మాఫియా, క్రిమినల్స్ అని పదే పదే రాస్తుంటాం మీడియాలో… కానీ మీడియా పర్సన్సే అలా తయారైతే… ప్రజాకంటకులుగా మారితే..! తెల్లారిలేస్తే బోలెడు ప్రభుత్వ శాఖలు, నేరగాళ్లతో జనం అవస్థలు సరేసరి… వాళ్లకు మీడియా తోడైతే ఇక సమాజం దురవస్థ..? ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్త ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది… ఎలాగూ పెద్ద పెద్ద మీడియా సంస్థలు వందల కోట్లను దండుకుంటూ, వీలైనంత విషాన్ని సమాజంలోకి ఇంజక్ట్ చేస్తూనే ఉన్నాయి…
ఇంకోవైపు రూపాయి ఇవ్వనక్కర్లేని కంట్రిబ్యూటర్ల వ్యవస్థ… ఉల్టా యాజమాన్యాలే వాళ్లని దోపిడీ చేసే వ్యవస్థ ఉంది ప్రస్తుతం… సో, వాళ్లు వసూళ్లకు, నేరాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు… చాలామంది… కొందరు బయటపడుతున్నారు, కొందరు చలాయించుకుంటున్నారు… పల్లెల్లో దందాలు ఏమిటి..? పట్టణాల్లో మోడస్ ఆపరెండీ ఏమిటి..? అనే చర్చలోకి వెళ్తే, ఒడవదు, తెగదు… మరీ యూట్యూబ్ చానెళ్ల పేరిట ఓ అరాచకం నడుస్తోంది…
అలాగని పెద్ద చానెళ్ల పెద్ద విలేకరులేమైనా శుద్ధపూసలా..? ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం… అనంతపురం జిల్లాలో టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీల రిపోర్టర్లు ప్లస్ టీవీ9 డ్రైవర్ సైతం కలిసి ఓ పెద్ద క్రైమ్‌కు పాల్పడ్డారు… వాళ్లో వీళ్లో ఆరోపించడం కాదు… పోలీసులు కేసు ఫైల్ చేశారు… నో, నో, మా టీవీ9 రిపోర్టర్లు ఎవరూ లేరు అని అక్కడి విలేఖరి సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టి, తీవంగా ఖండించినట్టున్నాడు… సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా రాయడం ఏమిటి బ్రదర్… పోలీసులే కదా కేసు పెట్టింది..?
Ads
కానీ సదరు టీవీ9 విలేఖరి వాదనతో ఏకీభవించాలి… ఎందుకంటే..? ఇది ఆంధ్రజ్యోతి రాసినట్టు 30 కోట్ల దందా కాదట… తెలుస్తున్న సమాచారం మేరకు 45 కోట్ల క్రైం అట… డీజీపీ దాకా కేసు వెళ్లిందనీ, ఎస్పీ ఒత్తిడి తేవడంతో ఇక విధిలేక పోలీసులు కేసు నమోదు చేశారనీ, కానీ దీని వెనుక ఆయా మీడియా సంస్థల పెద్ద తలలే ఉన్నాయనీ, టెంపరరీగా వారి పేర్లను తప్పించారనీ అంటున్నారు… నిజానిజాలు ఆ మూడు మీడియా సంస్థల హెడ్డాఫీసులకే తెలియాలి ఇక… (ఈ కేసు లోతుల్లోకి ఇంకా వెళ్లడం లేదు ఇక్కడ… రెండు రాష్ట్రాల్లోనూ బోలెడు…)
కనీసం ఇలాంటి భారీ నేరాలు బయటపడినప్పుడైనా విచారణ జరిపిస్తున్నాయా..? టీవీ9 అయితే ఏమీ పట్టించుకోదు… మరి ఎన్టీవీ..? అదీ అంతేనా..? సాక్షి సంగతికొద్దాం… ఇదే జిల్లాలో ఓ వెంచర్ విషయంలో బెదిరింపులకు పూనుకున్న ఇద్దరు రిపోర్టర్ల మీద ఏకంగా వైసీపీ నేతలు జగన్‌కే ఫిర్యాదు చేస్తే… వాళ్లను తక్షణం తీసేయాలని జగన్ స్వయంగా ఆదేశించినా సరే, వాళ్లను పెద్ద తలకాయలు కాపాడాయనే విమర్శలూ కొన్నాళ్ల క్రితం వచ్చాయి… కాపాడబడ్డారనే సంగతి కూడా జగన్‌కు తెలియదట… ఇప్పుడేమో సాక్షి టీవీ..!
వందల కోట్ల యవ్వారాలతో, మీడియా సంస్థల పుట్టుకలే కుంభకోణాలు… కొనుగోళ్లు, అమ్మకాలు, కార్పొరేట్ కుట్రలు, ఇతర లోపాయికారీ వ్యవహారాలు సరేసరి… అది కింది వరకూ ఇలా ఇంకుతోంది… ఎవరి స్థాయిలో వాళ్లు… కనీసం మేనేజ్‌మెంట్లకు ఏమీ పట్టదా..? జర్నలిస్టులు జనం మీద పడితే, తమ బ్రాండ్ ఇమేజీలు, తమ క్రెడిబులిటీలు మన్నూమశానం దెబ్బతింటాయనే సోయి కూడా ఉండదా..? ఏం వ్యాపారాలురా బాబూ… అందరూ దావూద్ ఇబ్రహీంలు, నయీంలు అయిపోతే జనం పరిస్థితి ఏమిటి మరి..?!
కొసమెరుపు :: ఈ 45 కోట్ల క్రైంలోని వ్యూహకర్తలు, ప్రధాన భాగస్వాముల్లో ఇద్దరు టీవీ రిపోర్టర్లు ఏకంగా అనంతపురం జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు అడిగారట వైసీపీ తరఫున… ష్, ఒక్కొక్కరూ 50 కోట్ల వరకూ ఖర్చు పెట్టుకుంటాం అన్నారట… వారెవ్వా… సలహాదార్, సజ్జల సార్, మీరైనా కాస్త మూడోకన్ను తెరిచి చూడండి ఇటువైపు…!!
Share this Article