Taadi Prakash…….. పెళ్ళి… దాని గుట్టు పూర్వోత్తరాలు… 1984 : An eventful year
ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ తో విరుచుకుపడింది. అమృత్ సర్ స్వర్ణదేవాలయం మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. తీవ్రవాద సిక్కు నాయకుడు సంత్ జర్నయిల్ సింగ్ బింద్రన్ వాలేని కాల్చి చంపేశారు. ప్రతీకారేఛ్ఛతో రగిలిపోయిన సిక్కులు ఇందిరా గాంధీని హత్య చేశారు.
దేశం కంపించిపోయింది. రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు మూడువేలమంది సిక్కుల్ని
Ads
భయానకంగా హతమార్చారు. రాజధాని
ఢిల్లీలో నెత్తుటి కాల్వలు పారాయి.
‘ఉదయం’ దినపత్రిక రాబోతోంది. హైదరాబాద్ లో 70 మంది యువ జర్నలిస్టులకి ట్రయినింగ్ ఇన్ ఛార్జిని నేను. ఓ రోజు డెస్క్ లో ఉన్న మృణాళిని గారు భోపాల్లో గ్యాస్ లీకయిందండీ, ఇద్దరు చనిపోయారు అన్నారు. గంటలో 20మంది, ఆ సాయంత్రానికి 2500 మంది విషవాయువుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. చేతిలో పేపర్ లేదు ‘ఉదయం’ 1984 డిసెంబర్ 29న ప్రారంభం అయింది. అంచేత దేశాన్ని కుదిపేసిన గొప్ప
ఈవెంట్స్ ని మేం రాయలేకపోయాం.
అప్పుడే ఖలిస్థాన్ టెర్రరిస్టులు 254మంది ప్రయాణిస్తున్న విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్ కి మళ్లించారు. చివరికి వాళ్ళు లొంగిపోవడం… సుఖాంతం అయింది. మేమంతా ఇరానీ చాయ్ హోటళ్లలో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుండేవాళ్ళం.
జులై చివరిలో విజయవాడ నించి మా చెల్లాయి శకుంతల నాకో టెలిగ్రామ్ పంపింది.
“నళిని మా ఇంట్లోనే ఉంది. నువ్వు వెంటనే వస్తే బావుంటుంది” అని.
ఎలాగో ఖాళీగా ఉన్నాను. గాలికి తిరుగుతున్నాను గనక, యీ డిజాస్ట్రస్ ఇయర్ లోనే పెళ్లి చేసేసుకుంటే సింబాలిగ్గా ఉంటుంది కదాని విజయవాడ బస్సెక్కాను. ఒకరోజు కాలక్షేపం చేసి,
నళినీ నేనూ నర్సాపురం వెళ్ళాము.
మావగారు పడాల శ్యామసుందర్రావు పశ్చిమగోదావరిలో పేరున్న కమ్యూనిస్టు నాయకుడు. “మేం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం” అని వీలయినంత మృదువుగా చెప్పాను. ముందే ఆయనకి తెలుసు గనక, “సరే బాబూ, ఎప్పుడూ?” అన్నారు. “రేపు వీలవుతుందా?” అన్నాను. వీడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నారేమో, “కొన్నిరోజులు ఆగరాదూ, ఏర్పాట్లు చెయ్యాలిగా” అన్నారు. “నేను మళ్ళీ ఆఫీసుకి వెళ్లిపోవాలి. త్వరగా అయితే…” అని బ్లాక్ మెయిల్ చేసాను. ఆగస్టు ఐదో తేదీ అనుకున్నాం. అంటే రెండురోజుల్లో. గులాబీ దండలు, స్వీట్లూ, ఇంకా అంటూ శ్యామసుందర్రావు గారు ఒకాయనతో చెపుతున్నారు.
ఆదర్శం పిచ్చి ముదిరి ఉన్న నేను పెద్దాయన్ని పిల్చి, “దండలూ గిండలూ జాన్తా నై. నో హంగామా. సింపుల్ గానే జరిగిపోవాలి” అని కటువుగా చెప్పాను. ఆయన తల, చెంపల నించి చెమటధారగా కారడం చూసి ఇబ్బంది పడ్డాను. రెండుసార్లు ఎమ్మెల్యే, నిజాయితీకి ప్రతిపదార్థంగా బతికిన ఆయనతో ఎవరూ గట్టిగా మాట్లాడడానికి కూడా సాహసించరని తర్వాత తెలిసింది. ఆయన మౌనంగా గంభీరంగా ఉండిపోయారు. “అలాగే చేద్దాం” అన్నారు. శ్యామసుందర్రావు గారి చిన్నకూతురి పెళ్ళంటే ఊరుఊరంతా వచ్చేస్తారని కొన్నిరోజుల్లోనే అర్థమైంది.
