.
ఎహె, నేను రానుపో, ఆ దురంధర్ సినిమాకు… 3 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు అంటున్నారు, ఐనా సరే, నేను రాను, అసలు నేనెందుకు రావాలి..,? నా తెలుగు సినిమా కల్చర్ ఏమైనా ఉందా అందులో..? నా తెలుగు సినిమాతనం లేని సినిమాకు నేనెందుకు రావాలి అసలు..?
– నాన్సెన్స్, 3 నెలల వ్యవధిలోనే రెండు భాగాలు షూట్ చేసి, వదిలారట… అబ్సర్డ్, అందులో ఒకటి 4 గంటలట కూడా… అరె, కనీసం మూడేళ్లు తీసుకోవాలి కదా, ఎంతటి తోపు హీరో అయినా మూడేళ్లు అదే ప్రాజెక్టులో పడి కొట్టుకోవాలి, వేరే ఏమీ ఒప్పుకోకుండా, అసలు లుక్ కూడా బయటికి రావద్దు కదా, ఈ కల్చర్ ఆ దురంధర్ సినిమా నిర్మాణంలో ఏముంది..? లేదు..!
Ads
– దిక్కుమాలిన నాసిరకం గ్రాఫిక్స్ పెట్టేసి, వందల కోట్ల ఖర్చు చూపించాలి కదా… హీరోలకు వందల కోట్లు ధారాదత్తం చేయాలి కదా… ఆ ఖర్చు హైప్ చేసి, అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచేసి, జనం జేబుల్ని గుల్ల చేయాలి కదా… మరేమైంది ఈ సినిమాకు..?
– అసలు ఒక్క ఐటమ్ సాంగ్ కూడా లేదట… నీయమ్మని, నీయక్కని టైపు పాట, ఆ శేఖర్ మాస్టర్ స్టెప్పులు కూడా ఒక్కటీ లేవట… అసలు హీరోయిన్ పిరుదుల మీద చేతులతో బాదే స్టెప్పుల పాటల్లేని సినిమా కూడా ఓ సినిమాయేనా..? ఛల్ హఠ్, నేను ఈ సినిమాకు రానే రాను…
– ఇంకో దిక్కుమాలిన సంగతి… పాత సినిమాల సీన్లకు స్పూఫులు కూడా లేవట ఇందులో… పాత పాటలకు కొత్త స్టెప్పులు కూడా లేవట… అసలు పంచ్ డైలాగులు, ఆకాశానికెత్తే ఎలివేషన్లు లేకపోతే… నేనెందుకు సినిమాకు రావాలి, ఏం చూసి చప్పట్లు కొట్టాలి…?
– అసలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం దేశమంతా తిరిగిందా సినిమా టీమ్..? లేదు కదా… లాస్ట్ మినిట్ వాయిదాలున్నాయా..? లేవు కదా… ఓవర్ ప్రమోషన్స్ ఉన్నాయా..? లేవు కదా… పదే పదే సినిమా రిలీజ్ డేట్లు మార్చుతూ, షూటింగులు పొడిగిస్తూ… బాడీ డబుల్స్‌తో షూటింగ్ నడిపించే కథలూ ఉన్నాయా..? లేవు కదా… మరెందుకు రావాలి ఈ సినిమాకు..? నో, నేను రాను…
– పోనీ, సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉన్నాయా..? లేవు… లాజిక్ లేని సీన్లను పెట్టారా..? లేదు… పోనీ, స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్ల కథతో వాళ్లను గ్లోరిఫై చేశారా…? అదీ లేదు కదా… ఎవడికి కావాలి ఈ దేశభక్తి కథలు, ఈ ప్రాణాలకు తెగించే త్యాగాలు, సాహసాలు..? గంటాగంటన్నరలో జనం థియేటర్లను వదిలేసి పారిపోయేలా ట్రీట్‌మెంట్ ఉండాలి తప్ప, నాలుగు గంటలపాటు కుర్చీలో కట్టేసినట్టేనట… నో, నేను రానే రానబ్బా… ఈ సినిమాకు…
– పైగా సినిమాకు వస్తే నన్ను నేషనలిస్టు అంటారు, ప్రాపగాండా సపోర్టర్ అని ముద్రలేస్తారు… నా సెక్యులర్ పాతివ్రత్యం దెబ్బతింటుంది… అమ్మో, థియేటర్‌లో నన్నెవడైనా చూస్తే నాకెంత నామర్దా… ఆ పక్క థియేటర్‌లో ఎవరో భగత్ సింగ్ అట, దానికెళ్తాను… నన్ను డిస్టర్బ్ చేయకండి… ప్లీజ్, నేను దురంధర్ సినిమాకు రాను, మీరు వెళ్లండి..!!
Share this Article