Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చే గువేరా నుంచి దుర్గ గుడి మెట్ల దాకా … ఓ సరికొత్త హిందూ ఛాంపియన్ ప్రస్థానం…

September 26, 2024 by M S R

 

 

ఒక కాబోయే డిప్యూటీ సీఎం సనాతన ధర్మ బద్ధ వ్యతిరేకి… సవాళ్లు, వ్యతిరేకత ఎదురైనా కమిటెడ్… అది తమిళనాడు… ఒక డిప్యూటీ సీఎం ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు… మన ఏపీలో… గత ధోరణులకు పూర్తి భిన్నంగా…

Ads

–––––––––––––––––––––
సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు మంత్రి, డీఎంకే ‘యువరాజు’ ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, ‘‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బు డెంగీ, మలేరియా వంటిది,’’ అని ప్రకటించి బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసన ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిందూ మత అభిమానులు సినీహీరో, నిర్మాత కూడా అయిన ఉదయనిధిపై కేసులు వేశారు.

అయినా, తండ్రి ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వంలో యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ప్రత్యేక చట్టాల అమలు శాఖల మంత్రిగా ఉన్న ఉదయనిధి అధికారపక్షం రాజకీయ వారసుడిగా ప్రతిపక్షాల, హిందుత్వవాదుల మౌఖిక దాడులకు జంకలేదు. డీఎంకేను హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రేసినా ‘రహస్య, బహిరంగ హిందువుల’తో నిండిన ఈ పార్టీ భయపడలేదు.

రెండు నెలల తర్వాత కిందటి నవంబర్‌లో మాట్లాడుతూ, ‘‘ నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నాపై ఎక్కడెక్కడ ఎన్ని కేసులు పెట్టినా చట్టపరమైన సవాళ్లను తట్టుకుంటాను. సనాతన ధర్మాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాను,’’ అని రాబోయే నవంబర్‌ 27న 47 సంవత్సరాలు నిండే ఉదయనిధి తేల్చిచెప్పారు. ఈ వివాదం ఫలితంగా పెరియార్‌ ఈవీ రామసామి సిద్ధాంతాలే పెట్టుబడిగా నడిచే డీఎంకేకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందని, ఉదయనిధి జనంలో పలచనవుతారని ఎందరెందరో రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేశారు.

అయితే, వారి జోస్యాలకు భిన్నంగా ఉదయనిధి ఎంతోకొంత ‘సైద్ధాంతిక బలం’ ఇంకా బతికే ఉన్న డీఎంకేలో ఈ 12 మాసాల్లో బాగా నిలదొక్కుకోగలిగారు. తండ్రిలాగా మద్రాస్‌ (చెన్నై) మేయర్‌గా పనిచేసిన, పార్టీ యువజన విభాగాన్ని సుదీర్ఘకాలం నడిపిన అనుభవం లేని ఉదయనిధికి కేవలం సినిమా హీరో, ప్రొడ్యూసర్‌ అనే ఇమేజ్‌ నుంచి ‘సనాతన ధర్మం’ వివాదంతో బయటపడగలిగాడు.

అదీగాక, పేద్ద విగ్గు పెట్టుకునే తండ్రి స్టాలిన్‌ తమిళనాడు సాంస్కృతిక రాజధానిగా పేరున్న మదురైలో కొలువై ఉన్న సొంత అన్న (ఒకే తల్లి బిడ్డలు) ఎంకే అళగిరితో కొన్ని దశాబ్దాలపాటు రాజకీయ, కుటుంబ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. మరి డీఎంకే నాయకత్వం కోసం ఇలాంటి శ్రమపడకుండా ఎదగడానికి సనాతన ధర్మం అనుకోకుండా మహాభక్తురాలైన దుర్గ కొడుకైన ఉదయనిధిని ఆదుకుంది.

వాస్తవానికి పార్టీ అధినేత ఎం.కరుణానిధి కుటుంబ సభ్యుల్లో సగానికి పైనే దేవుడిని నమ్మేవాళ్లే. వారిలో కొందరు రహస్య హిందువులు, మరి కొందరు బహిరంగ హిందువులు–ఇదే కరుణ ఫ్యామిలీలో కొట్టొచ్చినట్టు కనపడే విశేషం.