ఓ పెద్ద స్కూలు ఆవరణకి ఐదో తేదీ, ఉదయం11 గంటలకి నళినీ, నేనూ సోది మాట్లాడుకుంటూ వెళ్లాం. ఆరేడు వందలమంది ఉన్నారు. వాళ్ళెదురుగా దోషుల్లాగా నించున్నాం. “ఏలూరు, మన తాడి అప్పలస్వామి గారబ్బాయి ప్రకాషూ, మా అమ్మాయి నళినీ వివాహం” అని ముక్తసరిగా చెప్పి ఊరుకున్నారు, బాగా హర్టయిన శ్యామసుందర్రావు గారు. వచ్చినవాళ్ళందరికీ రెండు మూడుసార్లు నమస్కారాలు పెట్టి, కొందరు పెద్దలకి షేక్ హ్యాండ్ లు ఇచ్చి, అంతా పదినిమిషాల్లో ముగించుకుని, నళినీ, నేనూ పిచ్చిజోకులు వేసుకుంటూ ఇంటికి నడిచి వెళ్తున్నాం.
ఇస్త్రీ చీర సర్దుకుంటూ, ఇంటి మెట్లు దిగి గబగబా వస్తున్న అత్త కాంతమ్మగారు, “ఎన్నింటికి పెళ్ళి?” అని అడిగారు. “అంతా అయిపోయింది గానీ, నువ్వు ఇంట్లోకి పద” అంది నళిని. ఆవిడ ఆశ్చర్యాన్ని మేం పెద్దగా పట్టించుకోలేదు. ఆ మధ్యాహ్నం చాలామందికి భోజనాలు. మేం పెళ్ళి చేసుకోవడం ఏంటి, వాళ్ళెవరో వచ్చి భోజనాలు చేయడం ఏంటో అని నాకు అనిపించినా, నోర్మూసుకుని ఊరుకోవడమైనది. మర్నాడు లోకల్ పత్రిక మొదటిపేజీలో దండలు కూడా లేని ఆదర్శ వివాహం అంటూ వార్త వేశారు. అదేం దిక్కుమాలిన ఆదర్శమో. పూలదండలు మార్చుకుంటే తప్పేముందీ అని ఇప్పుడనిపిస్తుంది.
హైదరాబాద్ నుంచి మా అన్న ఆర్టిస్టు మోహన్, ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసాడు. “ఏరా, పెళ్ళేమన్నా చేసుకుంటున్నావా” అంటూ. “ఇదేమంత ఘనకార్యంలే అని నీకు చెప్పలేదు” అన్నా. అది సర్లేరా ఇక్కడ ఉదయం ఫ్రెండ్స్ అంతా మీ తమ్ముడి పెళ్ళంటగా అని అడుగుతున్నారు. ఓ మాట చెబితే పోయేది” అన్నాడు.
అంత తలతిక్కగా ఉండేది నా యవ్వారం.
పెళ్ళైన రోజు సాయంత్రం కాస్త చీకటి పడుతుండగా, గోదావరి మీద పడవలో విహారం అన్నారు. చిన్న ఊరిలో పెద్ద ఆనందం! కెరటాల్లో చంద్రుణ్ణి చూస్తూ, గోదావరి గాలిని ఎంజాయ్ చేస్తూ… సావిత్రీ, నాగేశ్వరరావ్ ని తలుచుకుంటూ…విహారం ముగించాం.
***
మర్నాడు రెండు సూట్ కేసులతో నళినీ నేనూ విజయవాడ చేరుకున్నాం. బ్యాంక్ కాలనీలో చుట్టూ ప్రహరీ, లాన్, మొక్కలూ ఉన్న అందమైన షోకైన ఇల్లు అది. ‘ఉదయం’ ప్రారంభానికి ఇంకా టైం ఉంది.
