.
టాక్సిక్ ఓటమిని అంగీకరించిన నయనతార..! సినిమా పోయిందంటే పోయిందంతే.. మసిబూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక సినిమా ఫెయిల్ అవ్వడం పెద్ద విషయం కాదు.
అది కూడా వందల కోట్లు పెట్టి, భారీ అంచనాలతో తీసిన సినిమా ఫెయిల్ అవ్వడం కూడా కొత్త విషయం కాదు. సినిమా అనేది అంతే. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత పెద్ద దర్శకుడైనా.. చివరికి థియేటర్‌లో ప్రేక్షకుడి తీర్పు ముందు నిలబడాల్సిందే.
Ads
కానీ సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఆ ఫెయిల్యూర్‌ను ఎలా స్వీకరిస్తారు? అక్కడే అసలు విషయం ఉంటుంది. ‘టాక్సిక్’ విషయంలో నయనతార ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు అందుకే ఆసక్తికరంగా ఉన్నాయి. ఆమె ఆ సినిమా గురించి “డిజాస్టర్” అని తీర్పు చెప్పలేదు. “సినిమా పోయింది” అని ప్రకటించలేదు. అంతకంటే పరిణతిగా ఒక విషయం చెప్పింది.
సినిమా ఎలా తయారవుతుందో అనుభవం ఉన్నవాళ్లకు కొంతవరకు అర్థమవుతుంది. ఒక సినిమా బాగా ఆడుతుందని మనకు చాలా నమ్మకం ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడి దగ్గరకు వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోవచ్చు. తన కెరీర్‌లో తాను చాలా ఆశలు పెట్టుకున్న సినిమాలు అనుకున్నంతగా ఆడలేదని, అదే సమయంలో తనకే సందేహంగా అనిపించిన సినిమాలు భారీ విజయాలు సాధించాయని ఆమె చెప్పింది.
అందుకే తాను నేర్చుకున్నది ఒక్కటేనని చెప్పింది. విజయాన్నైనా, అపజయాన్నైనా ఒకే వినయంతో స్వీకరించడం. అంతే. ఇంకో చోట ఇంకా సూటిగా చెప్పింది.
సినిమా బాగా ఆడకపోతే బాధగానే ఉంటుంది. కానీ దాన్ని ఒక పాఠంగా చూస్తానని, మనుషులుగా ప్రతి నిర్ణయమూ పనిచేయదని, బాధ్యత తీసుకుని, నిశ్శబ్దంగా ఆలోచించి, మరింత స్పష్టతతో ముందుకు వెళ్తానని చెప్పింది. ఇదే అసలు స్థితప్రజ్ఞత.
‘టాక్సిక్’లో నయనతార ఏదో చిన్న పాత్ర చేసిన ఆర్టిస్టు కాదు. ఆమె ఆ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నప్పుడు ప్రమోషన్స్‌లో కూడా భాగమైంది. కాబట్టి ఫలితం బాగోలేదంటే ఆమెకూ దానిలో వాటా ఉంది. అయినా…
“సినిమా అర్థం కాలేదు కాబట్టి ఫెయిల్ అయింది.” “ప్రేక్షకులకు కొత్తది అర్థం కాలేదు.” “ఇది కమర్షియల్ సినిమా కాదు.” “ఇది ఒక ప్రయోగం.” “విమర్శకులు అర్థం చేసుకోలేదు.” అంటూ ఏదో ఒక కారణం వెతికి సినిమా మీద మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఆమె చేయలేదు.
అది నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మన దగ్గర సినిమా ఫెయిల్ అవ్వడం కంటే సినిమా ఫెయిల్ అయిందని ఒప్పుకోవడమే పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక సినిమా ఆడకపోతే… మొదట ఫ్యాన్ వార్. తర్వాత సోషల్ మీడియా వార్. తర్వాత రివ్యూయర్ల మీద నిందలు. ఆ తర్వాత ప్రేక్షకుల మీదే నిందలు. చివరికి “ఇది కమర్షియల్ సక్సెస్ కాకపోయినా కల్ట్ క్లాసిక్” అనే కొత్త నిర్వచనం!
ఏమిటిదంతా? సినిమా బాగుంటే బాగుంది. బాగోలేకపోతే బాగోలేదు. ఆడితే హిట్. ఆడకపోతే ఫెయిల్యూర్. ఇంత సింపుల్ విషయాన్ని ఒప్పుకోవడానికి ఎందుకంత మొహమాటం? ఇక్కడ ‘టాక్సిక్’ విషయంలో మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది.