60, 70, 80, 90, 100 ఏళ్లు నిండితే మొక్కాల్సిన గుడిలో స్టాలిన్‌ భార్య పూజలు
……………………………………………….
2023 మార్చి ఒకటిన భర్త ఎంకే స్టాలిన్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య, ఉదయనిధి తల్లి అయిన దుర్గమ్మ చెన్నైకి వందల కిలోమీటర్ల దూరంలోని తిరుక్కాడయ్యూర్‌ ఆలయంలో ఆయన మేలు కోరి అట్టహాసంగా డీఎంకే నేతలు, కార్యకర్తల సమక్షంలో భీమ రథ శాంతి పూజ నిర్వహించడం అసలు సంచలనమే కాలేదు.

ప్రఖ్యాత మైలదుత్తరై (మయూరం అనే పేరుతో కూడా ప్రసిద్ధి. మైలదుత్తరై అంటే నెమళ్లు తిరిగే తోట అని అర్ధమట)లో పరమ పవిత్రమైనదిగా భావించే శ్రీ అభిరామి సమేత శ్రీ అమృతకాదేశ్వరర్‌ ఆలయంలో ఆమె భర్తకోసం పూజలు చేయించారు. వరుసగా 60, 70, 80, 90, 100 సంవత్సరాలు నిండే హిందువులు తమ స్తోమతను బట్టి ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు.

ధర్మాపురం అధీనం (దేవస్థానం) పరిరక్షణలోని ఈ ఆలయానికి ఆయురారోగ్యాలు, అషై్టశ్వర్యాల కోసం విశ్వాసులు అయిన హిందువులు వచ్చి పూజలు చేయించుకోవడం వందలాది ఏళ్లుగా గొప్ప సాంప్రదాయంగా మారింది. అందుకే, తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అయిన తన భర్త స్టాలిన్‌ క్షేమం కోరి ఆయన భార్య, ఉదయనిధి తల్లి అయిన దుర్గ తిరుక్కాడయ్యూర్‌ ఆలయ ప్రాంగణంలో గజపూజ, గోపూజ, అశ్వపూజ చేశారు.

తర్వాత భీమ రథ శాంతి యాగాన్ని కూడా ఆమె భర్త పేరుతో చేయించారు. అంతేగాక, పూర్తిగా నాస్తికుడిగా పరిగణించే తన భర్త స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయితే తిరుచిణాపల్లి (తిరుచ్చి) లోని ప్రసిద్ధ శక్తిపీఠం సమయపురం మారియమ్మన్‌ కోయిల్‌ చుట్టూ ప్రదక్షిణం చేస్తానన్న మొక్కును 2021 వేసవి తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే విజయం తర్వాత దుర్గ తీర్చుకున్నారు. కరోనా కారణంగా తమిళనాట అన్ని ఆలయాలూ మూతపడినాగాని ఈ గుడిని సీఎం భార్య కోసం తెరిచారని బీజేపీ నేతలు విమర్శించినా పట్టించుకోలేదు.

సనాతనాన్ని దుయ్యబడితే ఉదయనిధికి ప్రమోషన్‌… మరి కల్యాణ్‌ బాబుకు..? 
…………………………………………………
మళ్లీ ఉదయనిధి విషయానికి వస్తే– సనాతన ధర్మాన్ని నోటికొచ్చినట్టు విమర్శించాక డీఎంకేలో ఉదయనిధి స్థానం సుస్థిరమైందని, రెండుమూడు రోజుల్లో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి లభిస్తుందని తెలుస్తోంది. హేతువాదం, నాస్తికత్వం, విపరీతమైన దైవభక్తి పాలూ నీళ్లలా కలగలసి ఉన్న తమిళనాట సనాతన ధర్మాన్ని విమర్శించి రాజకీయంగా సీఎం కొడుకు బలోపేతం కావడంతోపాటు డెప్యూటీ సీఎంగా ప్రమోషన్‌ పొందడం అత్యంత సహజ పరిణామం.

మరి, ఎలాంటి రాజకీయ, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక వాతావరణం సరిగ్గా కనిపించని ఆంధ్రప్రదేశ్‌లో మరి ఏ లక్ష్యంతో ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ మొన్న బెజవాడ కనకదుర్డమ్మ తల్లి గుడి మెట్లు కడిగి, పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టారో దాదాపు మూడు దశాబ్దాల క్రితమే కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన నా వంటి వారికి అర్ధం కావడం లేదు.

ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులు అక్కడి హిందూ ఆలయాల పరిరక్షణ, పండగల నిర్వహణలో చురుకైన పాత్ర నిర్వహించడం ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం కమ్మల కన్నా మతాచరణలో ఎక్కువేనని కొందరు వాదిస్తున్నారు.

ప్రధానంగా కాపుల పార్టీ అనే పేరు తన నాయకత్వంలోని జనసేనకు బాగా బలంగా అంటకుండా కాపాడడానికి, దిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వానికి, ‘‘ మీరు ఇంకా వైఎస్సార్పీపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను పెంపుడు కొడుకుగా చూస్తే అస్సలు బాగుండదు. మనందరికీ నష్టం. ఉత్తరాదిన బలంగానే ఇంకా కనిపిస్తున్న హిందుత్వకు అసలు సిసలు తెలుగు వారసుడిని నేనే. ఏ సిద్ధాంతం తిన్నగా ఎదగని తెలుగునాట హిందుత్వ బీజాలు నాటే శక్తియుక్తులు నాకే ఉన్నాయి. నేను ఏ వైఖరి తీసుకున్నా సమర్థించే నా భక్తజనం అధిక సంఖ్యలో ఉన్నారు,’’ అనే సందేశం పంపడానికే కల్యాణ్‌ బాబు ఇప్పుడు హఠాత్తుగా ‘సనాతన ధర్మం’ నినాదం బలంగా ఎత్తుకుని స్పీడ్ పెంచాడా..?

బెజవాడలో వంగవీటి సోదరుల పూర్వ సన్నిహితుడిగా, కాపు సద్బుద్ధిజీవిగా చెలామణి అయ్యే పూర్వ జర్నలిస్టు పూల విజయబాబు వంటి ‘ప్రముఖులు’ అనవసరంగా పవన్‌ కల్యాణ్‌తో ఈ విషయంలో తలపడుతూ, ‘‘నేను చిన్నప్పటి నుంచీ బెజవాడలో పుట్టిపెరిగాను. నాకంతా తెలుసు. దుర్గ గుడి మెట్లను హిందూ ముత్తయిదువలే కడిగి పసుపు రాయాలి. ఆనక బొట్లు పెట్టాలి,’’ అని టీవీ చానళ్ల మాయలో పడి వాదించడం వల్ల జన సైనికుల ఆగ్రహానికి గురవుతారమేననే అనుమానం వస్తోంది.

పదేళ్ల క్రితం జనసేన స్థాపించినప్పటి నుంచి కాపుల ఐక్యత గురించి బాహాటంగా మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు తిరుమల వెంకన్న లడ్డూ వివాదం ఫలింగా, ‘‘ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలి. హిందువులంతా ఐక్యం కావాలి,’’ అంటూ విశ్వహిందూ పరిషత్‌ లేదా భజరంగ్‌ దళ్‌ నేతల మాదిరిగా చెలరేగుతున్న తీరు కాపుల రాజకీయ, సామాజిక పరివర్తనను నిశితంగా గమనించే బెజవాడ మేధావులకు మింగుడు పడడం లేదు.

చేగువేరా, గద్దర్‌ వంటి మార్క్సిస్టు విప్లవకారుల అభిమానిగా గతంలో అందరికీ తెలిసిన కల్యాణ్‌ బాబు ఒక్కసారిగా తన పాత లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారా? అనే భయం బెజవాడ మేధావులు కొందరిని చుట్టుముడుతోంది. కొద్ది వారాల క్రితమే 56 సంవత్సరాలు నిండిన పవన్‌ కల్యాణ్‌ పదో తరగతితో విద్యాభ్యాసం ముగించినా గానీ.. బాగా చదువుకున్న మేధావిలా కనిపిస్తారు చాలా మందికి. మరి పార్టీ పెట్టిన పదేళ్లకు నేరుగా ఉపముఖ్యమంత్రి పదవి సంపాదించిన జనసేనాని తన సనాతన ధర్మ పరిరక్షణ మాటల ద్వారా ఇప్పుడప్పుడే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకున్నా.. పసుపు బట్టలతో దుర్గ గుడి మెట్లపై కనిపించిన తీరు ఆలోచనాపరులైన అత్యధిక కాపుల కడుపులు నింపుతోంది. వారి హృదయాలను మీటుతోంది…  (మెరుగుమాల నాంచారయ్య)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions