ఫేస్‌బుక్ మిత్రురాలు Shyla వాల్ మీద ఓ పోస్టు… వాళ్ల సంస్థ PURE ఆధ్వర్యంలో కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో నడిచే బళ్లల్లో పిల్లలు బతుకమ్మ ఉత్సవాల్ని జరపుకుంటున్న ఫోటోలు ఆ పోస్టుకు జతచేయబడి ఉన్నాయి… అందులో బతుకమ్మల ఫోటోలు ఆకర్షించాయి… ప్రత్యేకించి అడవిలో దొరికే కూరగాయల బతుకమ్మ మరీనూ…
ఓ బడిపిల్ల ఎత్తుకున్న బతుకమ్మ కూడా… పదీపదిహేను తంగేడు పూలు, నెత్తిన మరో పదీపదిహేను గునుగు… మిగతాదంతా ఓ ఎండిపోయిన పొదలా ఉంది… సంప్రదాయ, ఛాందసవాదులు చూస్తే ఠాట్ ఇదీ బతుకమ్మేనా..? ఇలాగేనా బతుకమ్మ పేర్చడం అంటారేమో… కానీ వాళ్లు బతుకమ్మ ఆడటమే అభినందనీయం… తమకు తోచిన రీతిలో బతుకమ్మను పేర్చుకుని, ఎత్తుకుని మురిసిపోవడాన్ని చూడాలి…
Ads
అలాకాదు, అటవీ ప్రాంతాల్లోనే కదా తంగేడు, గునుగు, గడ్డిపూలు బాగా దొరికేది అంటారా..? కాదు, ఫలానా పూలనే బతుకమ్మగా పేర్చాలని ఏమీ లేదు… కాదంటే గరికపాటిని అడుగుదాం, ఐనా వద్దులెండి, ఆయనకు తెలంగాణ పండుగల మీద పెద్ద అవగాహన లేదు… అసలు తెలంగాణ పండుగల గురించి చెప్పగలిగే స్వాములు, ప్రవచనకారులు, మహిళా ప్రవచనకత్తెలు ఎవరూ కనిపించరు అదేమిటో… గణేషుడికి ఏ పత్రి పెట్టాలనేది నిర్దేశించబడి ఉంది… ఒక్కో పత్రికి ఒక్కో విశేషమూ చెబుతారు… కానీ బతుకమ్మకు అలాంటి నిర్దేశాలు ఏమున్నట్టు లేదు…
ప్రకృతి ప్రసాదించిన పూలు ఏవైనా సరే… కావేవీ బతుకమ్మకు అనర్హం… అంతెందుకు..? తెలంగాణలో పెద్ద గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లోనే తంగేడు, గునుగు, గడ్డిపూలు దొరకడం లేదు… ఇక పట్టణాలు, నగరాల్లో చెప్పనక్కర్లేదు… అక్కడక్కడా గునుగు, గడ్డిపూలకు రంగులు అద్ది అమ్ముతూ ఉంటారు… అందుకే చాలామంది ఇళ్ల ముందు ఏ పూలు దొరికితే ఆ పూలతో మమ అనిపించేస్తున్నారు… ఇస్తినమ్మ వాయినం తరహాలో పేరిస్తినమ్మ బతుకమ్మ అన్నట్టుగా…
చాలాచోట్ల బంతిపూలను వాణిజ్య పద్దతిలో సాగుచేస్తున్నారు రైతులు… ఎంత కావాలంటే అంత పరిణామంలో దొరుకుతాయి… వాటినే కొని పేర్చడమే… శిబ్బిల జాడ అసలే లేదు… తపుకులే (చిన్న ప్లేట్లు)… వినాయక చవితికి దొరికిన ప్రతి ఆకునూ తీసుకొచ్చి ఇదే పత్రి అని అమ్ముతుంటారు కదా… ఇప్పుడు రకరకాల పూలను తీసుకొచ్చి అమ్ముతున్నారు… తప్పదు, బతుకమ్మ ఆడాలంటే పూలు ఉండాల్సిందే కదా మరి… అవే కొంటున్నారు…