స్లీవ్ లెస్ సాయంకాలాలు
వారానికో పదిహేను రోజులకో “బైటికెళదాం” అనుకునేవాళ్ళం. బ్యాంక్ కాలనీలో రిక్షా ఎక్కేవాళ్ళం. విజయా టాకీస్ ఎదురురోడ్డులో పికాక్ అనే పెద్దబార్ ఉండేది. రిక్షాకి ఐదురుపాయలు .బార్ దగ్గర్లో ఓ పెద్దాయన మల్లెపూలు అమ్ముతుండేవాడు. ఐదురుపాయలకే బోల్డన్ని పూలు. నళినీ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని, మెరిసిపోయే చీరతో వైజయంతి మాల డూప్ లాగా రిక్షా దిగేది.
అప్పటికి విజయవాడ బాగా విలేజ్ గనక ఈ నర్సాపురం స్టార్ ని చూసి ముచ్చటపడేది. ఆ బార్ లో రెడ్ కార్పెట్ వేసి ఉన్న విశాలమైన ఫ్యామిలీ రూమ్ ఉండేది. నేనో చల్లని కింగ్ ఫిషర్ బీర్ అనేవాణ్ణి. తనో సూప్ చెప్పేది. కబుర్లూ, జోకులూ మామూలే. నేను కొన్ని చమత్కారాలు వేసి పేరడీలు పాడేవాన్ని. కెరటాలు కెరటాలుగా నవ్వేది. నవ్వులా అవి కావు…నవపారిజాతాలు… ఆ టైపులో అన్నమాట. ఆవిర్లు ఎగజిమ్మే ఆర్గానిక్ చికెన్ బిర్యానీ తెచ్చేవాళ్ళు. మాకు ఒన్ బైటూ సరిపోయేది. 1984లో ఆ బిరియానీ ధర 16రూపాయలు.
ధర కూడా రుచిగా ఉండటం ఆ రోజుల స్పెషాలిటీ. మళ్ళీ రిక్షా… అయిదు రూపాయలు.
జగమే మారినదీ…మధురముగా…!
***
1984 అనే జార్జి ఆర్వెల్ నవల గుర్తుందా?
ఒకదేశంలో పూర్తి నియంతృత్వం ఉండడం వల్ల కలిగే నష్టం, జరిగే అనర్థం గురించి ఘాటుగా రాశారు ఆయన.
“వీడు మంచివాడు. మెత్తనివాడు. ఏమీ అనడు” అని 1984లోనే గుర్తించిన నళిని కొన్ని సంవత్సారాల్లోనే పూర్తిస్థాయి గృహాధికారిగా నియంతగా అంటే గంగ… సూర్యముఖిగా మారిపోయిన పరిణామాన్ని మీ ఊహకే వదిలేయడంలోని నా మంచితనాన్ని గుర్తించాలని మనవి చేయబడుతున్నది.
***
విజయవాడలో ‘ఉదయం’ జర్నలిస్టులు ఆరుగురో, పదిమందో సాయంకాలం మందు పార్టీకి మా ఇంటికి వస్తుండేవాళ్ళు. బుద్ధిమంతురాలైన నళిని, రెండు కిలోల చికెన్ వండి, రెండు డజన్ల గుడ్లు కూరచేసి, ఫ్రైడ్ రైస్ కి పాల్పడి, దగ్గర్లో ఉన్న రచయిత్రి డి.సుజాతాదేవి ఇంటికి వెళ్లిపోయేది.
మేం ఈ దేశానికి పట్టిన పేదరికం గురించి విపరీతంగా చర్చిస్తూ, ఆందోళనతో ఇరవైబీర్లు తాగి, నాలుగు పెట్టెల సిగరెట్లు కాల్చి, పోరాటం వినా మార్గం లేదని కనిపెట్టి, దారుణంగా నిద్రపోయేవాళ్ళం.
***
జర్నలిజమూ, పేపర్లు మారడమూ అనే ఓ మధ్యతరగతి ఉద్యోగి ప్రయాణంలో పార్ట్ అండ్ పార్శిల్ గా నళిని నాతో విజయవాడ, రేణిగుంట, హైదరాబాద్, మళ్ళీ విజయవాడ, మళ్ళీ హైదరాబాద్ తిరుగుట,ఇళ్ళు మారుట అనే కావ్యంలో నాయకి పాత్రని పోషించింది.