సినిమాపై ప్రతికూల స్పందన మొదలైన వెంటనే కన్నడ సినిమా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు యష్‌కు అండగా నిలబడ్డారు.
రిషబ్ శెట్టి యష్‌ను ప్రశంసిస్తూ ‘టాక్సిక్’ను ఒక దైర్యమైన ప్రయోగంగా అభివర్ణించాడు. అసాధారణమైన మార్గంలో కథ చెప్పడం తప్పు మార్గంలో వెళ్లినట్టే కాదని, కన్నడ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు యష్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించాడు.
కిచ్చా సుదీప్ కూడా యష్‌కు మద్దతుగా నిలిచాడు. సాధారణమైన మార్గాన్ని వదిలి కొత్తది ప్రయత్నించడానికి ధైర్యం కావాలని చెప్పాడు. ఉపేంద్ర కూడా యష్‌కు మద్దతు తెలిపినవారిలో ఉన్నాడు. అంటే కన్నడ సినిమా పరిశ్రమలో ఒక రకమైన “మనవాడికి మనం అండగా నిలబడాలి” అనే సహజమైన ఇండస్ట్రీ సాలిడారిటీ కనిపించింది.
అది తప్పు అని చెప్పలేం. నిజానికి అది కూడా మంచిదే. ఒక కళాకారుడు విఫలమైనప్పుడు అతని పక్కన నిలబడటం మానవత్వం. ముఖ్యంగా ఒక స్టార్ కొత్తదాన్ని ప్రయత్నించినప్పుడు అతనికి ధైర్యం చెప్పడం ఇండస్ట్రీ సంస్కృతిలో భాగమే.
కానీ ఇక్కడ ఒక సన్నని గీత ఉంది. మనవాడికి అండగా నిలబడటం ఒకటి. సినిమా బాగోలేదని తెలిసినా “అద్భుతం”, “మాస్టర్‌పీస్”, “కన్నడ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా” అంటూ వాస్తవాన్ని కప్పిపుచ్చడం మరోటి.
మొదటిది స్నేహం. రెండోది భేషజం. రెండింటికీ తేడా ఉంది. రిషబ్, సుదీప్‌లు యష్‌కు అండగా నిలబడటం తప్పు కాదు. అసలు వాళ్లు అలా నిలబడకపోతేనే ఆశ్చర్యం. కానీ ఒక సినిమా విషయంలో చివరి మాట మాత్రం ప్రేక్షకుడిదే.
ప్రేక్షకుడు నచ్చలేదంటే నచ్చలేదు. ఎన్ని ఇండస్ట్రీల స్టార్లు వచ్చి పొగిడినా థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడి అనుభవం మారదు. ఇక్కడే నయనతార మాటలు మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆమె కూడా యష్‌కు అండగా నిలబడవచ్చు.
తాను నటించిన సినిమా కాబట్టి దాన్ని గొప్ప ప్రయోగమని సమర్థించుకోవచ్చు. సినిమాను విమర్శిస్తున్న వాళ్లను తప్పుబట్టవచ్చు. అలా చేయడానికి ఆమెకు పూర్తి హక్కు కూడా ఉంది. కానీ ఆమె ఎంచుకున్న దారి వేరుగా ఉంది.
“ప్రతి సినిమా పనిచేయదు. బాధ్యత తీసుకుంటాను. ఆలోచిస్తాను. నేర్చుకుంటాను. ముందుకు వెళ్తాను.” అంతే. ఇది ‘టాక్సిక్’ను సమర్థించడం కాదు. అదే సమయంలో దాన్ని తిట్టడం కూడా కాదు. ఇది ఒక సినిమా ఫలితాన్ని ఒక సినిమా ఫలితంగానే చూడటం.
అందుకే నయనతార వ్యాఖ్యల్లో కనిపించింది “పరిణతి” కంటే స్థితప్రజ్ఞత. పరిణతి అంటే ఎన్నో విషయాలు తెలుసుకోవడం కావచ్చు. కానీ విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఓటమి వచ్చినప్పుడు పారిపోకుండా, ఓటమిని ఓటమిగానే చూసి దాని నుంచి నేర్చుకోవడం…
అది స్థితప్రజ్ఞత. ‘టాక్సిక్’ విషయంలో నయనతార చేసినది అదే. సినిమా ఓడిపోయిందా? ఓడిపోయింది. అంతే. దాని మీద నాలుగు పూతలు పూసి బంగారమని చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఓటమిని అంగీకరించగలగడం కూడా ఒక స్టార్‌డమ్ లక్షణమే…
Share this Article