు .. మనసున మనసై అట …
మాకు తెల్సులెండి … శివరంజనిలో కూడా మెరిసే మేఘమాలికా అని రొమాన్సగలం తెల్సా మీకు ?
అవునూ అదేదో హిందీ పాట కదూ …
అదే మరి సూరజ్ మూవీలో బహారోం ఫూల్ బర్సావో పాటే అది …
అవునూ అది కాపీ రాగం అనుకుంటా …
సరే కాఫీ నుంచీ వచ్చినదే శివరంజని … ఇది హిందూస్తానీయే … విషాదానికి వాడే శివరంజనిని శంకర్ జైకిషన్ లు ఇలా రొమాన్సుకు వాడి చేసిన ఆ ప్రయోగం రాజేశ్వర్రావుకు ఎంత ఇష్టమో తెల్సా …
అవును … అయినా ఈ శాస్త్రీయ రాగాల ఆధారంగా పాటలు కంపోజ్ చేస్తారని చెప్పుకోడమే గానీ … కొన్ని పాటలు మరీ ఇదిగా ఉంటాయి కదా ..
ఏమిటా ఇదిగా అనిపించిన పాటలు ?
మోహనలో ఇళయరాజా చేసిన ఎన్టీఆర్ పాట … దాదాదా దాస్తే దాగేదా పాట కాస్త ఎబ్బెట్టుగా అనిపించదూ …
ఏం ఉండదు … అందులో ఆత్రేయగారి సాహిత్యం ఎంత బాగుంటుంది … ఏ తాడైనా మూడే ముళ్లు సంబరమంతా మూణ్ణాళ్లూ ఎవడ్రాస్తాడండీ అలా …
ఆ ఇళయరాజానే చేసిన పాటింకోటుంటుందండీ మోహనలో …అది బానే ఉంటుంది ..
ఏంటదీ వాణీ జయరాం పాడిందీ నినుకోరీ వర్ణం అదేనా ?
అదే అదే … ఇంకా వే వేలా గోపెమ్మలా ..కూడా బానే ఉంటుంది కానీ … అక్కడక్కడా అన్యస్వరాలు వాడాడు. కాస్త ఎక్కువగానే అనుకోండి …
నాకైతే అమ్మాయీ …మోహన అనగానే లాహిరి లాహరిలోనే … అనుకో …
ఎప్పుడూ మీకదే రంధి నాకు తెలియదా ఇవన్నీ కాదుగానీ ఆ సింధుభైరవిలో వినిపిస్తుందే … తిరుపతి దేవుడి పాటండీ ..వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం ఎంత హాయిగా ఉంటుందీ మీ సినిమా పాటలకన్నానూ …
నువ్వలా భక్తి వైపు పరుగులు తీయకు … లలిత ప్రియకమలం పాట భలే ఉంటుంది కదా… ఇళయరాజా లలిత్ లో చేశాడు ఈ పాట …
లలిత్ లోనే చేశాడుగానీ ఏమిటో ఆ బాలచందర్ గోల … ఆ అమ్మాయి ఆలాప్ తీయడం హీరో లలిత కదా నీ పేరు అనడం వరకు సరే … అయినా లలితా శివజ్యోతి అని పేరెట్టడం వెనక్కాల … గణేశ్ పాత్రో ఉండుండేమో అని నా అనుమానం …
ఉండుంటాడులే … కానీ నాద వినోదము అంటూ సాగరసంగమంలో కమలహసనూ జయప్రదా డాన్స్ చేస్తారు కదా అదీ లలితేగా …
పూర్తిగా కాదు … అమావాస్య చంద్రుడులో సుందరమో సుమధురమో లలిత్ అనుకోవచ్చు …
ఇంకేమిటి విశేషాలు …?
ఆ ఏముంది లెండి … శుద్ద ధన్యాసిలో … పాటందుకోవాలనుంది …
ఏమిటదీ ఎంత వారలైన కాంత దాసులే అనా … సరే కానీ …
హహహ
ఇలాగానీ మాట్లాడుకుంటే …
జనాలకు పిచ్చెక్కేయదూ …. జంధ్యాల టైపులో ఏదైనా సినిమాలో పెట్టాలి …
Share this Article