ఈ నలభై ఏళ్ల జర్నీలో కొమ్మినేని వాసుదేవరావు, ఏబీకే ప్రసాద్, కే. ఎన్. వై పతంజలి, కే. రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, అరుణ్ సాగర్, తల్లవజ్ఝల శివాజీ, తుమ్మలపల్లి రఘురాములు, అనంత్, నరేంద్ర, శ్రీనివాస రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాఘవాచారి, మృణాళిని, వసంతలక్ష్మి, సత్యవతి, త్రిపురనేని శ్రీనివాస్, కలేకూరి ప్రసాద్, మందలపర్తి కిషోర్,కెవియస్ వర్మ, నామిని సుబ్రమణ్యం నాయుడు, పెన్మత్స శరత్… లాంటి ఎంతోమంది ఎడిటర్లూ జర్నలిస్టులు నళినీకి బాగా తెలుసు. సజ్జల లక్ష్మి ప్రాణ స్నేహితురాలు. ఇంకా రచయితలూ, కవులూ, ఆర్టిస్టులూ, గాయకులూ…అదో పెద్ద జాబితా.
మొన్ననే 89వ పుట్టినరోజు నాడు హైదరాబాద్
సి. ఆర్. ఫౌండేషన్ లో ఏ. బీ. కె గారిని పలకరించింది. “చీకూ చింతాలేకుండా సుబ్బరంగా ఉన్నారుగా… నన్ను ఇంకా గుర్తుపడుతున్నారు కూడానూ” అందట నళిని. అయ్యో నిన్నెందుకు గుర్తుపట్టనమ్మా అన్నారట ఏబీకే మురిసిపోతూ.
89 ఏళ్ళ వయసువాళ్ళని ఆప్యాయంగా పలకరించడంలోనేగా జీవన మాధుర్యం
దాగి ఉండేది!
“ఏబీకే గారు ఆరోగ్యంగా ఉన్నారు తెలుసా!”
అనింది నాతో
***
కమ్యూనిస్ట్ నాయకుల జాబితా అంతా ఇంకా పొడవైనది. సురవరం సుధాకర్ రెడ్డి, విజయలక్ష్మి, అజీజ్ పాషా, నారాయణ, వసుమతి, నారాయణ రావు, ప్రేమపావని, సుధాకర్, శ్రీనివాసులు నాయుడు, ప్రతాపరెడ్డి, చాడ వెంకటరెడ్డి వాళ్ళ పిల్లలూ అందరూ నళినీకి దోస్తులే. ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. ప్రజానాట్యమండలి గాయకులంతా సొంత ఇంటి మనుషులే. ధవళ సత్యం, జాకబ్, అదృష్ట దీపక్, స్వామి, లక్ష్మీ నారాయణ, పల్లె నర్సింహ, గని… అదో పాటల ప్రవాహం.
నళినీ పాటంటే మోహన్ కి ఇష్టం. ఏ సాయంకాలమో, చాలా అరుదుగా మోహన్ ఆఫీసుకి వచ్చేది.
మేం ఆరుగురమో, పదిమందిమో ఉండేవాళ్ళం. “నళినీ, నీ కొచ్చిన ఆ నాలుగు పాటలూ పాడెయ్” అని నవ్వుతూ అనేవాడు మోహన్.
వెన్నెలలోనే హాయి ఏలనో…
మనసున మల్లెలమాలలూగెనే…
నవ్వులనదిలో పువ్వుల పడవా…
వెళ్లకోయి, వెళ్లకోయి నా సఖా…
కొంచెం మొరాయించి, కాస్త సర్దుకుని, టైం తీసుకుని… పాడేది. వహ్వా అనీ, దుమ్మురేపేశారనీ, మరొక్కపాట అనీ శ్రోతలు ఆవేశపడినపుడు – ఇక వరస… ఛాంగు ఛాంగురే అని మొదలుపెట్టేది …ఆ రాత్రి పాటలు వెన్నెల పువ్వులై వికశించేవి…చూస్తూ చూస్తుండగానే పార్టీ పూలతోటగా మారిపోయేది.
***
ఓ రోజు వాసిరెడ్డి శరత్ బర్త్ డే పార్టీకి నళినీని నన్నూ తీసికెళ్లాడు మోహన్. కొందరు పాటలు పాడారు. అంత కిక్కు రాలేదు. నళినీ, నువ్వు పాడు అన్నాడు మోహన్. చీకటి ఆకాశం కింద, డాబా మీద ఓ 40మందితో పార్టీ. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆరేడుపాటలు పాడింది.
