గౌరవనీయ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి మరియు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రివర్యుల దివ్యసముఖమునకు-
మరియు ఏ శాఖలకు మా సమస్యలు వరిస్తాయో ఆయా శాఖల మంత్రులకు- ముఖ్యమంత్రులకు- ప్రధానికి-
ఊరూ పేరూ లేని సగటు భారతీయ నాలుగు చక్రాల వాహనాల యజమానులు వ్రాసుకొను బహిరంగ లేఖార్థములు.
మహారాష్ట్ర పూనాలో ఒకానొక శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిణి తన సొంత అత్యంత విలాసవంతమైన ఆడి కారుకు మహారాష్ట్ర ప్రభుత్వ లోగోను, అధికారిక బ్లూ బుగ్గను పెట్టుకున్న వార్త మాకెంతో ఆనందాన్ని చేకూర్చింది. (ఆమె క్రీమీ లేయర్ దిగువన ఉన్నట్లు ఏవేవో ఇతరేతర కాకి లెక్కల కాగితాలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కళ్లుగప్పి… ఐఏఎస్ కు ఎంపికయినట్లు; ఆమె తండ్రి ఎన్నికల అఫిడవిట్లో కోట్లకు కోట్ల ఆస్తులున్నట్లు సాక్ష్యంగా పత్రాలను సమర్పించడం; సహచర ఉద్యోగులను వేధించడం; సినిమా తారల్లా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ కంటెంట్ కోసం ఆరాటపడడం కూడా మా మనసు దోచిన విషయాలే అయినా… ప్రస్తుతం అవి అప్రస్తుతం కాబట్టి ఆ చర్చ ఇక్కడ అనవసరం)
Ads
ఆమె స్ఫూర్తితో మేము మీ దివ్యసముఖమునకు కొన్ని విషయాలు విన్నవించుకోదలుచుకుంటున్నాము. దయతో వీటిని పరిశీలించి… కేంద్ర క్యాబినెట్లో మరియు ఆయా రాష్ట్రాల క్యాబినెట్లలో చర్చించి… సానుకూలమైన నిర్ణయం తీసుకోగలరు.
1. రోజూ క్రీమ్ తినేంత సంపన్నులం కాము మేము. మా ఇళ్లల్లో ఫ్రిడ్జుల్లో ఎప్పుడో జన్మకో శివరాత్రిలా కొన్న క్రీమ్ గడ్డకట్టుకుపోయి… తినడానికి పనికిరాకుండా ఉంది. మళ్లీ జీవితంలో రెండోసారి క్రీమ్ కొనే ఆర్థిక స్థోమత మాకు లేదు కాబట్టి… గడ్డకట్టిన క్రీమీ లేయర్ కింద ఉన్న మమ్మల్ను కూడా ఆ అమ్మాయిలాగే గుర్తించి… మా పిల్లలకు కూడా అలాంటివే కాకి లెక్కల కాగితాలు ఇప్పించి… ఐఏఎస్ కు ఎంపికయ్యేలా పెద్దమనసుతో సహకరించగలరు.
2. మా నిరుపేద జీవితాల్లో వెలుగులకోసం కొనుక్కున్న బోడి ఆడీ కార్లన్నింటికీ బ్లూ బుగ్గలు ఇప్పించగలరు.
3. మా తాతలు తాగిన నేతుల మూతుల వాసనలకు ప్రతిఫలంగా మా గొడ్ల చావిళ్లలో కట్టేసిన బెంజులు, బిఎండబుల్యులకు ఎర్ర బుగ్గలు ఇప్పించగలరు.
4. మేము రోజూ వాడే మారుతీ 800కు సైరన్ కు అనుమతించగలరు.
5. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు మా వాహనాల మీద వేసిన పెనాల్టీలు కట్టకుండా బలాదూర్ గా తిరిగినా ఆ అమ్మాయిలాగే మమ్మల్ను కూడా వదిలేయగలరు.
6. నడిరోడ్లమీద మా బుగ్గల కార్లు పార్క్ చేసుకోవడానికి ఆ అమ్మాయికిచ్చినట్లే అనుమతులివ్వగలరు.
7. విచారణకు ఇంటికొచ్చిన అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఆ అమ్మాయి తల్లిలాగే మాకూ తగిన శిక్షణ ఇప్పించగలరు.
8. కూతురు ఆర్థికంగా కుంగినట్లు పైకి కనిపించి… అత్యున్నత ప్రభుత్వోద్యోగం పొందినా… తల్లిదండ్రుల అఫిడవిట్ పత్రాల్లో ఉన్న వేనకు వేల కోట్లు కనిపించకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో మాక్కూడా నేర్పగలరు.
9. ఇందులో ఏవైనా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంటే ప్రత్యేక సభలను నిర్వహించి… చర్చించి చట్టాలను మా దగ్గరి చుట్టాలను చేయగలరు.
10. చివరాఖరుగా- కార్ల కంపెనీలవారినందరినీ పిలిచి రంగు రంగుల బుగ్గలను, సైరన్లను అన్ని కార్లకు ఇన్ బిల్ట్ గా పెట్టాలని… అలా లేని కార్లను వెంటనే షో రూములనుండి రీకాల్ చేయాలని ఆదేశించగలరు…. – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article