అఫ్‌కోర్స్, సద్దుల బతుకమ్మ రోజయితే కాగితపు బతుకమ్మలు పోటీలు పడతాయి… కనీసం ఒక్క వరుసనైనా తంగేడు పేర్చాలని చాలామంది భావిస్తుంటారు… ఖరీదైనా సరే కొంటున్నారు… గతంలోనైతే కంచెలు (పశువుల మేతకు వదిలేసే భూములు), పఢావు భూములు, పోరంబోకు భూములు, ఒర్రెల వెంబడి, రోడ్ల పక్కన తంగేడు చెట్లు విరివిగా ఉండేవి… కానీ రియల్ ఎస్టేట్ విజృంభణ, వ్యవసాయం పెరగడంతో అసలు తంగేడు కనిపించడమే గగనం అయిపోయింది…
ఈమధ్య బతుకమ్మలతో పాటు చౌరస్తాల్లో, గుళ్ల ప్రాంగణాల్లో, వినాయకుడిని పెట్టే కమ్యూనిటీ మండపాల్లో తులసి మొక్కలున్న కుండీలను పెడుతున్నారు… అఫ్‌కోర్స్, అదీ పవిత్రమే, పూజార్హమే కాబట్టి స్వాగతించవచ్చు… ఇక సద్దుల బతుకమ్మ రోజున కొందరు గౌరమ్మ పేరిట శక్తిరూపాల్ని బతుకమ్మల నెత్తి మీద అమరుస్తున్నారు…
ఎహె, పసుపుతో చేసే గౌరమ్మే అసలైన గౌరమ్మ, ఈ రూపాలేంటి అని విసుక్కోకండి… దేవతల రూపాల్ని పూజించడం మనకు పరిపాటే కదా… తప్పులేదు… (జీతెలుగు వాడి ఏదో సీరియల్‌లో ఉఠో ఉఠో ఎల్లమ్మ తల్లీ ఉఠో అని ఓ పాత్రధారి అప్పుడప్పుడూ వస్తుంటుంది… నెత్తి మీద ఇలాంటి రూపాలే పెట్టుకుని, నాలుగు నిమ్మకాయలు, పసుపు కుంకుమ చల్లి… సోది చెప్పే పాత్ర… ఈ బతుకమ్మల గౌరమ్మల రూపాల్ని చూస్తే ఆ సీన్లే గుర్తొస్తున్నాయి… సరే, అది వేరే సంగతి…) చాలామంది సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను వేరే, గౌరమ్మను వేరే తీసుకుపోతుంటారు ఆటకు, నిమజ్జనానికి… గతంలో పూర్నీలు, రీళ్లు, అవి కాల్చే తుపాకులు, పొటాష్‌లు గట్రా సందడి ఉండేది… అవి దాదాపు కనుమరుగు నేడు…
డీజేలు, యూట్యూబ్ పాటలు ఎట్సెట్రా బతుకమ్మ ఆట స్వరూపాన్నే మార్చేస్తున్నాయి… ఐనా ఇప్పుడు బతుకమ్మ పాటలు ఎంతమందికి వచ్చు..? పాడేది ఎవరు..? శృతి కలిపేది ఎవరు..? ఒకప్పుడు బతుకమ్మ పాటలు అంటే మహిళల బతుకు పాటలు… సరే, నేటి మహిళలకు అసలు చప్పట్లే సరిగ్గా కొట్టడం రాదు, ఏదో వింత కోలాటం తరహాలో, దాండియా ధోరణిలో చుట్టూ తిరగడమే… అదీ ఓ రిథమ్ లేకుండా… తాజాగా రాజకీయ గేయాల్ని, నాయకుల భజన గీతాల్ని కూడా బతుకమ్మలో ప్రవేశపెడుతున్న దారుణాలు కూడా చూస్తూనే ఉన్నాం… మరీ అధికారిక బతుకమ్మ ఉత్సవాల్లో అరాచకం సరేసరి… కాలం మారేకొద్దీ బతుకమ్మ కూడా ఇంకెలా మారిపోనుందో…!!
Share this Article