.
బండి సంజయ్‌కు ఏమైనా తగ్గించుకోలేని తలనొప్పి ఉందీ అంటే… అది తన కొడుకు సాయి భగీరథే..! తను పార్టీపరంగా, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నా, ఆ మొత్తం పాజిటివిటీకి పంక్చర్ కొట్టేది తన కొడుకే… తాజాగా తనపై పోక్సో కేసు నమోదైంది… బండి సంజయ్‌కు తలవంపులే… అదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్న వేళ… ఓ కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు… పార్టీకి కూడా చిన్నతనమే…
ఇది రాష్ట్ర బీజేపీలో పెను సంచలనం… అంతేకాదు, పార్టీలోనే బండి సంజయ్‌ను వ్యతిరేకించే వర్గానికి ఓ పెద్ద అస్త్రాన్ని అందించినట్టు… మొన్న కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు బీఆర్ఎస్‌కు ఓ అస్త్రంగా మారి, చిన్నాచితకా నాయకులు కూడా కేంద్ర హోం సహాయ మంత్రే దాడులు చేయిస్తే ఎలా అంటూ విరుచుకుపడ్డారు… ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు మరో అస్త్రాన్ని చేజేతులా అందించినట్టయింది…
Ads
దానికి తోడు ఇప్పుడు కొడుకుపై ఏకంగా పోక్సో కేసు… ఈ అబ్బాయి గతంలో మహేంద్ర యూనివర్శిటీలో ఎవరో అబ్బాయిని చితకబాదిన వీడియో వైరల్ అయింది… కేసు కూడా నమోదైంది… తరువాత అలాంటి వీడియో మరొకటి విడుదలైంది… చాలా కంట్రవర్సీ కేరక్టర్ అంటున్నారు…
17 ఏండ్ల బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి, ఆల్కహాల్ తాగించి లైంగికదాడి చేశాడని అతనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు… మొయినాబాద్ ఫామ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో బాధితురాలిపై లైంగికదాడి జరిగినట్లు చెబుతున్నారు… దీంతో రెండు సార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందట…
శుక్రవారం రాత్రి బాధితురాలి తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు… అయితే కేసు నమోదు విషయంలో రాత్రి 6 గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా నడిచింది… చివరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు… కేసు వ్యవహారం సీఎం రేవంత్, డీజీపీ సీవీ ఆనంద్ వద్దకు కూడా చేరినట్లు సమాచారం…
కాగా, కేసు పెట్టకపోతే కోర్టుకు వెళ్తామని బాధితురాలి తల్లితండ్రులు చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు… బండి సంజయ్‌కు కొడుకు యవ్వారం ఖచ్చితంగా ఎప్పటికీ తలవంపులు, తలనొప్పి, తన ప్రజాజీవితానికి కూడా మరకే..!!
ఈలోపు మరో కథనం మీడియాలో ప్రచారానికి తీసుకొచ్చారు… ఇలా…
కేంద్ర మంత్రి కొడుకుపై హనీట్రాప్ అస్త్రం… కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడిని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీట్రాప్ మరియు ఎక్స్టార్షన్ (వసూళ్ల) ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి…
“కోర్టు” సినిమా కథను ఆదర్శంగా తీసుకు లేని “పోక్సో” ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేసే కుట్ర బయట పడింది.
ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ, ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది.
ఈ వేధింపులు, బెదిరింపులు ఎక్కువవడంతో, బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్‌లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు నుండి మూడు కోట్ల రూపాయలు వసూలు చేయాలని (Extortion), తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించారని “పోక్సో” కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తోంది.
డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడంతో, సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీట్రాప్ డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ “చలాకీ” మహిళా కార్యకలాపాలపై, గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు…….. ఇదేనిజమైతే సంజయ్ కొడుెకు ఫిర్యాదు వెలుగులోకి రాలేదు దేనికి..? ముందే మీడియాకు ఎందుకు వెల్లడించలేదు..? మరి పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు..? ఇంతకీ ఆమె ఎవరు..? పొలిటిషియన్స్ ఎవరైనా ప్రయోగించారా..? ఏమో, పోలీసులే క్లారిటీ ఇవ్వాలి మరి..!!
Share this Article