నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి అనే సినిమాకు కొన్నిచోట్ల థియేటర్లలో 10 శాతం యాక్యుపెన్సీ కూడా లేదు, కొన్నిచోట్ల షోలు కేన్సిలయ్యాయి, రెండోరోజే వేరే సినిమాలతో రీప్లేస్ చేస్తున్నారనే ఒక వార్త నిజానికి ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు…
నవదీప్ అంటే గుర్తొచ్చేది చందమామ సినిమా… అప్పుడెప్పులో 2004లో… అంటే ఇరవై ఏళ్ల క్రితం తను నటించిన జై సినిమా నుంచి పరిశీలిస్తే ఒక్క చందమామ సినిమా మాత్రమే గుర్తుండటం ఏమిటి..? అదే నవదీప్ తన కెరీర్ మొత్తంలో సాధించిన ఆస్తి… నిజానికి చందమామ సినిమా కాజల్ సినిమా… అంతే…
ఇద్దరు హీరోలున్నా సరే, ఎవరి సినిమాగా కూడా రిజిష్టర్ కాదు మనకు… కొంతమేరకు ఆర్య-2, ఈమధ్య వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ కాస్త గుర్తొస్తాయి… ఇవి గాకుండా కొన్ని తమిళ సినిమాలు, బోలెడు టీవీ షోల హోస్టింగ్… అంతే… నిజానికి నవదీప్‌లో మంచి నటుడున్నాడు… ఎటొచ్చీ తనను పూర్తి స్థాయిలో ఆవిష్కరించగల ఒక్క పాత్ర ఇప్పటివరకూ పడలేదు…
Ads
తన అప్రోచ్ లోపమా..? ఇంకేదైనా కారణమా తెలియదు గానీ… ఓ విఫల ఆర్టిస్టు అనిపిస్తాడు… 38 ఏళ్ల ఈ హైదరాబాదీ ఎందుకో గానీ నష్టజాతకుడనీ అనిపిస్తాడు… ఒక్కటి మాత్రం నిజం… ఇండస్ట్రీలో ఓ ప్లేబాయ్ ఇమేజీ అయితే ఉంది… తనకు తగ్గట్టే ఆహా ఓటీటీలో డగవుట్ అనే ఓ సరదా రియాలిటీ షో కూడా అలాగే ఉంటుంది…
లవ్ మౌళి సినిమాకే వస్తే… ఫస్టఫాల్ తన లుక్కు ఈ సినిమాకు పెద్ద దరిద్రం… నవదీప్ బయటి ఇమేజీకి తగ్గట్టే ఈ పాత్ర కూడా తాత దగ్గర పెరుగుతూ తనకిష్టం వచ్చినట్టు బతికే పాత్ర… పైగా దానికి ఓ ఫాంటసీ యాంగిల్ జోడించారు… నవదీప్ నిజానికి అందగాడు… కానీ ఆ గడ్డం, ఆ మీసాలు, సన్యాసులు పెంచినట్టు జుట్టు, అదీ జడలు కట్టినట్టు… ఈ లుక్కుతో బోలెడు బోల్డ్ సీన్లు… హీరోయిన్‌తో రొమాన్స్… అదీ అస్సలు నప్పలేదు…
కేవలం బోల్డ్ సీన్లతో యువతను థియేటర్లకు రప్పిస్తామనే ఎవరైనా దర్శకుడు, ఎవరైనా నిర్మాత భావిస్తే అది ఈరోజుల్లో ఉత్త భ్రమ… ఫాఫం, దగ్గుబాటి రానా ఓ అఘోరాగా నటించినా… దాన్ని బయటకు వెల్లడించకుండా ఏ సర్ప్రైజ్ ఫ్యాక్టర్‌గా ఉంచేసినా సరే, అదీ పేలలేదు… అనవసరంగా రానా కూడా పరువు కోల్పోయాడు… ఈ సన్యాసి లుక్కు హీరోతో రొమాన్స్ చేస్తున్న హీరోయిన్ పంకూరీ గిద్వానీని చూస్తుంటే థియేటర్ వెళ్లిన యువ ప్రేక్షకులకు మరింత చిరాకు పుట్టినట్టుంది…
అనేకచోట్ల లాజిక్ లెస్ సీన్లు బోర్ కొడతాయి… సరే, హీరోగా దక్కిందే మహాభాగ్యం అనుకుని ఉంటాడు నవదీప్… ఏమో, లవర్స్, యూత్‌కు కనెక్టయితే సినిమా క్లిక్కవుతుందనీ ఆశపడొచ్చు దర్శకుడు… తనే ఎడిటర్ అట దీనికి… ప్చ్, అంతగా పండలేదు భయ్యా… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్… విత్ ఎ డిఫరెంట్ స్టోరీ, నాట్ ఓన్లీ బోల్డ్ సీన్స్…!!
Share this Article