కట్ చేస్తే రెండునెలల తర్వాత వాసిరెడ్డి శరత్,
నళినీకి ఫోన్ చేశాడు. ఉద్యోగం చేస్తున్నావా?
అని అడిగాడు.
“మానేశా. ఖాళీగానే ఉన్నా” అని చెప్పింది. హైదరాబాద్ రెడ్డీ ఫౌండేషన్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో – స్కూళ్లపై అజమాయిషీ ఉద్యోగం ఇచ్చాడు. ఒక రోజు ఇబ్రహీం పట్నం, మరోరోజు దమ్మాయి గూడ, చందా నగర్…కార్లో స్కూళ్లకి వెళ్లి వచ్చేది. పదేళ్లు నాన్ స్టాప్ గా చేసింది ఆ ఉద్యోగం.
గతంలో నళినీకి ఉద్యోగం లేనపుడు “స్నేహితులు సాయంకాలం పార్టీకి వస్తామంటున్నారు” అని వణుకు తెలీకుండా, నసిగే వాణ్ణి. మౌనం. ఏమీ మాట్లాడేది కాదు. “ఇచ్చట తుపాకీతో ఉచితముగా కాల్పులు జరుపబడును” అనే బోర్డు పట్టుకు తిరిగేది.
నళినీకి ఉద్యోగం వచ్చాక – freedom at broad daylight- మేం సెలబ్రేట్ చేసుకున్నాం.
ఉదయం పదిగంటలకి కారులో వెళ్ళిపోయేది.
ప్రీప్లాన్ ప్రకారం – మందు సీసాలూ, చికెనూ, పచ్చిమిర్చి కొత్తిమీరా తదితరములతో కవులూ, కళాకారులూ ఈలలేసుకుంటూ దిగిపోయేవాళ్ళు.
ఆర్టిస్ట్ శ్రీరామ్ కారంకి మంచి వంటగాడు. పార్టీ మొదలయ్యేది. షరా…గ్రాంస్కీ సూత్రీకరణల నుంచి నోమ్ చోమ్ స్కీ ఇంటర్ప్రిటేషన్స్ దాకా, కార్ల్ మార్క్స్ ఇంటద్దె కట్టలేకపోవడం నుంచి, బెర్లిన్ లో రీచ్ స్టాగ్ మీద ఎర్రజెండా ఎగరేయడం దాకా, చైర్మన్ మావో పిచ్చికల్ని చంపడం నుంచి కామ్రేడ్ స్టాలిన్ ట్రాట్స్కీని హతమార్చడం దాకా చర్చించి, ఉద్రేకపడి, రెండుపెగ్గులు ఎక్కువతాగి, విప్లవం కంటే నళినీ రావడమే ప్రమాదకరమని గుర్తెరిగి సాయంత్రం ఐదుగంటలలోపే అక్కడి నుంచి ఎగిరి అదృశ్యం అయిపోయేవాళ్ళం.
కొసమెరుపు : ఈ మధ్యనే, నెలరోజులవుతుందేమో, హిమాయత్ నగర్ లో ఒక ప్రజానాట్యమండలి మీటింగ్ అయిపోయాక 30 ఏళ్ళ మిత్రుడూ, కవీ, సినిపాటల రచయితా చైతన్య ప్రసాద్ నళినీని పలకరించి, “నళినీ, నాతో వచ్చేయ్యరాదూ” అన్నాడట. “సచ్చినాడా, నీకేమొచ్చింది” అనిందట. ఎన్నేళ్ళుంటావ్ ఇంకా ఆ ప్రకాష్ తో, నాతో వచ్చేయొచ్చు గదా” అన్నాడని… నాతో చెప్పింది నళినీ.
మరి నువ్వేమన్నావో అని అడిగాను. “ఏదో ఆ ఫేసుబుక్ లో రాస్తున్నాడుగా అందరూ చాలా బాగా ఉన్నాయంటున్నారు. ఏలూరు రోడ్డు పుస్తకం కావాలంటున్నారు. అందుకే ప్రకాష్ దగ్గరే పడి ఉంటున్నా” అనిందంట నళినీ… నా నళినీకి 39వ పెళ్లిరోజు శుభాకాంక్షలు…
Share this Article